Trump Assassination Plot: ట్రంప్ హత్యకు కుట్ర.. పాకిస్థానీ వ్యక్తికి అమెరికాలో 27 ఏళ్ల జైలు శిక్ష!

Trump Assassination Plot

Trump Assassination Plot

Trump Assassination Plot: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను హత్య చేసేందుకు కుట్ర పన్నిన కేసులో పాకిస్థాన్‌కు చెందిన అసిఫ్ మర్చంట్‌కు అమెరికా న్యాయస్థానం భారీ శిక్ష విధించింది. ఇరాన్‌కు చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) ఆదేశాల మేరకు అమెరికా ప్రభుత్వ ఉన్నతాధికారులను హత్య చేసేందుకు ప్రయత్నించినట్లు తేలడంతో అతడికి 27 ఏళ్ల 6 నెలల జైలు శిక్ష విధించింది. మొత్తం 330 నెలల పాటు జైలు శిక్ష అనుభవించాలని న్యాయస్థానం ఆదేశించింది. అమెరికా న్యాయ శాఖ (Department of Justice) వెల్లడించిన వివరాల ప్రకారం.. 48 ఏళ్ల అసిఫ్ మర్చంట్‌పై నమోదైన కేసులో మార్చి 2026లో జ్యూరీ అతడిని దోషిగా నిర్ధారించింది. అనంతరం న్యూయార్క్‌లోని బ్రూక్లిన్ ఫెడరల్ కోర్టు న్యాయమూర్తి ఎరిక్ ఆర్. కోమిటీ ఈ శిక్షను ఖరారు చేశారు.

2020 జనవరిలో అమెరికా జరిపిన డ్రోన్ దాడిలో ఇరాన్‌కు చెందిన మాజీ IRGC కమాండర్ ఖాసీం సులేమానీ హతమయ్యాడు. ఈ ఘటనకు ప్రతీకారం తీర్చుకోవాలనే ఉద్దేశంతో ఇరాన్ ఈ కుట్రకు ప్రణాళిక రూపొందించినట్లు అమెరికా దర్యాప్తు సంస్థలు ఆరోపించాయి. అసిఫ్ మర్చంట్ స్వచ్ఛందంగా IRGCలో చేరి, అక్కడ శిక్షణ పొందినట్లు అమెరికా న్యాయ శాఖ తెలిపింది. అనంతరం అమెరికాకు వెళ్లి అక్కడి రాజకీయ నాయకులు, ప్రభుత్వ ఉన్నతాధికారులను హత్య చేసేందుకు వ్యక్తులను నియమించుకోవాలని అతడికి ఆదేశాలు అందినట్లు వెల్లడించింది. అమెరికా అటార్నీ జనరల్ టాడ్ బ్లాంచ్ మాట్లాడుతూ.. అధ్యక్షుడు ట్రంప్‌తో పాటు ఇతర అమెరికా ప్రభుత్వ ప్రముఖులపై హత్యాయత్నానికి కుట్ర పన్నిన విదేశీ ఏజెంట్‌కు తగిన శిక్ష పడిందని పేర్కొన్నారు. అమెరికా నాయకులపై విదేశీ ఉగ్రవాద కుట్రలను సహించబోమని స్పష్టం చేశారు.

అమెరికా న్యాయ శాఖ వివరాల ప్రకారం.. అసిఫ్ మర్చంట్‌కు 2022 ప్రాంతంలో IRGCతో సంబంధాలు ఏర్పడ్డాయి. మతపరమైన యాత్రల కోసం ఇరాన్‌కు వెళ్లిన సమయంలో ఓ బంధువు ద్వారా యూసుఫ్ మెర్హర్దాద్ అనే వ్యక్తికి పరిచయమయ్యాడు. అతడు IRGC తరఫున మర్చంట్‌కు మార్గనిర్దేశం చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. 2023 నుంచి సుమారు ఏడాదిన్నర కాలంలో మర్చంట్ దాదాపు 15 సార్లు ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో తన హ్యాండ్లర్‌ను కలిసినట్లు అధికారులు తెలిపారు.

