ఆఫ్ఘనిస్తాన్‌లో ప్రస్తుతం పరిస్థితులు దారుణంగా మారిపోయాయి. ఇప్పుడు ఎక్కడ చూసినా హృదయవిదారక దృశ్యాలే కనిపిస్తున్నాయి. ఆగస్టు 15 కి ముందు ఆ కాబూల్‌లో పరిస్థితులు ఎలా ఉన్నాయో ఆగస్టు 15 తరువాత పరిస్థితులు ఎలా మారిపోయాయో అందిరికి తెలిసిందే. ఆగస్టు 15కి ముందు కాబూల్ నగరంలో యువత చాలా మోడ్రన్‌గా కనిపించేవారు. జీన్స్, టీషర్ట్ తో పాశ్ఛాత్య సంస్కృతికి ఏ మాత్రం తీసిపోకుండా కనిపించేవారు. 24 గంటలు ఆ నగరంలో బయట యువత సంచరించేవారు. అయితే, ఆగస్టు 15 తరువాత పూర్తిగా మారిపోయింది. పెద్ద వయసువారితో పాటుగా, యువత కూడా సాధారణ దుస్తులు ధరించి బయటకు రావడం మొదలుపెట్టారు. జీన్స్ వేసుకున్నవ్యక్తులు మచ్చుకైనా కనిపించలేదు. ఇక మహిళల సంగతి చెప్పాల్సిన అవసరం లేదు. మహిళలు నిండుగా బురఖా ధరించి మాత్రమే బయటకు వస్తున్నారు. కుటుంబ సభ్యుల తోడు లేకుండా ఒంటరిగా బయటకు వచ్చారు అంటే తిరిగి ఇంటికి వస్తారో లేదో చెప్పలేని పరిస్థితి. ఆఫ్ఘన్‌ను తాలిబన్లు ఆక్రమించుకున్నాక తాము గత పాలకులకు భిన్నంగా పరిపాలన సాగిస్తామని, మహిళలకు రాజకీయాల్లో ప్రాధాన్యత కల్పిస్తామని చెబుతున్నా, దానికి భిన్నంగా పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆఫ్ఘన్ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా యువత ఆ దేశ జాతీయ జెండాను చేతపట్టి బయటకు వచ్చారు. వీరిపై తాలిబన్లు కాల్పులు జరిపారు. అలానే, బయటకు వచ్చిన అనేక మంది మహిళలపై తాలిబన్లు విరుచుకుపడిన సంగతి తెలిసిందే.
ఐదు రోజుల్లోనే మొత్తం మారిపోయింది… ఇప్పుడు ఎక్కడ చూసినా…
