NTV Telugu Site icon

Pakistan: పాకిస్తాన్‌లో హిందువుల ఆందోళన.. హిందూ బాలికలు, మహిళల కిడ్నాపులు, మతమార్పిడిపై నిరసన

Pak

Pak

Pakistan: మైనారిటీ హక్కుల గురించి భారతదేశానికి నీతులు చెప్పాలని ప్రయత్నించే పాకిస్తాన్ తన దేశంలో మైనారిటీల పరిస్థితిని పట్టించుకోవడం లేదు. ప్రతీ సంవత్సరం వందల్లో మహిళలు, బాలికలు కిడ్నాపులకు గురవుతూ.. బలవంతపు పెళ్లిళ్లు చేసి మతాన్ని మార్చేస్తున్నారు. ముఖ్యంగా సింధ్ రాష్ట్రంలో ఈ తరహా పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి. ఇదిలా ఉంటే దేశంలో హిందూ బాలికలు, మహిళల బలవంతమపు మతమార్పిడులు, వివాహాలపై పాకిస్తాన్ మైనారిటీ హిందూ సమాజానికి చెందిన పలువురు సభ్యులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. కరాచీ ప్రెస్ క్లబ్ వెలుపల, సింధ్ అసెంబ్లీ భవనం ప్రవేశ ద్వారం వద్ద గురువారం పాకిస్తాన్ దారావర్ ఇత్తెహాద్ హిందూ సంస్థ ఆధ్వర్యంలో నిరసనలు జరిగాయి.

Read Also: Molestation : ఫ్రెండ్ పెళ్లాంపై కన్నేశాడు.. ముక్కలు ముక్కలయ్యాడు

సింధ్ రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో 12 -13 ఏళ్ల వయసు ఉన్న బాలికను పట్టపగలే అపహరించుకుపోతున్నారని, బలవంతంగా ఇస్లాంలోకి మారుస్తున్నారని, పెద్ద వయసు ఉన్న ముస్లింలో పెళ్లిళ్లు చేయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హిందూ బాలికలు, మహిళల బలవంత మత మార్పిడిని వ్యతిరేకిస్తూ తీసుకువచ్చిన బిల్లు పాక్ పార్లమెంట్ లో నిలిచిపోయింది. బలవంతపు మతమార్పిడిని నేరంగా పరిగణించే బిల్లును పాకిస్తాన్ పార్లమెంట్ తిరస్కరించింది. ఇటీవల కాలంలో సింధ్ కోర్టుల్లో హిందూ తల్లిదండ్రుల కేసులు పెరిగిపోయాయి. తమ పిల్లలు, అక్కా చెల్లిళ్లు, భార్యలు ఎక్కడున్నారో తెలియజేయాలని, తమ వద్దకు తిరిగి తీసుకురావాలని కోర్టులో దరఖాస్తులు నమోదు అయ్యాయి.

మరోవైపు ఐక్యరాజ్యసమితి హక్కుల సంస్థ పాకిస్తాన్ లో హిందువులపై మతమార్పిడులు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. ప్రతీ ఏడాది 1,000 మంది బాలికలు బలవంతంగా ఇస్లాంలోకి మార్చబుతున్నారని హ్యూమన్ రైట్స్ కమీషన్ ఆఫ్ పాకిస్తాన్ వెల్లడించింది. పాక్ లో హిందువులు అతిపెద్ద మైనారిటీ కమ్యూనిటీగా ఉన్నారు. ముస్లిం మెజారిటీ దేశంలో దాదాపుగా 75 లక్షల మంది హిందువులు నివసిస్తున్నారు. పాకిస్తాన్ మొత్తం 20 కోట్ల జనాభాలో ముస్లింలు 96 శాతం, హిందువులు 2.1 శాతం, క్రైస్తవులు 1.6 శాతం ఉన్నారు. ఎక్కువగా హిందువులు సింధ్ ప్రాంతంలో నివసిస్తున్నారు.

Show comments