SCO Summit: ఉజ్బెకిస్తాన్‌లో జరగనున్న షాంఘై సహకార సంస్థ సదస్సుపై ఇప్పుడు ప్రపంచ దేశాలు దృష్టి సారించాయి. దీనికి కారణం లేకపోలేదు. ఈ సదస్సుకు చైనా, రష్యా అధ్యక్షులతో పాటు భారత్, పాకిస్తాన్ ప్రధానులు హాజరుకానుండడమే. షాంఘై సహకార సంస్థ సదస్సుకు హాజరయ్యేందుకు ఈ నెల 15, 16 తేదీల్లో ప్రధాని మోడీ ఉజ్బెకిస్తాన్‌లోని సమర్‌కండ్‌లో పర్యటించనున్నారు. ఉజ్బెకిస్తాన్ అధ్యక్షుడు షావ్కత్ మిర్జియోయెవ్ ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ సమర్‌కండ్‌లో పర్యటించనున్నారు. ఈ సమావేశానికి దాదాపు 15 దేశాధినేతలు హాజరుకానున్నారు. కరోనా మహమ్మారి తర్వాత ఇంత మంది దేశాధినేతలు హాజరుకానున్న అతిపెద్ద సదస్సు ఇదే కానుండడం గమనార్హం. చైనా, మరోవైపు పాకిస్థాన్‌తో ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటోన్న వేళ ఈ సదస్సులో ప్రధాని మోదీ హాజరు కానుండటం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఈ సమ్మిట్‌కు సంస్థ సభ్య దేశాల నాయకులు, పరిశీలకులు, షాంఘై సహకార సంస్థ సెక్రటరీ జనరల్, షాంఘై సహకార సంస్థ ప్రాంతీయ ఉగ్రవాద వ్యతిరేక నిర్మాణం (RATS) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, తుర్క్‌మెనిస్తాన్ అధ్యక్షుడు, ఇతర ఆహ్వానిత అతిథులు హాజరవుతారు. ఈ సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని మోడీ ఈ నెల 14న ఉజ్బెకిస్తాన్‌లోని సమర్‌కండ్‌కు వెళ్లనున్నారు. సదస్సులో చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ వంటి కీలక నేతలు ఒకే వేదికను పంచుకోనున్నారు. సమ్మిట్ సందర్భంగా ప్రధాని మోదీ కొన్ని ద్వైపాక్షిక సమావేశాలు కూడా నిర్వహించే అవకాశం ఉంది. ఈ సందర్భంగా రష్యా, చైనా అధ్యక్షుల మధ్య ద్వైపాక్షిక చర్చలు జరగనున్నట్లు ఆయా దేశాలు ఇదివరకే వెల్లడించాయి. ఇదే సమయంలో మోదీతో భేటీపై మాత్రం చైనా స్పందించలేదు. ఈ నేపథ్యంలో భారత్‌తో పాకిస్థాన్, చైనాల అధినేతలు సమావేశమయ్యే విషయంపై ప్రపంచ దేశాలకు ఆసక్తి నెలకొంది.
Ukraine-Russia War: యుద్ధంలో రష్యాకు ఎదురుదెబ్బ.. కీలక నగరాన్ని చేజిక్కించుకున్న ఉక్రెయిన్
చైనా నేతృత్వంలో 2001లో ఏర్పాటైన షాంఘై సహకార సంస్థలో భారత్, రష్యాతో పాటు పాకిస్థాన్, ఉజ్బెకిస్థాన్, కిర్గిజ్‌స్థాన్, తజకిస్థాన్, కజికిస్థాన్‌లు పూర్తిస్థాయి సభ్య దేశాలుగా ఉన్నాయి. అఫ్ఘనిస్థాన్‌తో పాటు బెలారస్, ఇరాన్, మంగోలియా దేశాలు ఎస్‌సీవో కూటమిలో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ నాలుగు దేశాలు పరీశీలకులుగా ఉన్నాయి. అర్మేనియా, అజర్‌బైజాన్, కంబోడియా, నేపాల్, శ్రీలంక, టర్కీ దేశాలు ఈ కూటమిలో చేరేందుకు చర్చలు జరుగుతున్నాయి. ‘నాటో’కు ప్రతిగా సభ్య దేశాల మధ్య రాజకీయ, భద్రత, ఆర్థిక, సాంస్కృతిక సహకారాన్ని సుసాధ్యం చేయాలన్న లక్ష్యంతో ఈ సంస్థ ఏర్పాటైంది. 2017లో రష్యా సహకారంతో భారత్ ఎస్‌సీఓలో పూర్తిస్థాయి సభ్యత్వాన్ని సాధించింది. అదే ఏడాది చైనా సహాయ సహకారాలతో పాకిస్థాన్ కూడా ఎస్‌సీఓలో చేరింది. ఈ సదస్సు ఏడాదికి ఓ సారి జరుగుతుంది. ఈ సంవత్సరం ఉజ్బెకిస్థాన్‌లో జరుగుతుండగా… వచ్చే ఏడాది భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది.
