Site icon NTV Telugu

Putin Strategy: పుతిన్ మాటలకు అర్థాలే వేరట?

ఇప్పుడు ప్రపంచమంతటా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గురించే మాట్లాడుకుంటున్నారు. ఆయన స్టయిలే వేరంటున్నారు. పుతిన్ మాటలకు అర్థాలే వేరు?పుతిన్ యస్ అన్నాడంటే..అది నో….నో అన్నాడంటే అది పక్కా ఎస్. మాట ఒకటి…చేత ఇంకోటి. మొన్న క్రిమియాపై అదే బాట. ఆ తర్వాత డాన్ బాస్ పై అదే పాట. ఉక్రెయిన్ వార్ పై అదే తీరు. ఇప్పుడు లేటెస్టుగా ఆయన నోటి నుంచి జాలువారిన మరో డైలాగ్ బాంబ్, అణ్వస్త్ర సంసిద్ధత. మరి రష్యా అధ్యక్షుడి మాటలకు అర్థాలేవేరనుకుంటే, న్యూక్లియర్ ప్రిపరేషన్ డైలాగ్ ను ఎలా ఆలోచించాలి. అణ్వస్త్రాల మాటెత్తితే జనం అంతా వణికిపోతున్నారు.

చెప్పిన మాట చెయ్యకపోవడం పుతిన్ స్టైల్. మరి అణ్వస్త్ర వినియోగానికి సిద్ధం కావాలనడంలో అసలు మతలబు ఏంటి? న్యూక్లియర్ బటన్ నొక్కేస్తాడా? అంతర్జాతీయ నిపుణులకు అంతుబట్టని బ్రహ్మపదార్థం పుతిన్. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వ్యవహారం మొదటి నుంచీ ఇంతే. చెయ్యనంటూనే చేస్తాడు. చేస్తానంటూనే చెయ్యడం. గూఢచారిగా తెలివిమీరిన పుతిన్ కావాలనే ఇలా గందరగోళం చేస్తాడా…ప్రత్యర్థులను తికమకలో పెట్టేసి అదును కోసం కదనరంగం సిద్దం చేసుకుంటాడా…తర్జనభర్జనలతో తెగించేస్తాడా…గర్జనలకే పరిమితమవుతా అంటూ అంతర్జాతీయ నిపుణులకు ఒక పట్టాన అంతుబట్టడు బ్రహ్మపదార్థం వ్లాదిమిర్ పుతిన్. ఉక్రెయిన్ పై యుద్ధానికి దిగుతాడని ఎవ్వరూ ఊహించలేదు..కానీ వార్ సైరన్ మోగించాడు. అంతెందుకు క్రిమియాను టచ్ చెయ్యమంటూ పుతిన్ చాలాసార్లు సంకేతాలిచ్చాడు…కానీ క్రిమియాను ఆక్రమించాడు. డోన్ బాస్ లో యుద్ధం మొదలెట్టడులే అనుకున్నారు…కానీ డొంటెస్క్స్, లుహాంస్క్ లపై దండెత్తాడు. ఉక్రెయిన్ పై పూర్తిస్థాయి యుద్ధానికి దిగడని ప్రపంచం అనుకుంది…పుతిన్ కూడా వార్ దిగే అవకాశమే లేదని చాలాసార్లు అన్నాడు..కానీ భీకర యుద్ధం సాగించాడు.

అందుకే పుతిన్ విషయంలో చెయ్యడులే అంటే చేస్తాడు…ఔను అన్నాడంటే…కాదని. కాదన్నాడంటే అది పక్కా ఔనని…మరి న్యూక్లియర్ బటన్ నొక్కడులే అనుకుంటే…..సమాధానం నొక్కేస్తాడు అనా…? అణ్వస్త్రాల బూజు దులపాలన్న పుతిన్ ఆదేశాల అర్థమేంటి? ఇది ఉక్రెయిన్ భయమొక్కటే కాదు….యూరప్ వణుకు..అమెరికా అలజడి..ప్రపంచ కంగారు పడుతోంది. ఒకవైపు శాంతి అంటూ సమరనినాదం మోగిస్తున్నాడు రష్యా అధ్యక్షుడు. చర్చలంటూనే ఉక్రెయిన్ ను ధ్వంసం చేస్తున్నాడు. సమాలోచనలు జరుపుదాం రా అంటూ అదే టైంలో అణ్వాయుధ వినియోగానికి సంసిద్ధంగా ఉండాలంటూ తమ సేనలకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ఆదేశాలు జారీ చేయడం, ఇప్పుడు ప్రకంపనలు రేపుతోంది. ఉక్రెయిన్‌కు పాశ్చాత్య దేశాలు ఆయుధాలు ఇస్తుండటం, రష్యాపై ఆర్థిక ఆంక్షలు విధిస్తుండటం..స్విఫ్ట్ నుంచి రష్యాను పక్కనపెట్టేలా అడుగులు పడటంతో, ఉక్కిరిబిక్కిరి అవుతున్నపుతిన్‌, తిక్కరేగి అణ్వస్త్రాల ప్రయోగానికి సై అంటే పరిస్థితి ఏంటనేది అందరి ముందున్న ప్రశ్న.

