NTV Telugu Site icon

PM Narendra Modi: బ్రిటీష్ పీఎం రేసులో గెలుపొందిన లిజ్ ట్రస్‌కు ప్రధాని మోడీ అభినందనలు

Pm Narendra Modi Congratulate Liz Truss

Pm Narendra Modi Congratulate Liz Truss

PM Narendra Modi: యూకే ప్రధానమంత్రిగా ఎన్నికైనందుకు బ్రిటన్ విదేశాంగ కార్యదర్శి లిజ్ ట్రస్‌ను ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం అభినందించారు. ఆమె నాయకత్వంలో భారత్-యుకె సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలపడుతుందని ప్రధాని మోదీ అభినందన సందేశంలో పేర్కొన్నారు. “యూకే తదుపరి ప్రధానమంత్రిగా ఎంపికైనందుకు లిజ్‌ ట్రస్‌కు అభినందనలు. మీ నాయకత్వంలో భారతదేశం-యూకే సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలపడుతుందని విశ్వాసం ఉంది. మీ కొత్త పాత్ర, బాధ్యతలకు మీకు శుభాకాంక్షలు” అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.

కన్జర్వేటివ్ పార్టీ కొత్త అధినేతగా లిజ్ ట్రస్‌ను ఈరోజు ప్రకటించారు. నలభై ఏడేళ్ల లిజ్ ట్రస్ యూకే మూడవ మహిళా ప్రధాన మంత్రి కానున్నారు. బ్రిటీష్ విదేశాంగ కార్యదర్శి లిజ్ ట్రస్ కన్జర్వేటివ్ నాయకత్వ రేసులో భారత సంతతికి చెందిన రిషి సునాక్‌ను ఓడించారు. బ్రిటన్‌ నూతన ప్రధానమంత్రిగా లిజ్ ట్రస్ ఎన్నికయ్యారు. కన్జర్వేటివ్​ పార్టీ నేతను ఎన్నుకునేందుకు ఆరు వారాలుగా హోరాహోరీ ప్రచారంతో పాటు పోలింగ్​ కూడా పూర్తయింది. సోమవారం సాయంత్రం 5 గంటల తర్వాత విజేతను ప్రకటించారు. దీంతో ఉత్కంఠకు తెరపడింది. ఆమె కన్జర్వేటివ్ సభ్యులందరి పోస్టల్ బ్యాలెట్ ద్వారా సునాక్‌ను ఓడించింది. ఈ ఎన్నికల్లో లిజ్‌ ట్రస్‌కు 81,326 ఓట్లు రాగా.. రిషి సునాక్‌కు 60,339 ఓట్లు వచ్చాయి. దీంతో దాదాపు 21వేల ఓట్ల తేడాతో లిజ్ ట్రస్ గెలుపొందారు. బ్రిటన్‌ ప్రధానిగా ఎన్నికైన సందర్భంగా లిజ్‌ ట్రస్‌ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. తనకు ఓటు వేసిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. తాను ప్రజల ప్రధానిగా ఉంటానని ప్రకటించారు.

British Prime Minister: రిషి సునాక్ ఓటమి.. యూకే నూతన ప్రధానిగా లిజ్ ట్రస్

లిజ్ ట్రస్ గత ఏడాది అక్టోబర్‌లో భారత్‌కు రెండు రోజుల పర్యటనను చేపట్టింది. తన పర్యటనలో భారత్‌తో భాగస్వామ్య ప్రాముఖ్యతను ఆమె నొక్కి చెప్పారు. భవిష్యత్తు కోసం నిర్దేశించిన ప్రణాళికలపై ఇరు దేశాలు కలిసి పనిచేయాలని ట్రస్ నొక్కిచెప్పారు. గత ఏడాది మేలో రెండు దేశాల మధ్య జరిగిన వర్చువల్ సమ్మిట్ సందర్భంగా భారతదేశం- యూకే భవిష్యత్ సంబంధాల కోసం రోడ్‌మ్యాప్ 2030 ప్రారంభించబడింది. ఈ ఏడాది మార్చిలో జరిగిన మరో పర్యటనలో, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌తో కలిసి ట్రస్ రోడ్‌మ్యాప్ 2030కి సంబంధించి ఇప్పటివరకు సాధించిన పురోగతి పట్ల సంతృప్తిని వ్యక్తం చేశారు. వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ మరియు వలసల ప్రాధాన్యతా రంగాలలో ఫలితాలను అందించడానికి ప్రయత్నాలను మరింత తీవ్రతరం చేయడానికి అంగీకరించారు. జనవరి 2022లో ప్రారంభించినప్పటి నుండి రెండు ఉత్పాదక రౌండ్‌లు పూర్తయిన భారతదేశం-యూకే ఎఫ్‌టిఎ చర్చలలో గణనీయమైన పురోగతిని ఇరుపక్షాలు అభినందించాయి.

Show comments