పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు మొదలయ్యేటట్టుగా కనిపిస్తోంది. తాజా పరిణామాలు చూస్తుంటే అలానే అనిపిస్తోంది. లేటెస్ట్‌గా అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ హెచ్చరికలను చూస్తుంటే అనుమానాలు రేకెత్తుతున్నాయి. అవసరమైతే ఇరాన్‌పై మళ్లీ సైనిక చర్యలు ప్రారంభించేందుకు అమెరికా పూర్తిగా సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. అలాగే ఇండో-పసిఫిక్ ప్రాంతంలో చైనా ఆధిపత్యాన్ని అడ్డుకోవడం అమెరికా వ్యూహంలో కీలక భాగమని తెలిపారు.
సింగపూర్‌లో జరిగిన షాంగ్రి-లా సంభాషణ భద్రతా సదస్సులో మాట్లాడిన హెగ్సెత్.. ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో ఒకేసారి సైనిక కార్యకలాపాలు నిర్వహించే సామర్థ్యం అమెరికాకు ఉందన్నారు. అవసరమైతే ఇరాన్‌పై తిరిగి సైనిక చర్యలు చేపట్టేందుకు తగిన ఆయుధ నిల్వలు, సైనిక వనరులు తమ దగ్గర ఉన్నాయని పేర్కొన్నారు.
మధ్యప్రాచ్యంలో నెలలుగా కొనసాగుతున్న ఉద్రిక్తతలు, ఇరాన్-అమెరికా మధ్య దౌత్యపరమైన చర్చల నేపథ్యంలో హెగ్సెత్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇరాన్ ఎట్టి పరిస్థితుల్లోనూ అణ్వాయుధాలను సొంతం చేసుకోకూడదన్న అమెరికా వైఖరిని కూడా మరోసారి స్పష్టం చేశారు. ‘‘ఇరాన్ అణ్వాయుధాలను పొందకుండా చూడటం అమెరికా గ్లోబల్ బాధ్యతల్లో ఒకటి.’’ అని పేర్కొన్నారు.
ఇక ఇండో-పసిఫిక్ ప్రాంత భద్రతపై మాట్లాడుతూ… ఏ ఒక్క దేశం కూడా ఆ ప్రాంతంపై ఆధిపత్యం చెలాయించకూడదని హెచ్చరించారు. ముఖ్యంగా చైనా ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో శక్తి సమతుల్యతను కాపాడటం అమెరికా లక్ష్యమని తెలిపారు. అమెరికా, తన మిత్రదేశాలకు కూడా భద్రతా బాధ్యతల్లో ఎక్కువ పాత్ర పోషించాలని కోరుతోందని వెల్లడించారు. సంపన్న దేశాలకు అమెరికా భారీగా భద్రతా సబ్సిడీలు అందించే కాలం ముగిసిందని వ్యాఖ్యానించారు. ధనిక దేశాలకు అమెరికా భద్రతా వ్యయాలను భరించే యుగం కూడా ముగిసిందని స్పష్టం చేశారు. ఒకే దేశం ఆధిపత్యం చెలాయించే ఇండో-పసిఫిక్ ప్రాంతం స్థిరత్వం, అభివృద్ధికి ముప్పుగా మారుతుందని హెచ్చరించిన హెగ్సెత్.. స్వేచ్ఛాయుతమైన, తెరవెనుక వాణిజ్యానికి అనుకూలమైన ఇండో-పసిఫిక్‌ను కొనసాగించేందుకు అమెరికా కట్టుబడి ఉందని తెలిపారు.
