Pakistani Astronaut: అంతరిక్షంలోకి బటర్ చికెన్, బీఫ్ నిహారీ.. పాక్ వ్యోమగామి కోసం 100కు పైగా హలాల్ వంటకాలు!

  • చైనా సహాయంతో అంతరిక్షానికి వెళ్లిన తొలి పాక్ వ్యోమగామి జీషాన్ అలీ..
  • అంతరిక్షంలోకి బటర్ చికెన్, బీఫ్ నిహారీ..
  • జీషాన్ కోసం పూర్తిగా హలాల్ ఆహారం..
Pakistani Astronaut

Pakistani Astronaut

Pakistani Astronaut:  చైనా సహాకారంతో పాకిస్తాన్ తన తొలి వ్యోమగామిని అంతరిక్షంలోకి పంపించింది. ఇలా వెళ్లిన తొలి పాకిస్తానీగా మహ్మద్ జీషాన్ అలీ చరిత్ర సృష్టించారు. ఈ విషయాన్ని పాకిస్తాన్ పెద్ద ఎత్తున పండగలా చేసుకుంటోంది. ఇదిలా ఉంటే, జీషాన్ అలీ కోసం 100కు పైగా హలాల్ ఆహార పదార్థాలతో చైనా ప్రత్యేక మెనూ సిద్ధం చేసింది. ఇందులో బటర్ చికెన్, ల్యాంబ్ కోర్మా, బీఫ్ నిహారీ వంటి వంటకాలు ఉన్నాయి.

40 ఏళ్ల పైలట్ మహ్మద్ జీషాన్ అలీ బుధవారం షెన్‌జౌ-24 వ్యోమనౌకలో తియాంగాంగ్ అంతరిక్ష కేంద్రానికి వెళ్లారు. అక్కడ ఇప్పటికే షెన్‌జౌ-23 మిషన్‌కు చెందిన మరో ముగ్గురు వ్యోమగాములు ఉన్నారు. జీహాన్ అలీ ఆహార అభిరుచులు, పోషక విలువలు, పాకిస్తాన్ ఆహార సంస్కృతిని అధ్యయనం చేసిన తర్వాత ఈ ప్రత్యేక మెనూ రూపొందించారు.

చైనా ఆస్ట్రోనాట్ సెంటర్ పరిశోధకుడు చెన్ జున్లీ తెలిపిన వివరాల ప్రకారం.. వ్యోమగాములకు అవసరమైన శక్తి, పోషకాలు అందించేలా ఈ వంటకాలను రూపొందించారు. అదే సమయంలో ఇవి తేలికగా ఉండీ, సులభంగా జీర్ణయమ్యేలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ ఆహారం తయారీలో పూర్తిగా ‘‘హలాల్’’ నిబంధనలు పాటించారు. ఇస్లామిక్ ఆహార నియమాలకు అనుగుణంగా వీటిని ఎంపిక చేయడంతో పాటు, వంటల తయారీ విధానాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. అంతరిక్ష నౌకలు, స్పేస్ స్టేషన్లలో భూమిపై మాదిరిగా వంట చేయడం సాధ్యం కాదు, దీంతో భూమిపైనే వీటిని సిద్ధం చేసి, ప్రత్యేక ప్యాకింగ్ చేసి అంతరిక్షానికి తీసుకెళ్తారు.