Site icon NTV Telugu

Solar Flare: భూమిని ఢీ కొట్టిన సౌరజ్వాల.. పలు ప్రాంతాల్లో రేడియో సిగ్నల్స్ కు అంతరాయం.. సూర్యుడిపై మార్పులకు కారణం ఇదే..

Solar Flare

Solar Flare

Powerful flare from Sun hits Earth: సూర్యుడి నుంచి వెలువడిన శక్తివంతమైన సౌరజ్వాల భూమిని మార్చి 29న ఢీకొట్టింది. శక్తివంతమైన ఆవేశపూరిత కణాలు కలిగిన ఈ సౌరజ్వాల భూ వాతావరణంలోని పై పొరను అయనీకరించింది. దీనివల్ల ఆగ్నేయాసియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ప్రాంతాల్లో షార్ట్ వేవ్ రేడియో బ్లాక్ అవుట్ కు దారి తీసింది. సూర్యుడిపై ఉన్న సన్‌స్పాట్ AR3256 నుంచి ఈ సౌరజ్వాల వెలువడింది. శక్తివంతమైన పేలుడు కారణంగా ఇలా సౌర జ్వాలలు భూమివైపు దూసుకువస్తుంటాయి.

తాజాగా భూమిపై ప్రభావం చూపిన సౌరజ్వాలను X1.2గా వర్గీకరించారు. X-తరగతి అత్యంత తీవ్రమైన సౌరజ్వాలలను సూచిస్తుంది. సాధారణంగా ఇలా వెలువడే సౌరజ్వాలలు భూమిపై ఉన్న జీవరాశులపై ప్రభావం చూపించవు. భూమికి ఉన్న బలమైన అయస్కాంత క్షేత్రం సూర్యుడి నుంచి వచ్చే శక్తివంతమైన కణాలను అడ్డుకుంటుంది. అయితే ఇది సాధారణంగా భూమి అయనోస్పియర్ పొరపై ప్రభావం చూపిస్తుంది. దీని వల్ల టెలీ కమ్యూనికేషన్స్, రేడియో సిగ్నల్స్, పవర్ గ్రిడ్స్, నావిగేషన్ వ్యవస్థలు ప్రభావితం అవుతాయి. భూమి చుట్టూ తిరుగుతున్న శాటిలైట్స్, అంతరిక్ష కేంద్రంలో ఉండే వ్యోమగాములకు ప్రమాదాన్ని తీసుకువస్తాయి.

Read Also: Rashmika: ఐపీఎల్ స్టేజిపై ‘నాటు నాటు’ స్టెప్స్ తో అదరగొట్టిన నేషనల్ క్రష్

2023 ఏడాదిలో మూడు నెలల్లోనే సూర్యుడిపై ఏడుసార్లు విస్ఫొటనాలు సంభవించాయి. అయితే 2022 మొత్తం ఏడాదిలో నమోదైన సోలార్ ప్లేర్స్ కు ఇది సమానం. సూర్యుడి జీవితకాలంలో ప్రతీ 11 ఏళ్లకు సోలార్ సైకిల్ పూర్తవుతుంది. ఈ సమయంలో సూర్యుడి అయస్కాంత క్షేత్రాలు తారుమారు అవుతాయి. అంటే ఉత్తర ధృవం దక్షిణంగా, దక్షిణ ధృవం ఉత్తరంగా మారుతాయి. ఈ సమయంలో సూర్యుడిపై కార్యకలాపాలు చాలా చురుకుగా ఉంటాయి. బలమైన సౌరజ్వాలలు విశ్వంలోకి వెలువడుతాయి. సూర్యుడి ఉపరితలంపై పేలుళ్లు జరుగుతాయి.

Spaceweather.com నివేదిక ప్రకారం మార్చి 29న ఈ సౌరజ్వాల భూమని తాకినట్లు వెల్లడించింది. 30 MHz కంటే తక్కువ సిగ్నల్స్ ప్రభావితం అయ్యాయి. మూడు ఏళ్లలో అత్యంత బలమైన సౌర జ్వాల తాకిన కొద్ది రోజుల తర్వాత మరోసారి ఇలాంటి జ్వాలే భూమిని చేరుకుంది. సూర్యుడి ఉపరితలంలోని దక్షిణార్థగోళంలోని కరోనల్ హోల్స్ నుంచి ఈ భారీ పేలుడు సంభవించింది.  సూర్యుడి నుంచి వెలువడిన ఈ సౌరజ్వాల 14 భూములను ఒకదాని పక్కన ఒకటి పెడితే ఎంత ఎత్తు ఉంటుందో అంత ఎత్తుకు చేరుకుంది.

Exit mobile version