లండన్‌లో జరిగిన ఎన్నికల్లో లేబర్ పార్టీ భారీ ఘనవిజయం నమోదు చేసింది. దాదాపు 400 సీట్లకు పైగా గెలుచుకుంది. దీంతో ప్రధాన మంత్రిగా కీర్ స్టార్మర్ ఎన్నికయ్యారు అలాగే కింగ్ ఛార్లెస్-3 కూడా కీర్ నియామకాన్ని ఆమోదించారు.
ఇక యూకే ఆర్థికమంత్రిగా రాచెల్ రీవ్స్(45) ఎంపికయ్యారు. యూకేకు మొదటి మహిళ ఆర్థిక మంత్రిగా ఎన్నికయ్యారు. రాచెల్ రీవ్స్‌ను ఆర్థికమంత్రిగా నియమించినట్లు ప్రధాని మంత్రి కీర్ స్టార్మర్ ఎక్స్ వేదిక ద్వారా తెలియజేశారు. బలమైన ఆర్థిక క్రమశిక్షణను ప్రదర్శిస్తూనే దేశ ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేస్తానని రాచెల్ రీవ్స్ ప్రతిజ్ఞ చేశారు.
లేబర్ పార్టీ తన ఎన్నికల మ్యానిఫెస్టోలో ఆర్థిక వ్యవస్థను ప్రధానాంశంగా ఉంచింది. ప్రభుత్వంలో వృద్ధి, సంపద సృష్టిని ప్రధాన ప్రాధాన్యతలుగా లక్ష్యంగా చేసుకుంది. ఆర్థిక వృద్ధే లేబర్ పార్టీ లక్ష్యమని రాచెల్ రీవ్స్ ప్రకటించారు.
రాచెల్ రీవ్స్ బ్యాగ్రౌండ్ ఇదే..
రాచెల్ రీవ్స్ లండన్‌లో జన్మించారు. తల్లిదండ్రులు ఉపాధ్యాయులు. ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలో తత్వశాస్త్రం, రాజకీయాలు, ఆర్థిక శాస్త్రాలను అభ్యసించారు. ఇక 14 సంవత్సరాల వయస్సులో బ్రిటీష్ బాలికల చెస్ ఛాంపియన్‌గా గెలిచారు. ఆ తర్వాత లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో మాస్టర్స్ డిగ్రీని పొందారు. గ్రాడ్యుయేషన్ తర్వాత ప్రైవేట్ రంగానికి మారడానికి ముందు బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్‌లో ఒక దశాబ్దం పాటు ఆర్థికవేత్తగా పనిచేశారు. 2010లో లిబరల్ డెమోక్రాట్‌లతో సంకీర్ణంలో కన్జర్వేటివ్‌లు అధికారంలోకి వచ్చినప్పుడు రీవ్స్ ఉత్తర ఇంగ్లాండ్‌లోని లీడ్స్ వెస్ట్‌కు లేబర్ పార్టీ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. పదకొండు సంవత్సరాల తర్వాత స్టార్మర్ ఆమెను లేబర్ ప్రభుత్వంలో ఆర్థిక ప్రతినిధిగా నియమించారు. ఆమె సోదరి ఎల్లీ రీవ్స్ కూడా లేబర్ పార్టీ ఎంపీ కావడం విశేషం.