పుతిన్ అణ్వస్త్ర బెదిరింపులు తేలిగ్గా తీసుకోవడానికి వీల్లేదంటున్నారు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు. కొంతకాలంగా అణ్వాయుధాలపై పుతిన్ సమీక్షలు, చర్చలు ఆందోళనకరమని అన్నారు. నాటో దేశాల ఆర్థిక ఆంక్షలు, బలగాల తరలింపు, తన దేశభద్రతకు ముప్పుగా పుతిన్ భావిస్తే, దేనికైనా తెగిస్తాడని అనుమానిస్తున్నారు. రష్యా దగ్గర అణ్వాయుధ బలమెంత? ఉక్రెయిన్ విషయంలో ఏ దేశం జోక్యం చేసుకున్నా ఊరుకునేదిలేదని కొన్ని రోజుల క్రితం హెచ్చరించాడు వ్లాదిమిర్ పుతిన్. ఆర్థిక ఆంక్షలకు దానికి టిట్ ఫర్ టాట్ గా ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ ను కూల్చేస్తామన్నారు. ఇప్పుడు తాజాగా అణ్వస్త్రాల వినియోగానికి రెడీగా వుండాలని సంబంధిత సిబ్బందికి ఆదేశాలిచ్చారు. పుతిన్ వ్యాఖ్యలు ప్రత్యక్ష అణుయుద్ధ ముప్పుగా ప్రతిధ్వనిస్తున్నాయని నోబెల్ శాంతి బహుమతి గ్రహీత దిమిత్రి మురటోవ్ వ్యాఖ్యానించారు. క్రెమ్లిన్ అధిపతిగా పుతిన్ మాట్లాడ్డం లేదని, మాస్టర్ ఆఫ్ ది ప్లానెట్ గా బెదిరిస్తున్నట్టుందని చెబుతున్నారు. పుతిన్ ఏ క్షణం ఏం చేస్తాడో, ఎలాంటి దుందుడుకు నిర్ణయం తీసుకుంటాడో చెప్పలేమంటున్నారు.

రష్యా అణ్వస్త్ర సామర్థ్యంపై ఇప్పుడు ప్రపంచమంతా చర్చ జరుగుతోంది. సోవియట్‌ యూనియన్‌ పతనం తర్వాత రష్యాకు పెద్ద సంఖ్యలో అణ్వాయుధాలు వాటాలో భాగంగా పోగుపడ్డాయి. ఆ తర్వాతికాలంలో ఒప్పందంలో భాగంగా వాటిని గణనీయంగా తగ్గించుకుంది. అయినా ఇప్పటికీ ప్రపంచంలో అతిపెద్ద న్యూక్లియర్ వార్ హెడ్ కారాగారం మాస్కో సొంతం. స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ సంస్థ ప్రకారం, ప్రకారం ప్రస్తుతం రష్యా వద్ద 6500 అణ్వస్త్రాలు ఉన్నాయి. వాటిలో 1,588 వార్‌హెడ్లను బాలిస్టిక్‌ క్షిపణుల్లో, భారీ బాంబర్‌ యుద్ధవిమానాల స్థావరాల్లో మోహరించినట్టు తెలుస్తోంది. మిగతావాటిని రిజర్వులో ఉంచిందని సమాచారం.

