NTV Telugu Site icon

American Airlines: విమానం గాల్లో ఉండగా ఫ్లైట్ అటెండెంట్‌ పై దాడి.. వీడియో వైరల్‌..

American Airlines

American Airlines

Attack on flight attendant: విమానం గాల్లో ఉండగా ఓ వ్యక్తి ఫ్లైట్ అటెండెట్ పై విచక్షణారహితంగా దాడిచేశాడు. తనను ఫస్ట్ క్లాస్ బాత్రూమ్ వాడుకోవడానికి నిరాకరించాడనే కారణంతో వీపు, ముఖం మీద పిడిగుద్దులు కురిపించాడు. విమానం లాస్ ఏంజెలెస్‌లో ల్యాండ్ కాగానే 33 ఏళ్ల నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతను మళ్లీ విమానం ఎక్కకుండా జీవితకాల నిషేధం విధించారు. విచారణ తర్వాత అతనికి జైలు శిక్ష పడే అవకాశం ఉందని తెలిపారు. మెక్సికో నుంచి లాస్ ఏంజెలెస్ వెళ్తున్న అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానంలో ఈ ఘటన జరిగింది.

విమానం గాల్లో ఉండగా ఫ్లైట్ అటెండెంట్‌ పై నిందితుడు దాడి చేసి పిడిగుద్దులు కురిపిస్తుండగా తోటి ప్రయాణికుడు బారీ లివింగ్ స్టోన్ ఈ ఘటనను షూట్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ మీడియాలోఫ్లైట్ అటెండెంట్ సీట్ల మధ్య నిలబడి నువ్వు నన్ను బెదిరిస్తున్నావా? అంటూ.. తిరిగి విమానం ముందు వైపు వెళ్తున్నాడు. ఈనేపథ్యంలో.. వెనక నుంచి వచ్చిన నిందితుడు అటెండెంట్ పై దాడిచేసాడు. వీపు, ముఖం మీద పిడిగుద్దులు కురిపించాడు. ఆతరువాత తన సీటు వద్దకు వెళ్లిపోయాడు. అయితే.. విమానం ల్యాండయ్యాక లాస్ ఏంజెలెస్ ఎయిర్‌పోర్ట్ పోలీసులు అతడిని విమానం నుంచి కిందికి దింపి అదుపులో తీసుకున్నారు. ఈవీడియో కాస్త ఇప్పుడు వైరల్‌ గా మారింది.

అమెరికన్ ఎయిర్‌లైన్స్ ప్రకటన
ఫ్లైట్ అటెండెంట్‌పై భౌతిక దాడికి దిగిన నిందితుడు విమానం ఎక్కకుండా జీవితకాల నిషేధం విధిస్తున్నట్టు అమెరికన్ ఎయిర్‌లైన్స్ పేర్కొంది. కాగా.. అమెరికన్ ఎయిర్‌లైన్స్‌లో 24వేల మందికి పైగా ఫ్లైట్ అటెండెంట్‌లకు ప్రాతినిధ్యం వహిస్తున్న అసోసియేషన్ ఆఫ్ ప్రొఫెషనల్ ఫ్లైట్ అటెండెంట్స్ ఈ సంఘటనను తీవ్రంగా ఖండించింది. అయితే.. ఇది చాలా ప్రమాదకరమైనదని.. ప్రాణాపాయకరమైనదని ఆందోళన వ్యక్తం చేసింది. కాలిఫోర్నియా లోని వెస్ట్‌మాస్టర్ కు చెందిన నిందితుడు అలెగ్జాండర్ టంగ్ క్యూలె దోషిగా తేలితే 20 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉందని ప్రకటించింది.