ఈ సమావేశాల్లో నిఘా నుంచి తప్పించుకునే పద్ధతులపై శిక్షణ ఇచ్చి, అమెరికాకు వెళ్లి హత్యకు సంబంధించిన ప్రణాళిక అమలు చేయాలని సూచించినట్లు ఆరోపించారు. అమెరికాలో హత్యకు పాల్పడే వ్యక్తులు నేర చరిత్ర కలిగినవారు లేదా మాఫియా సభ్యులై ఉండాలని, రాజకీయ ర్యాలీ సమయంలో లక్ష్యాన్ని హతమార్చాలని సూచించినట్లు విచారణలో వెల్లడైంది. ఈ కుట్రలో తన అంతిమ లక్ష్యం అధ్యక్షుడు ట్రంప్ అని మర్చంట్ విచారణ సందర్భంగా అంగీకరించినట్లు అమెరికా న్యాయ శాఖ పేర్కొంది.

2024 ఏప్రిల్‌లో ఇరాన్‌లో వారం రోజుల పాటు గడిపిన అనంతరం మర్చంట్ అమెరికాకు చేరుకున్నాడు. అక్కడ తనకు పరిచయమున్న వ్యక్తి సహాయం కోరగా, అతడు వెంటనే FBI అధికారులకు సమాచారం అందించాడు. అనంతరం ఆ వ్యక్తి FBIకి ఇన్‌ఫార్మర్‌గా పనిచేశాడు. కేసు విచారణలో భాగంగా మర్చంట్ తన కుట్రలోని కొన్ని వివరాలను వీడియోలో వివరించినట్లు అధికారులు తెలిపారు. అనంతరం హత్యకు వ్యక్తులను నియమించుకునేందుకు ప్రయత్నించాడు. అయితే అతడు సంప్రదించిన వ్యక్తులు వాస్తవానికి FBI అండర్‌కవర్ ఏజెంట్లు.

వారిని మూడుసార్లు కలిసిన మర్చంట్.. విదేశాల్లోని వ్యక్తులతో కలిసి పనిచేస్తున్నానని, ఓ రాజకీయ నాయకుడిని హత్య చేయించాలని భావిస్తున్నానని చెప్పినట్లు విచారణలో వెల్లడైంది. ఈ కుట్ర కోసం ముందస్తు చెల్లింపుగా 5,000 డాలర్లు కూడా అందించాడు. ఈ మొత్తాన్ని విదేశాల్లో ఉన్న తన బంధువుల సహాయంతో సమకూర్చుకున్నట్లు అధికారులు తెలిపారు.

2026 జూలై 12న టెక్సాస్‌లోని రిచ్‌మండ్‌లో అసిఫ్ మర్చంట్‌ను FBI అధికారులు అరెస్ట్ చేశారు. అమెరికా నుంచి వెళ్లేందుకు విమానాశ్రయానికి బయలుదేరబోతున్న సమయంలో అతడిని అదుపులోకి తీసుకున్నారు. అతడి ల్యాప్‌టాప్, మొబైల్ ఫోన్లు, సోషల్ మీడియా ఖాతాలను పరిశీలించగా 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికలు, డొనాల్డ్ ట్రంప్‌కు సంబంధించిన అంశాలపై ఆసక్తి చూపినట్లు ఆధారాలు లభించాయని అధికారులు తెలిపారు. ట్రంప్ ఎన్నికల ప్రచార ర్యాలీలకు సంబంధించిన ఇంటర్నెట్ సెర్చ్‌లు, న్యూజెర్సీలో జరిగిన ట్రంప్ ర్యాలీ ప్రాంతానికి సంబంధించిన గూగుల్ మ్యాప్స్ సెర్చ్ కూడా గుర్తించినట్లు వెల్లడించారు. అలాగే ఖాసీం సులేమానీని ప్రశంసిస్తూ, ట్రంప్, అమెరికాకు వ్యతిరేకంగా పోస్టులు చేసినట్లు దర్యాప్తులో బయటపడింది.

ఈ కేసులో శిక్ష విధించడంపై అమెరికా న్యాయ శాఖ అధికారులు స్పందిస్తూ.. విదేశీ శక్తుల తరఫున అమెరికాలో ఉగ్రవాద చర్యలకు పాల్పడాలని ప్రయత్నించే వారికి ఈ తీర్పు గట్టి హెచ్చరికగా నిలుస్తుందని పేర్కొన్నారు. అసిఫ్ మర్చంట్‌కు విధించిన శిక్షతో ఇకపై అమెరికాపై దాడులకు కుట్రలు పన్నే అవకాశం ఉండదని న్యూయార్క్ తూర్పు జిల్లా అటార్నీ జోసెఫ్ నోసెల్లా జూనియర్ వ్యాఖ్యానించారు.