NTV Telugu Site icon

PM Modi: ఫ్రాన్స్‌లో మోడీ పర్యటన.. మాక్రాన్ ఇచ్చిన విందుకు హాజరైన ప్రధాని

Modi3

Modi3

ప్రధాని మోడీ ఫ్రాన్స్‌లో పర్యటిస్తు్న్నారు. నాలుగు రోజుల విదేశీ పర్యటన కోసం సోమవారం ఢిల్లీ నుంచి ఫ్రాన్స్‌కు బయల్దేరి వెళ్లారు. పారిస్‌లో ప్రధాని మోడీకి ఘనస్వాగతం లభించింది. ప్రధాని మోడీకి అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఘనంగా స్వాగతం పలికారు. మోడీని మాక్రాన్ కౌగిలించుకుని స్వాగతం పలికారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ప్రధాని మోడీ ట్విట్టర్‌లో పోస్టు చేశారు. ‘‘నా స్నేహితుడు, అధ్యక్షుడు మాక్రాన్‌ను పారిస్‌లో కలవడం ఆనందంగా ఉంది.’’ అని ప్రధాని మోడీ తెలిపారు.

ఇక ఏఐ శిఖరాగ్ర సమావేశానికి ముందు ఫ్రెంచ్ అధ్యక్షుడు మాక్రాన్‌ పారిస్‌లో విందు ఇచ్చారు. ఈ విందుకు మోడీ హాజరయ్యారు. ఈ విందులో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ను కూడా మోడీ కలిశారు.

అంతకముందు విమానాశ్రయంలో మోడీకి భారతీయ ప్రవాసులందరూ స్వాగతం పలికారు. ‘‘మోడీ… మోడీ’’.. ‘భారత్ మాతాకీ జై’’ అంటూ నినాదాలతో స్వాగతించారు. ఈ స్వాగతానికి మోడీ ట్విట్టర్ ద్వారా కృతజ్ఞతలు తెలిపారు. చిరస్మరణీయ స్వాగతం అంటూ అభివర్ణించారు. అలాగే ఫ్రెంచ్ సాయుధ దళాల మంత్రి సెబాస్టియన్ లెకార్న్ కూడా మోడీకి ఘనంగా స్వాగతం పలికారు.

ఇక మంగళవారం పారిస్‌లో ఏఐ సమ్మిట్ జరగనుంది. ఈ సమ్మిట్‌కు ప్రధాని మోడీ అధ్యక్షత వహించనున్నారు. ఈ సమ్మిట్‌లో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, చైనా ఉప ప్రధాని జాంగ్ గువోగింగ్, ప్రపంచ నాయకులంతా పాల్గొననున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాలనను బలోపేతం చేసే దిశగా ఎలా అడుగులు వేయాలన్న అంశంపై ఈ సమ్మిట్‌లో చర్చించనున్నారు. ఇక పర్యటనలో భాగంగా మోడీ.. ఫ్రెంచ్ అధ్యక్షుడితో భేటీ అయి ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించనున్నారు. బుధవారం ఫ్రాన్స్ పర్యటన ముగించుకుని మోడీ అమెరికా వెళ్లనున్నారు. రెండు రోజుల పాటు యూఎస్‌లో పర్యటన కొనసాగనుంది. అధ్యక్షుడు ట్రంప్‌తో ఇరు దేశాల సంబంధాలపై చర్చించనున్నారు.