Site icon NTV Telugu

Pakistan: బడ్జెట్ ప్రవేశపెట్టిన పాక్.. సగం బడ్జెట్ అప్పులకే..

Pakistan

Pakistan

Pakistan: ఆర్థిక సంక్షోభం, రాజకీయ అస్థిరతతో సతమతం అవుతున్న పాకిస్తాన్ ఈ రోజు బడ్జెట్ ప్రవేశపెట్టింది. పీకల్లోతు అప్పులతో బతుకీడుస్తున్న దాయాది దేశం, ఐఎంఎఫ్ నుంచి బెయిలౌట్ ప్యాకేజీ కోసం గత కొంత కాలంగా ప్రయత్నిస్తుంది. ఈ నేపథ్యంలో నగదు కొరతను ఎదుర్కొంటున్న పాకిస్తాన్ ప్రభుత్వం శుక్రవారం 14.5-ట్రిలియన్ రూపాయల (సుమారు 50.5-బిలియన్ డాలర్ల) బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ఆర్థిక మంత్రి ఇషాక్ దార్ అక్కడి పార్లమెంట్ లో బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇందులో సగం కన్నా ఎక్కువగా అప్పులు చెల్లింపుకే బడ్జెట్ పోతోంది. ఏకంగా 7.3 ట్రిలియన్ పాకిస్తాన్ రూపాయలు అప్పులకే వెళ్లిపోతున్నాయి.

Read Also: Siddharth- Aditi: పెళ్లికొడుకు- పెళ్లి కూతురు కంటే.. వీళ్లపైనే అందరి కళ్లు ఉన్నాయే

ద్రవ్యోల్భణం రాకెట్ వేగంతో పాకిస్తాన్ ను చుట్టుముడుతోంది. దీంతో ఆ దేశంలో నిత్యావసరాల ధరలు పెరుగుతున్నాయి. దీని వల్ల దేశంలో పారిశ్రామికోత్పత్తి క్షీణించింది. ఈ ఏడాది చివర్లో పాక్ లో ఎన్నికలు జరగాల్సి ఉన్న నేపథ్యంలో 950 బిలియన్ రూపాయలను అభివృద్ధి ప్రాజెక్టులకు కేటాయించింది. ఎన్నికలను దృషిలో ఉంచుకుని బడ్జెట్ ప్రవేశపెట్టలేదని అక్కడి షహజాబ్ షరీఫ్ ప్రభుత్వం చెబుతోంది. ఇన్ని సమస్యల మధ్య ఉన్నా కూడా పాక్ రక్షణ రంగానికి భారీగానే నిధులు కేటాయించింది. గతేడాది 1.5 ట్రిలియన్ రూపాయలు కేటాయిస్తే, ఈ బడ్జెట్ లో 1.8 ట్రిలియన్ రూపాయలను కేటాయించింది.

పీకల్లోతు ఆర్థిక సమస్యల్లో కూరుకుపోయిన పాకిస్తాన్, అంతర్జాతీయ ద్రవ్యనిధి నుంచి 6.5 బిలియన్లలో చివరి విడుత నిధుల కోసం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అయితే పాకిస్తాన్ లో ఆర్థిక సంస్కరణలు చేపడితేనే, పన్నులను పెంచితేనే ఐఎంఎఫ్ నిధులు విడుదల చేస్తామని చెబుతోంది. అయితే ఈ ఏడాది ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ప్రజలపై పన్నులను రుద్దితే ఓటమి ఎదురవుతుందని అక్కడి ప్రభుత్వం భావిస్తోంది. దీంతోనే పన్నులను పెంచలేకపోతోంది. 2022-23లో జీడీపీ వృద్ధి 0.3 శాతంగా ఉంటుందని అక్కడి ప్రభుత్వం తెలిపింది. ఈ ఏడాది పాక్ వృద్ధి 2 శాతం మేర ఉంటుందని ప్రపంచ బ్యాంక్ అంచనా వేసింది.

Exit mobile version