NTV Telugu Site icon

PM Modi: అమెరికా చేరుకున్న మోడీ.. క్వాడ్ సమ్మిట్‌కు హాజరుకానున్న ప్రధాని

Pmmodi

Pmmodi

ప్రధాని మోడీ అగ్ర రాజ్యం అమెరికా చేరుకున్నారు. మోడీకి అమెరికా నేతలు ఘనస్వాగతం పలికారు. మూడు రోజుల పాటు ప్రధాని మోడీ అమెరికాలో పర్యటించనున్నారు. ఆయా కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. అమెరికా అధ్యక్షుడు బైడెన్ స్వస్థలమైన విల్మింగ్టన్‌లో క్వాడ్ సమ్మిట్‌ జరగనుంది. ఈ సమావేశానికి మోడీ హాజరవుతారు. సమ్మిట్‌లో చర్చల కోసం ఎదురు చూస్తున్నట్లు పర్యటనకు ముందు మోడీ ట్వీట్ చేశారు. అధ్యక్షుడు బైడెన్‌తో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. అలాగే కమ్యూనిటీ కార్యక్రమంలో పాల్గొనబోతున్నట్లు తెలిపారు.

భారతదేశం-అమెరికా సంబంధాలను మరింత బలోపేతం చేసే ప్రయత్నంలో అనేక కీలక అంశాలపై ప్రధాని మోడీ చర్చిస్తారు. మూడు రోజుల పర్యటనలో బైడెన్, క్వాడ్ లీడర్లను కలుస్తారు. అమెరికా నుంచి 31 ప్రిడేటర్ డ్రోన్‌లను కొనుగోలు చేయాలని భారత్ యోచిస్తున్న బహుళ బిలియన్ డాలర్ల ఒప్పందంపై కూడా చర్చించనున్నారు. న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో జరిగే ‘సమ్మిట్ ఆఫ్ ది ఫ్యూచర్’కి కూడా మోడీ హాజరుకానున్నారు.

ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్, జపాన్ ప్రధాని ఫుమియో కిషిడాతో కలిసి క్వాడ్ సమ్మిట్‌లో మోడీ పాల్గొంటారు. వైట్‌హౌస్ అధికార ప్రతినిధి జాన్ కిర్బీ మాట్లాడుతూ చైనా ఎజెండాలో ఎక్కువగా ఉంటుందని అన్నారు.