PM Modi: కాశీ-రోమ్ శాశ్వతనగరాలు.. సంబంధాలు కూడా అంతే గొప్పవన్న మోడీ

  • ఇటలీలో కొనసాగుతోన్న ప్రధాని మోడీ పర్యటన
  • మెలోనితో కలిసి ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ
  • కాశీ-రోమ్ శాశ్వతనగరాలన్న మోడీ
Modi5

Modi5

రోమ్-కాశీ.. ఈ రెండు నగరాలు సంస్కృతి, నాగరికతలకు కాలాతీత కేంద్రాలని ప్రధాని మోడీ అభివర్ణించారు. ఇటలీలో ప్రధాని మోడీ పర్యటన కొనసాగుతోంది. పర్యటనలో భాగంగా ఇటలీ ప్రధాని మెలోనితో కలిసి పలు ప్రాంతాల్లో పర్యటించారు. అంతేకాకుండా రెండు దేశాల సంబంధాలపై చర్చించారు. అనంతరం సంయుక్తంగా మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ… ‘‘రోమ్‌ను శాశ్వతనగరం అని పిలుస్తున్నారు. అలాగే నా లోక్‌సభ నియోజకవర్గం వారణాసి (కాశీ)ని కూడా అలాగే పిలుస్తారు. రెండు నాగరికతలు కలిసినప్పుడు చర్చలు ఒక అజెండాకు పరిమితం కావు. చర్చలు చరిత్ర లోతుల్లోకి వెళ్తాయి. గత మూడున్నరేళ్లలో ప్రధాని మెలోనీని చాలాసార్లు కలిసే అవకాశం లభించింది. ఇది భారత్‌-ఇటలీ మధ్య నిరంతర సహకారాన్ని సూచిస్తుంది.’’ అని పేర్కొన్నారు.

తనకు, తన ప్రతినిధి బృందానికి లభించిన ఘన స్వాగతానికి మెలోనికి మోడీ ధన్యవాదాలు తెలిపారు. ఇక రోమ్-కాశీ నగరాల సంస్కృతులు కలిసినప్పుడు.. ఆత్మీయత, అనుబంధం సహజం అని పేర్కొన్నారు. భారత్-యూరోపియన్ యూనియన్ ఒప్పందం కుదరడానికి మద్దతు ఇచ్చినందుకు ఇటలీకి మరోసారి ధన్యవాదాలు చెప్పారు. ఈ ఒప్పందం ద్వారా వ్యాపారాలు వీలైనంత త్వరగా లబ్ధి పొందేలా ఇరు దేశాలు వేగంగా కృషి చేస్తాయన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటం టెక్నాలజీ, అంతరిక్షం, పౌర అణుశక్తి వంటి రంగాల్లో భారత్-ఇటలీలు అపారమైన అవకాశాలను చూస్తున్నాయన్నారు. ప్రజల మధ్య సంబంధాలను మరింత పెంపొందించడానికి, సాంస్కృతిక సహకారాన్ని బలోపేతం చేయడానికి ఇరు దేశాలు భారత్-ఇటలీ సాంస్కృతిక కేంద్రాన్ని ఏర్పాటు చేసే దిశగా కృషి చేస్తున్నాయని మోడీ ప్రకటించారు.

మెలోని..
ప్రధాని మోడీ ఇటలీ పర్యటన చారిత్రాత్మకం అని, సంబంధాలు కొత్త శిఖరాలకు చేరుకుంటున్నాయని ఇటలీ ప్రధాని జార్జియా మెలోని అన్నారు. ‘‘మన రెండు దేశాల మధ్య సంబంధాలకు ఇది ఒక చారిత్రాత్మక దినం అని నేను గట్టిగా నమ్ముతున్నా. ఈ రోజున ఇక్కడ రోమ్‌లో మోడీకి, ఆయన ప్రతినిధి బృందానికి స్వాగతం పలకడం నాకు గౌరవంగా, ఆనందంగా ఉంది. నా మిత్రుడు నరేంద్ర మోడీ 2014 నుంచి భారతదేశానికి నాయకత్వం వహిస్తున్నారు. కానీ ఈ రోజు ఇటలీలో ఇది ఆయన మొదటి ద్వైపాక్షిక పర్యటన. దీనికి ముందు ఒక భారత ప్రధాని ద్వైపాక్షిక పర్యటన చేసింది 2000వ సంవత్సరంలో. అంటే 26 సంవత్సరాల క్రితం. ఈ రోజు ఈ పర్యటనతో మనం ఈ అంతరాన్ని పూడ్చడమే కాకుండా.. మన సంబంధాలను పునరుజ్జీవింపజేయాలని కలిసి నిర్ణయించుకున్నాం. మన మధ్య సంబంధాలను అత్యున్నత స్థాయికి బలోపేతం చేయడానికి, మనం దృఢ సంకల్పంతో కలిసి నిర్మించుకున్న మార్గానికి ఈ పర్యటన శిఖరాగ్రం కాబోతుంది.’’ అని మెలోని పేర్కొన్నారు.