NTV Telugu Site icon

Pakistan: మోడీ ఓడిపోవాలని పాక్ కోరుకుంటోంది.. మాజీ మంత్రి అక్కసు..

Pakistan

Pakistan

Pakistan: పాకిస్తాన్ మాజీ మంత్రి, మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సన్నిహితుడిగా పేరున్న ఫవాద్ హుస్సేన్ చౌదరి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్రమోడీ 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఓడిపోవాలని తన అక్కసును వెళ్లగక్కాడు. ఇదే కాకుండా పాకిస్తాన్ మొత్తం కూడా మోడీ ఓడిపోయవాలని కోరుకుంటోందని అన్నారు. భారత్‌లో ఇండియా కూటమి గెలవాలని మద్దతు ఇచ్చాడు. బీజేపీ-ఆర్ఎస్ఎస్ కూటమి ముస్లింల పట్ల ద్వేషాన్ని వ్యాప్తి చేస్తో్ందని విమర్శించారు.

ఫవాద్ వ్యాఖ్యలపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ఎన్నికల్లో నరేంద్రమోడీ ఓడిపోవాలని ప్రతీ పాకిస్తానీ కోరుకుంటున్నాడు’’ అని మంగళవారం ఓ ఇంటర్వ్యూలో ఆయన అన్నారు. ‘‘భారత్‌లోని బీజేపీ-ఆర్‌ఎస్‌ఎస్ కూటమి పాకిస్థాన్ పట్ల ద్వేషాన్ని రెచ్చగొడుతోంది. పాకిస్థాన్‌కు భారత్‌పై ద్వేషం లేదు. వారు (బీజేపీ ప్రభుత్వం) ముస్లింల పట్ల ద్వేషాన్ని వ్యాప్తి చేస్తున్నారు. కాబట్టి, ఈ భావజాలం ఉన్నవారిని ఓడించాలి’’ అని అన్నారు.

Read Also: Ritika Sajdeh Trolls: రోహిత్‌ శర్మ సతీమణి రితికాపై ట్రోల్స్‌!

భారత్‌లో కొత్తగా ఇండియా కూటమి విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని తెలిపారు. నరేంద్రమోడీని ఓడించడానికి రాహుల్ గాంధీ, అరవింద్ కేజ్రీవాల్, మమతా బెనర్జీతో సహా ప్రతిపక్ష నాయకులకు ‘‘శుభాకాంక్షలు’’ తెలిపారు. ఇటీవల ఫవాద్ హుస్సేన్ చౌదరి భారత రాజకీయాలపై ముఖ్యంగా బీజేపీ పార్టీని, ప్రధానిమోడీని వ్యతిరేకిస్తూ, ఇండియా కూటమికి మద్దతు పలుకుతున్నాడు. ‘‘సంపద పునర్విభజన’’ చేస్తామని రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై ఆయన ప్రశంసలు కురిపించారు. ఇటీవల కేజ్రీవాల్ ఎన్నికల్లో ఓటేసిన తర్వాత ఆయనకు మద్దతు తెలిపారు.

కాంగ్రెస్-పాకిస్తాన్ బంధం బహిర్గతమైందని ఇటీవల ప్రధాని మోడీ స్పందించారు. ఇతని వ్యాఖ్యలపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2019 పుల్వామా ఉగ్రదాడిలో పాక్ ప్రమేయాన్ని గతంలో ఫవాద్ అంగీకరించారని ఒక నెటిజన్ గుర్తు చేశారు. “మహాఘటబంధన్ మరియు కాంగ్రెస్ పార్టీకి పాకిస్తాన్ పట్ల ఉన్న ప్రేమ గురించి మాకు తెలుసు. అందుకే కాంగ్రెస్ పార్టీని దేశ వ్యతిరేక పార్టీ కేటగిరీలో పెట్టాం. పాకిస్థాన్‌లోని మైనారిటీలకు మీరు ఏమి చేశారో ముందుగా మీరు సమాధానం చెప్పాలి” అని మరొకరు వ్యాఖ్యానించారు. ‘‘ ఈ వ్యక్తి ఒక జోక్, కానీ వ్యతిరేకతను స్పష్టంగా బయటపెట్టాడు. నరేంద్ర మోదీని గద్దె దించాలని పాకిస్థాన్ ఎందుకు అంత ఆసక్తిగా ఉందో భారతీయ ఓటర్లకు తెలుసు, అలా జరగనివ్వరు!’’ అని మరొకరు వ్యాఖ్యానించారు.