Petrol Diesel Price Hike: వామ్మో.. ఒకేసారి రూ.13 పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. ఆ దేశ ప్రభుత్వం సంచలన ప్రకటన!

Petrol Diesel Price Hike

Petrol Diesel Price Hike

Petrol Diesel Price Hike: గత కొన్ని నెలలుగా ప్రపంచ ఇంధన సంక్షోభానికి మధ్యప్రాచ్యంలో నెలకొన్న తీవ్రమై ఉద్రిక్తతలు ప్రధాన కారణం అయ్యాయి. ఇదే సమయంలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దేశాలలో ఇంధన ధరలు విపరీతంగా పెరిగాయి. ప్రస్తుతం మళ్లీ మిడిల్ ఈస్ట్‌లో ఉద్రిక్తతలు తలెత్తడంతో ఇంధన ధరలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. పెట్రోల్, డీజిల్ మంటలకు పాకిస్థాన్ ప్రభుత్వం మరోసారి ఇంధన ధరలను పెంచింది. డాన్ పత్రికలోని ఒక నివేదిక ప్రకారం.. భారత పొరుగు దేశమైన పాకిస్థాన్‌లో పెట్రోల్ ధరను రూ.13.18 పాకిస్థానీ రూపాయలు, హై-స్పీడ్ డీజిల్ ధరను రూ.13.80 పాకిస్థానీ రూపాయలు పెంచినట్లు వెల్లడించారు. ముడి చమురు ధరలు పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

తాజా పెరుగుదల తరువాత, పాకిస్థాన్‌లో పెట్రోల్ ధర లీటరుకు రూ.310.71 కి చేరింది. హై-స్పీడ్ డీజిల్ ధర లీటరుకు రూ.323.30 కి చేరింది. పెట్రోలియం విభాగం జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. ఈ కొత్త ధరలు ఈ రోజు నుంచే అమల్లోకి వస్తాయని వెల్లడించారు. దీనివల్ల పాకిస్థానీయులందరూ ఇప్పుడు తమ ఆదాయంలో గణనీయమైన నష్టాన్ని ఎదుర్కుంటారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నిజానికి గతంలో కూడా పాకిస్థాన్ పెట్రోల్ – డీజిల్ ధరలను గణనీయంగా పెంచింది. ఫిబ్రవరి 28న డీజిల్ ధర లీటరుకు రూ.281కి చేరగా, ఏప్రిల్ 3న అది లీటరుకు రూ.530.35కి చేరింది. మార్చి మొదటి వారంలో లీటరుకు రూ.266గా ఉన్న పెట్రోల్ ధర, ఏప్రిల్ 3న లీటరుకు రూ.458.41కి పెంచింది. తర్వాత కాలంలో ఈ ధరలు కాస్త తగ్గిన ఇప్పుడు మళ్లీ పెరిగాయి.

భారతదేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు..

మధ్యప్రాచ్యంలో యుద్ధం నేపథ్యంలో భారతదేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు నాలుగు సార్లు పెరిగాయి. మే 2026 నుంచి జరిగిన నాలుగు వేర్వేరు సందర్భాల్లో పెట్రోల్ ధర లీటరుకు మొత్తం రూ.7.8, డీజిల్ ధర రూ.8.7 పెరిగాయి. ఈ పెరుగుదలలతో ఢిల్లీలో పెట్రోల్ ధర లీటరుకు రూ.102.12కి, డీజిల్ ధర లీటరుకు రూ.95.20కి చేరింది. ఇదే సమయంలో అంతర్జాతీయ పెట్రోల్ – డీజిల్ ధరలు ఎలా ఉన్నాయంటే.. మిడిల్ ఈస్ట్ యుద్ద మేఘాల కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు గణనీయంగా హెచ్చుతగ్గులకు లోనయ్యాయి. ఇటీవల యుద్ధం కారణంగా బ్రెంట్ ముడి చమురు బ్యారెల్‌కు $126 కు చేరుకుంది, కానీ ఇరాన్ – అమెరికా మధ్య శాంతి చర్చలు ప్రారంభమైన తర్వాత, అది బ్యారెల్‌కు $72 కంటే తక్కువకు పడిపోయింది.