Site icon NTV Telugu

US: లాస్ ఏంజిల్స్‌లో తీవ్ర ఉద్రిక్తతలు.. పోలీసులు-ఆందోళనకారుల మధ్య ఘర్షణ

Us

Us

అక్రమవలసదారులపై గత కొంతకాలంగా ట్రంప్ పరిపాలన ఉక్కుపాదం మోపుతోంది. ట్రంప్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఈ కార్యక్రమం కొనసాగుతోంది. తాజాగా లాస్‌ఏంజిల్‌లో తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఆందోళనకారులపై పోలీసులు బాష్పవాయుగోళాలు ప్రయోగించారు. పెప్పర్ స్ర్పే కూడా ప్రయోగించారు. దీంతో పోలీసులుపై నిరసనకారులు రాళ్లు రువ్వారు. అంతేకాకుండా ఆందోళనకారులు వాహనాలకు నిప్పులు పెట్టారు. దీంతో పదుల కొద్ది వాహనాలు తగలబడ్డాయి. ఇక పరిస్థితి చేయి దాటడంతో ట్రంప్.. 2 వేల మంది నేషనల్‌ గార్డ్స్‌ను రంగంలోకి దింపారు. అంతేకాకుండాకాలిఫోర్నియా గవర్నర్‌ గావిన్‌ నూసమ్, లాస్ ఏంజిల్స్‌ మేయర్‌ కరెన్‌ బాస్‌పై విరుచుకుపడ్డారు. ఆందోళనలను సమర్థంగా అడ్డుకోలేదని ధ్వజమెత్తారు. ఇక నుంచి నిరసనకారులు ముఖానికి మాస్కులు ధరించడానికి అనుమతించబోమని చెప్పారు.

ఇది కూడా చదవండి: Chintha Chiguru: అనేక రోగాలకు దివ్య ఔషధంగా చింత చిగురు..!

ఇక నేషనల్‌ గార్డ్స్‌ను రంగంలోకి దింపడంపై గవర్నర్‌ గావిన్‌ నూసమ్‌ అభ్యంతరం వ్యక్తంచేశారు. ఈ నిర్ణయం ఉద్రిక్తతలను మరింత పెంచుతుందని వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే ఫెడరల్‌ అధికారులపై, పోలీసులపై ఎవరు దాడి చేసినా జైలుకెళ్లడం ఖాయమని ఎఫ్‌బీఐ డైరెక్టర్‌ కాష్‌ పటేల్‌ హెచ్చరించారు.

ఇది కూడా చదవండి: Israel: హమాస్ చీఫ్ మొహమ్మద్ సిన్వర్ మృతదేహం స్వాధీనం చేసుకున్న ఐడీఎఫ్

గత కొద్ది రోజులుగా లాస్ ఏంజిల్‌లో ఇమ్మిగ్రేషన్, కస్టమ్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ (ఐసీఈ) అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. వారం రోజుల్లో 118 మందిని అరెస్టు చేశారు. శుక్రవారం 44 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలోనే ఘర్షణలు తలెత్తాయి. సర్వీస్‌ ఎంప్లాయీస్‌ ఇంటర్నేషనల్‌ యూనియన్‌ కాలిఫోర్నియా అధ్యక్షుడు డేవిడ్‌ హుయెర్టాను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఆందోళనకారులు ఫెడరల్‌ భవనం దగ్గరకు చేరుకుని.. విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. అక్రమ వలసదారులను దేశం నుంచి పంపడానికి అమెరికా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో భాగంగానే డేవిడ్‌ హుయెర్టాను అరెస్ట్‌ చేసినట్లు అధికారులు స్పష్టం చేశారు.

ఇక లాస్ ఏంజిల్స్‌లో నివసిస్తున్న మాజీ అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ మాట్లాడుతూ.. ఇమ్మిగ్రేషన్ అరెస్టులు, గార్డుల మోహరింపు భయాందోళన కలిగిస్తున్నాయని.. అంతేకాకుండా విభజనకు దారి తీస్తోందని వ్యాఖ్యానించారు. ఇది క్రూరమైన చర్యగా అభివర్ణించారు. అత్యంత ప్రాథమిక హక్కులు మరియు స్వేచ్ఛలను కాపాడటానికి నిలబడే వారికి తాను మద్దతు ఇస్తున్నానని ఆమె అన్నారు.

Exit mobile version