NTV Telugu Site icon

Donald Trump: ట్రంప్ ప్రతిపాదనకు పుతిన్ అంగీకారం.. చైనా నుంచి తిరస్కారం..

Donald Trump

Donald Trump

Donald Trump: రక్షణ ఖర్చులను 50 శాతం తగ్గించుకోవాని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రతిపాదనను రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్వాగతించారు. రక్షణ ఖర్చల్ని తగ్గించుకోవాలని అమెరికా రష్యా, చైనాలకు ప్రతిపాదన చేసింది. ఒకప్పుడు ఉప్పు నిప్పుగా ఉండే అమెరికా,రష్యాల మధ్య ట్రంప్ రావడంతో స్నేహం చిగురిస్తున్నట్లు కనిపిస్తోంది.

ఆశ్చర్యకరంగా ట్రంప్ ప్రతిపాదనకు పుతిన్ ఆమోదం తెలిపారు. ఇది ‘‘మంచి ప్రతిపాదన’’ అని పుతిన్ పేర్కొన్నారు. ఇటువంటి ఫలితాలను అన్వేషించడానికి మాస్కో చర్చలకు సిద్ధంగా ఉందని ప్రకటించారు. అయితే, విస్తరణవాదంతో అన్ని సరిహద్దు దేశాలతో గొడవలు పెట్టుకుంటున్న చైనా అధ్యక్షుడు జి జెన్‌పింగ్ మాత్రం ఈ ప్రతిపాదనను తిరస్కరించారు.

ఒక టీవీ ఇంటర్వ్యూలో అధ్యక్షుడు ట్రంప్ ప్రతిపాదనపై మాస్కో వైఖరి ఏమిటని అడిగినప్పుడు, అధ్యక్షుడు పుతిన్ మాట్లాడుతూ, “ఇది మంచి ఆలోచన అని నేను భావిస్తున్నాను. అమెరికా తన రక్షణ బడ్జెట్‌ను 50 శాతం తగ్గిస్తుంది , మనం కూడా 50 శాతం తగ్గిస్తాం, ఆపై చైనా కూడా చేరితే, అంగీకారం కుదురుతుంది” అని అన్నారు. చైనా తరుపున తాను మాట్లాడటం లేదని చెబుతూనే, రష్యా మాత్రం ఖచ్చితంగా చర్చలకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు.

Read Also: PURE EV: పండగ వేళ ప్యూర్ ఈవీ బంపరాఫర్.. ఏకంగా రూ. 40 వేల క్యాష్‌బ్యాక్!

ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి రష్యా తన రక్షణ వ్యయాన్ని గణనీయంగా పెంచింది. రష్యా జీడీపీలో దాదాపుగా 9 శాతం ఉన్నాయని అధ్యక్షుడు పుతిన్ అంగీకరించాడు. రక్షణ ఖర్చుల్లో అమెరికా ప్రతిపాదనకు రష్యా ఓకే చెప్పడం చూస్తే, ఉక్రెయిన్మ యుద్ధవిరమణ వైపు ప్రయాణిస్తున్నట్లు కనిపిస్తోంది. మాస్కో తీసుకున్న నిర్ణయం యూరప్, నాటో మిత్ర దేశాలకు కూడా ఒకింత ఆనందాన్ని కలిగించే వార్తే

అయితే, ఈ ప్రతిపాదనకు చైనా మాత్రం అంగీకరించడం లేదు. అమెరికా, రష్యాలు తమకు నచ్చినట్లు చేసుకోవచ్చని, దీంట్లో చైనాకు మాత్రం ఆసక్తి లేదని, బీజింగ్ ఖచ్చితంగా భాగస్వామిగా ఉండదని డ్రాగన్ కంట్రీ స్పష్టం చేసింది. చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి లిన్ జియాన్ మాట్లాడుతూ, “చైనా రక్షణ వ్యయం పరిమితం. దాని సార్వభౌమాధికారం, భద్రత, అభివృద్ధి ప్రయోజనాలను కాపాడుకోవడానికి అవసరం” అని అన్నారు. చైనా సైనిక బడ్జెట్ దేశీయ, ప్రాంతీయ భద్రతా అవసరాలను తీర్చాల్సి ఉంటుందని, అలాగే ప్రపంచ శాంతికి దోహదపడుతుందని చెప్పారు. చైనా ఆత్మరక్షణ వ్యూహాన్ని పాటిస్తుందని, ఏ దేశంతోనూ ఆయుధ పోటీలో పాల్గొనదని చెప్పారు. ప్రపంచంలో అమెరికా తర్వాత అత్యధికంగా సైన్యంపై ఖర్చు చేస్తున్న దేశం చైనా. 236 బిలియన్ డాలర్లను ఖర్చు చేసోంది. 2024 వార్షిక బడ్జెట్లో రక్షణ బడ్జెట్‌ని 7.2 శాతానికి పెంచింది.

ట్రంప్ ఇటీవల మాట్లాడుతూ.. మనం 1 ట్రిలియన్ డాలర్లను సైన్యంపై ఖర్చు చేయడానికి ఎలాంటి కారణం లేదని జిన్‌పింగ్, పుతిన్‌లకు సూచించారు. సైనిక ఖర్చును 50 శాతం తగ్గించుకుందామని కోరారు. మనం దీనిని చేయగలని భావిస్తున్నాను అంటూ ట్రంప్ కామెంట్స్ చేశారు.