NTV Telugu Site icon

Fifa World Cup: ఇంటిదారి పట్టిన ఇరాన్.. సంబరాలు జరుపుకున్న ఇరాన్ ప్రజలు

Iranian Celebrates

Iranian Celebrates

Protesters celebrate Iran defeat against US in FIFA World Cup: క్రీడల్లో తమ జట్టు ఓడిపోతే.. ఆ దేశపు ప్రజలు సంబరాలు జరుపుకుంటారా? క్రీడాకారులు సరిగ్గా ప్రదర్శించలేదని దుమ్మెత్తి పోస్తారు. కోపంతో రగిలిపోతూ.. విమర్శనాస్త్రాలు సంధిస్తారు. ఆ రోజంతా నిరాశలోనే ఉంటారు. కానీ.. ఇరాన్ ప్రజలు మాత్రం అందుకు భిన్నంగా సంబరాలు జరుపుకున్నారు. అవును.. మీరు చదువుతోంది అక్షరాల నిజం. యూఎస్ఏతో జరిగిన మ్యాచ్‌లో 1-0 తేడాతో ఓడిపోవడంతో.. ఫిఫా వరల్డ్ కప్ 2022 నుంచి ఇరాన్ నిష్క్రమించింది. ఈ ఓటమి అనంతరం ఇరాన్ ప్రజలు వీధుల్లోకి వచ్చి, డ్యాన్స్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

అయినా.. ఇరాన్ ప్రజలు ఎందుకిలా చేశారు? ఇందుకు ఓ కారణం ఉంది. హిజాబ్‌కు వ్యతిరేకంగా ఇరాన్‌లో తీవ్రస్థాయిలో ఆందోళనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే! ఈ ఆందోళనల్లో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు కూడా! ఈ నేపథ్యంలోనే.. ఈ ఆందోళనలకు మద్దతుగా ఫిఫా వరల్డ్‌కప్‌లో పాల్గొనకుండా ఇరాన్‌ని బహిష్కరించాలని ప్రజలు కోరారు. అయితే.. ఇరాన్ జట్టు ఖతార్ వెళ్లి, ఫిఫా వరల్డ్‌కప్ పోటీల్లో పాల్గొంది. ఈ పోటీల్లో పాల్గొన్నప్పటి నుంచి.. ఇరాన్ జట్టు ఫిఫా వరల్డ్‌కప్‌లో ఓడిపోవాలని, అసలు ఈ మెగా టోర్నీ నుంచి నిష్క్రమించాలని బలంగా కోరుకున్నారు. వాళ్లు కోరినట్టుగానే.. యూఎస్ఏ చేతిలో ఓడిపోయి, ఫిఫా వరల్డ్‌కప్ నుంచి వైదొలిగింది. ఈ ఆనందంలోనే ఆ దేశ ప్రజలు ఇలా రోడ్లపైకి వచ్చి, సంబరాలు చేసుకుని, తమ నిరసన తెలియజేశారు.

కాగా.. మాసా అమీని అనే యువతి సరిగ్గా హిజాబ్ ధరించలేదన్న అభియోగాలతో, ఇరాన్ పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. అయితే.. కొన్ని రోజుల్లోనే ఆ యువతి కస్టడీలో అనుమానాస్పద మృతి చెందడంతో.. హిజాబ్‌కు వ్యతిరేకంగా దేశవ్యాప్త ఆందోళనలు మొదలయ్యాయి. ఈ ప్రదర్శనల్ని ‘అల్లర్లు’గా అభివర్ణిస్తున్న ఇరాన్.. వాటిని అణచివేసేందుకు ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకుంది. ఇప్పటివరకూ ఈ ఆందోళనల్లో 448 మంది నిరసనకారులు చనిపోయారని, మృతుల్లో చిన్నారులు సైతం ఉన్నారని నార్వేకు చెందిన ఇరానియన్ హ్యూమన్ రైట్స్ సంస్థ వెల్లడించింది.

Show comments