NTV Telugu Site icon

Hezbollah: “ఫోన్ చేసి ముగ్గులోకి లాగి”.. షుక్ర్‌ ని హతం చేసిన ఇజ్రాయిల్ ఆపరేషన్..

Hezbollah, Shukr

Hezbollah, Shukr

Hezbollah: గత నెలలో హిజ్బుల్లా సీనియర్ కమాండర్, కీలక నేత ఫువాద్ షుక్ర్‌ని ఇజ్రాయిల్ వైమానిక దాడిలో హతమార్చింది. అయితే, ఈ ఆపరేషన్ కోసం ఇజ్రాయిల్ షుక్ర్‌కి తెలివిగా ఉచ్చు బిగించింది. లెబనాన్ రాజధాని బీరూట్‌లో ఓ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్న షుక్ర్‌ని ‘‘ టెలిఫోన్ కాల్’’ మట్టుపెట్టేలా చేసింది. నిజానికి హిజ్బుల్లా మిలిటెంట్ సంస్థని రాకెట్ ఫోర్స్‌గా తీర్చిదిద్దిన ఘటన ఇతనికే చెల్లుతుంది. అయితే, అతడి గుర్తింపును మాత్రం ఎప్పటికప్పుడు రహస్యంగా ఉంచుతూ వస్తున్నాడు. ఇతడిని హతమార్చాలని ఇజ్రాయిల్ చాలా ప్రయత్నాలు చేసింది, చివరకు గత నెలలో సఫలమైంది.

నిజానికి షుక్ర్ నివాసం ఉంటున్న అపార్ట్‌మెంట్‌లో కూడా ఇతను హిజ్బుల్లా కమాండర్ అనే విషయం ఎవరికి తెలియకుండా గోప్యత పాటిస్తు్న్నాడు. ఈ నేపథ్యంలో జూలై 30 దాడికి కొన్ని నిమిషాల ముందు హిజ్బుల్లా నేత రెండో అంతస్తులో ఉన్న ఆఫీసులో ఉండగా, 7వ అంతస్తులోని అతడి నివాసానికి వెళ్లమని టెలిఫోన్ కాల్ వచ్చింది. ఆ తర్వాతే ఇతడిని లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయిల్ వైమానిక దళం మిస్సైల్‌ని సంధించింది. ఇలా అతను రెండో అంతస్తు నుంచి 7వ అంతస్తుకు వెళ్లడంతోనే ఆపరేషన్ సులువైనట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదించింది. ఈఘటనలో షుక్ర్ తో పాటు అతని భార్య, ఇద్దరు మహిళలు, పిల్లలు చనిపోగా, 70 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ దాడి తర్వాతనే ఇరాన్ టెహ్రాన్‌లో హమాస్ పొలిటికల్ చీఫ్ ఇస్మాయిల్ హనియే హత్యకు గురయ్యాడు.

Read Also: Andhra Pradesh: కలుషితాహారం తిని విద్యార్థుల మృతి.. రూ.10 లక్షల పరిహారం

షుక్ర్ తన కదలికల్ని బయట తగ్గించేందుకు సదరు అపార్ట్‌మెంట్‌లో నివసిస్తు్న్నట్లు తెలుస్తోంది. 1985లో డీడబ్ల్యూఏ ఫ్లైట్ 847ని ఎథెన్స్ నుంచి అమెరికాకు హైజాక్ చేయడానికి ప్లాన్ చేయడంలో సాయం చేసిన తర్వాత అతను అజ్ఞాతంలోకి వెళ్లాడు. ఇతను 2006లో 8 మంది ఇజ్రాయిల్ సైనికుల మరణాలకు కారణమయ్యాడు. ఈ ఏడాది జూలై నెలలో లెబనాన్ నుంచి హిజ్బుల్లా, ఉత్తర ఇజ్రాయిల్‌పై జరిపిన దాడికి ప్రతిస్పందనగా షుక్ర్‌ని ఇజ్రాయిల్ హతమార్చింది. హిజ్బుల్లా రాకెట్ దాడిలో మరణించిన 12 మంది పిల్లలలో 10 మంది పిల్లలు మరణించారు.

హిజ్బుల్లాను ఇతను అత్యంత ప్రమాదకరమైన రాకెట్ శక్తిగా మార్చాడు. ఇరాన్ నుంచి తెచ్చిన విడి భాగాల సాయంతో 15,000 నుంచి 1,50,000 వరకు రాకెట్లు ఇప్పుడు హిజ్బుల్లా సొంతం. ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్ ప్రకారం .. వీటిని గైడెడ్ మిస్సైల్స్‌గా మార్చాలని ప్రయత్ని్స్తోంది. షుక్ర్ జీవితం చాలా వరక రహస్యంగానే ఉంది. ఇతని మరణంపై లెబనీస్ మీడియా రిపోర్టింగ్‌లో తప్పుడు ఫోటోని చూపించిందని జర్నల్ పేర్కొంది. దీనిని బట్టి చూస్తే షుక్ర్ చాలా గోప్యతగా హిజ్బుల్లాని వెనకనుంచి నడిపిస్తున్నట్లు తెలుస్తోంది. ఇతను చివరిసారిగా 2024 ప్రారంభంలో మేనల్లుడి అంత్యక్రియల్లో కేవలం 2 నిమిషాల పాటు బహిరంగంగా కనిపించాడు. హిజ్బుల్లా అధికారికంగా స్థాపించబడక ముందు 1982లో బీరుట్‌లోని US మెరైన్స్ బ్యారక్‌లో 241 మంది అమెరికన్ సైనికులను చంపిన బాంబు దాడిలో షుక్ర్‌ని అమెరికా కోరింది.