Rishi Sunak: యూకే ప్రధాని రిషి సునాక్ సంచలన నిర్ణయం తీసుకునే దిశగా వెళ్తున్నట్లు తెలుస్తోంది. 16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా యాక్సెస్ బ్యాన్ చేసేందుకు అక్కడి ప్రభుత్వం అధ్యయనం చేస్తోంది. అయితే దీనిపై చర్చల విషయాన్ని గోప్యంగా ఉంచుతున్నాయి అక్కడి ప్రభుత్వ వర్గాలు. సోషల్ మీడియా వల్ల పిల్లలపై ఎంత వరకు హాని కలుగుతుందనే విషయంపై మంత్రులు జనవరి నుంచి సంప్రదింపులు ప్రారంభించాలని యోచిస్తున్నారు.
Read Also: Hamas War: ఇజ్రాయిల్ తదుపరి లక్ష్యం హమాస్ నాయకత్వమే.. అమెరికా కీలక వ్యాఖ్యలు..
ప్రస్తుతం ఈ అంశంపై చర్చలు ప్రారంభ దశలోనే ఉన్నాయి. నిషేధం లేదా తల్లిదండ్రుల నియంత్రణ వంటి చర్యలపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. పిల్లలను ఆన్లైన్ నుంచి సురక్షితంగా ఉంచే విధంగా విస్తృతంగా పరిశీలిస్తున్నామని రిషి సునాక్ ప్రతినిధి కెమిల్లా మార్షల్ గురువారం మీడియాతో తెలిపారు. నిర్ధిష్ట చర్యలపై వ్యాఖ్యానించడానికి నిరాకరించారు. ఇటీవల యూకే ప్రభుత్వం ‘‘ఆన్లైన్ సెఫ్టీ యాక్ట్’’ తీసుకువచ్చింది. ప్రజలను, ముఖ్యంగా పిల్లలను రక్షించడానికి యూజర్ టూ యూజర్ సేవలను అందించే కంపెనీల బాధ్యతలను పెంచడానికి ఆన్లైన్ భద్రతా చట్టాన్ని ఆమోదించింది.
ఇటీవల ఎన్‌క్రిప్టెడ్ మెసేజింగ్‌ని ప్రవేశపెట్టాలని మెటా నిర్ణయం తర్వాత పిల్లల భద్రత గురించి నేషనల్ క్రైమ్ ఏజెన్సీ వారి తల్లిదండ్రులను ఫేస్‌బుక్ యాక్సెస్ గురించి హెచ్చరించింది. గురువారం విద్యాశాఖ మంత్రి డామియన్ హిండ్స్ మాట్లాడుతూ.. మెటా తన నిర్ణయాన్ని పునరాలోచించమని కోరారు. ఇది ప్రజల గోప్యతను రక్షించడం గురించి కాదని.. ఇది పిల్లల దుర్వినియోగంలో వ్యక్తులను అడ్డుకోవడం, దర్యాప్తు చేయడం, న్యాయం చేసే సామర్థ్యాలకు సంబంధించిన విషయమని హిండ్స్ టైమ్స్ రేడియోతో చెప్పారు.