2005లో మిసైల్ లాంచ్ ను ప్రత్యక్షంగా వీక్షించారు పుతిన్. ఈ మిసైల్ న్యూక్లియర్ వెపన్ ను మోసుకెళ్లగలదు. దీనిపై అప్పట్లో ప్రపంచ దేశాలు తీవ్రంగా స్పందించాయి. అంతర్జాతీయ అణు ఒప్పందాలకు విరుద్దంగా, అణ్వస్త్రాలను రహస్యంగా రష్యా పెంచుకుంటోందని ఆరోపించాయి. 2018లో పుతిన్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యాను వినాశనం చెయ్యడానికి మరో దేశం ప్రయత్నిస్త, దాన్ని నిలువరించడం, తమ న్యాయపరమైన హక్కుగా అభివర్ణించారు పుతిన్. ఇదంతా ప్రపంచ వినాశనానికే దారితియ్యొచ్చు, మానవవాళికి మరణశాసం రాయ్యొచ్చు….అయినా రష్యా పౌరుడిగా, దేశాధినేతగా తప్పకుండా గట్టి బదులిస్తానన్నారు. రష్యాలేని ప్రపంచం ఎందుకని ప్రశ్నించిన పుతిన్, తాను దేనికైనా రెడీ అని సమర సంకేతమిచ్చారు. అందుకే పుతిన్ అణ్వస్త్ర సన్నద్దత ఆదేశాలను అంత ఈజీగా కొట్టిపారేయలేమంటున్నాయి యూరోపియన్ దేశాలు.

రష్యా వద్ద ఖండాంతర క్షిపణులున్నాయి. ప్రయోగించిన 10 నిమిషాల తర్వాత సెకనుకు నాలుగు మైళ్ల వేగాన్ని రీచ్ కాగలవు. ఈ లెక్కన అవి బ్రిటన్‌ను 20 నిమిషాల్లో చేరుకోగలవు. న్యూక్లియర్ వెపన్ ప్రయోగానికి ఒక కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ ను డిజైన్ చేసుకుంది రష్యా. దీని ప్రకారం అణుబాంబు ప్రయోగానికి దేశాధ్యక్షుడు ఆదేశిస్తే సరిపోతుంది. లేదంటే రక్షణ మంత్రి లేదా చీఫ్‌ ఆఫ్‌ ద జనరల్‌ స్టాఫ్‌ నుంచి పర్మిషన్ తీసుకోవాలి. చెగెట్‌ అణు సూట్‌కేస్‌ ద్వారా అత్యంత పకడ్బందిగా, భద్రంగా సాగుతుందీ ప్రాసెస్. వీటి ఆధారంగా అణ్వస్త్రాలను అన్‌లాక్‌ చేసి, ప్రయోగానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే పవర్, ఆర్మీ ఆఫీసర్లకు వుంటుంది. ఉక్రెయిన్‌ యుద్ధంలో ఇప్పటివరకూ అటు అణ్వస్త్రాలు, ఇటు సాధారణ ఆయుధాలనూ ప్రయోగించే డ్యుయెల్‌ కేపబుల్‌ వాహనాలను ఉక్రెయిన్‌ సరిహద్దుల్లో మోహరించింది రష్యా.

అమెరికా, ఐరోపా దేశాలు రష్యాపై ఆర్థిక ఆంక్షలు విధిస్తున్నాయి. దీంతో పుతిన్ ముందు రెండు ఆప్షన్స్ వున్నాయని, రష్యాకే చెందిన రక్షణ రంగ నిపుణులంటున్నారు. అందులో ఒకటి యూరప్ కు గ్యాస్ సరఫరా బంద్ చెయ్యడం. దీని ద్వారా యూరప్ స్తంభించిపోతుంది. ఇక రెండోది, బ్రిటన్ డెన్మార్క్ నడుమ నార్త్ అట్లాంటిక్ సముద్రంలో న్యూక్లియర్ బాంబ్ జారవిడవడం చేస్తారు. ఒకవేళ నిజంగా వ్లాదిమిర్ పుతిన్ న్యూక్లియర్ బటన్ ను నొక్కాలని డిసైడయితే, అతని సహచరులు ఎలాంటి అభ్యంతరాలూ చెప్పరా అన్న ప్రశ్న ఉదయిస్తుంది. అయితే, వాళ్లెప్పుడూ పాలకుడి పక్షమేనంటున్నారు రష్యా రాజకీయ నిపుణులు. రష్యా పొలిటికల్ లీడర్స్ కు ప్రజలతో సంబంధాలు పరిమితమని గుర్తు చేస్తున్నారు. రష్యా పాలకుడిగా పుతిన్ అత్యంత శక్తివంతుడు. దుందుడుకు స్వభావం వున్న నాయకుడు. ఎప్పుడేం చేస్తాడో చెప్పలేమంటున్నారు.

Exit mobile version