Site icon NTV Telugu

Rishi Sunak: ఖతార్‌పై రిషి సునాక్ ట్వీట్.. మండిపడుతున్న నెటిజన్స్

Rishi Sunak Criticised

Rishi Sunak Criticised

Rishi Sunak Tweet Criticised For Praising Qatar: ఖతార్‌పై బ్రిటన్‌ ప్రధానమంత్రి రిషి సునాక్‌ చేసిన ఓ ట్వీట్‌ ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. నెటిజన్లు ఆయన తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఎల్‌జీబీటీ వర్గానికి చెందిన వారు సైతం.. రిషి నుంచి అలాంటి ట్వీట్ ఊహించలేదంటూ నిరాశను వ్యక్తం చేసింది. ఇంతకీ రిషి చేసిన ట్వీట్ ఏమిటంటే.. ‘‘ఇప్పటివరకు ఫిఫా వరల్డ్‌కప్‌ను అద్భుతంగా నిర్వహించినందుకు ఖతార్‌కు హ్యాట్సాఫ్. గ్రూప్ స్టేజ్‌లో జరిగిన మ్యాచ్‌లు ఆల్‌టైమ్ గ్రేటెస్ట్‌లలోనే చిరస్మరణీయంగా నిలిచిపోతాయి. కమాన్ ఇంగ్లండ్, మీ జైత్రయాత్రను ఇలాగే కొనసాగిస్తూ, మన కలను సజీవంగా ఉంచండి (కప్ కొట్టంటి అన్నట్టుగా ఉత్సాహం నింపుతూ)’’. ఇదీ.. రిషీ చేసిన ట్వీట్. ఎవ్వరినీ కించపరచకుండా, ఖతార్‌పై పొగడ్తలు కురిపిస్తూ.. ఈ ట్వీట్ చేశాడు. ఇదే కొందరు నెటిజన్లకు నచ్చట్లేదు.

ఎందుకంటే.. ఖతార్‌లో కొన్ని విషయాలపై ఆంక్షలు ఉన్నాయి. అక్కడ ఎల్‌జీబీటీ కమ్యూనిటీని బ్యాన్ చేశారు. కాబట్టి, ఆ వర్గానికి చెందిన వారు ఈ ఫిఫా వరల్డ్‌కప్‌కి హాజరు కాలేని పరిస్థితి నెలకొంది. అలాగే, ఈ ఫుట్‌బాల్ స్టేడియం నిర్మిస్తున్నప్పుడు కొందరు కార్మికులు మృతి చెందిన సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ విషయంపై అప్పట్లో తీవ్రస్థాయిలో అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. దీనికితోడు.. ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా చాలామంది రకరకాల సమస్యలు ఎదుర్కున్నారు. ఈ విషయాలన్నింటినీ లేవనెత్తుతూ.. ‘‘రిషీ సునాక్, ఇవి మీ కంటికి కనిపించడం లేదా?’’ అని నిలదీస్తున్నారు. ఖతార్ ఈ వరల్డ్‌కప్‌గా మీరు చెప్పినంత గొప్పగా నిర్వహించట్లేదని, మీరు ఏం చూసి ఇలా చెప్తున్నారో మాకు అర్థం కావడం లేదని రిషీపై మండిపడుతున్నారు. జూలియా హార్ట్‌లీ బ్రూవర్ అనే బ్రాడ్‌కాస్టర్ రిషీ ట్వీట్‌ని రీట్వీట్ చేస్తూ.. ‘‘ఒక మంచి ఫుట్‌బాల్ టీమ్ ఉన్నప్పుడు, స్టేడియం కింద సమాధి అయిన కార్మికులు, స్వలింగ సంపర్కుల్ని హింసించిన సంఘటనలు కనిపించవు’’ అంటూ చురకలంటించింది.

ఇక ఎల్‌జీబీటీ గ్రూప్‌కి చెందిన వారైతే.. ‘‘భావ ప్రకటన స్వేచ్ఛను హరించడం, సెక్యూరిటీ వివక్షత, అభిమానులు ఎదుర్కొన్న ఇతర సంస్థాగత సమస్యలను పూర్తిగా విస్మరించిన రిషీ సునాక్‌కు రెయిన్‌బో బకెట్ శుభాకాంక్షలు’’ అంటూ కౌంటర్ ఎటాక్ చేశారు. ఖతార్‌ను పొగుడుతూ ప్రధాని రిషీ చేసిన ఆ ట్వీట్ చూసి తాము చాలా నిరుత్సాహానికి గురయ్యామని, అసలు ఆయన నుంచి అలాంటి ట్వీట్ ఊహించలేదని తమ అసంతృప్తి వ్యక్తం చేశారు. కాగా.. సెనెగల్‌పై ఇంగ్లండ్ 3-0 తేడాతో గెలుపొందిన నేపథ్యంతో క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకుంది. డిసెంబర్ 11న ఇంగ్లండ్ డిఫెండింగ్‌ ఛాంపియన్స్‌ ఫ్రాన్స్‌తో తలపడనుంది.

Exit mobile version