Maryam Nawaz: రాజకీయ నాయకుల వీఐపీ తాకిడికి సామాన్య విద్యార్థుల చదువులను బలిచేసే ధోరణిపై పాకిస్థాన్లో తీవ్ర ఆగ్రహజ్వాలలు వ్యక్తమవుతున్నాయి. పంజాబ్ ప్రావిన్స్ ముఖ్యమంత్రి మరియం నవాజ్ పర్యటన ఉందన్న ఒకే ఒక్క కారణంతో, జరుగుతున్న బోర్డు స్థాయి ఇంటర్మీడియట్ పరీక్షను అర్ధాంతరంగా రద్దు చేయడం తీవ్ర దుమారం రేపుతోంది. విద్యార్థుల భవిష్యత్తు కంటే ముఖ్యమంత్రికి ఇచ్చే ప్రోటోకాల్, భద్రతా హంగామానే సర్కారుకు ఎక్కువైపోయిందా అంటూ తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు రోడ్డెక్కుతున్నాయి.
పంజాబ్ ప్రావిన్స్ ముఖ్యమంత్రి మరియం నవాజ్ నవంబర్ 10న జీలం, పిండ్ దాదన్ ఖాన్ ప్రాంతాల్లో అధికారికంగా పర్యటించాల్సి ఉంది. అయితే సరిగ్గా అదే రోజున ఇంటర్ సెకండ్ ఇయర్ కంప్యూటర్ సైన్స్ రెండో వార్షిక పరీక్ష జరగాల్సి ఉంది. సీఎం రాక కోసం పెద్ద ఎత్తున జిల్లా అధికారులు, భారీ సంఖ్యలో పోలీసు బలగాలు విధుల్లో ఉంటారని, దీనివల్ల అదే రోజు పరీక్ష నిర్వహించడం కష్టమని జీలం డిప్యూటీ కమిషనర్ బోర్డుకు సిఫార్సు చేశారు. దీంతో రావల్పిండి ఇంటర్మీడియట్ బోర్డు (BISE) అధికారులు విద్యార్థుల అసౌకర్యాన్ని అడ్డుపెట్టుకుని, జీలం జిల్లా పరిధిలో ఉదయం, సాయంత్రం జరగాల్సిన రెండు షిఫ్టుల పరీక్షలను తక్షణమే రద్దు చేసి వాయిదా వేశారు.
నవంబర్ 10న పూర్తి కావాల్సిన పరీక్షను ఏకంగా 20 రోజుల పాటు వెనక్కి నెట్టి, నవంబర్ 30కి రీషెడ్యూల్ చేశారు. రావల్పిండి బోర్డు పరిధిలోని ఇతర జిల్లాల్లో పరీక్షలు యథావిధిగా జరుగుతుండగా, కేవలం సీఎం పర్యటన ఉన్న జీలం జిల్లాలోనే ఈ మార్పు చేయడంతో తల్లిదండ్రులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. రాత్రింబవళ్లు పుస్తకాలతో కుస్తీ పట్టి పరీక్షకు సిద్ధమైన పిల్లల మానసిక స్థితిని ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదని వారు నిప్పులు చెరుగుతున్నారు. “ఒక వీఐపీ రోడ్డు మీద వెళ్తుంటే పరీక్షలు ఆపేస్తారా? నాయకుల హంగామా కోసం పిల్లల ప్రిపరేషన్ను 20 రోజుల పాటు ఆందోళనలో పడేస్తారా?” అంటూ ప్రజలు ప్రభుత్వాన్ని సూటిగా నిలదీస్తున్నారు. ఈ అనాలోచిత నిర్ణయంపై పాక్ సోషల్ మీడియా వేదికగా సర్కార్ తీరును నెటిజన్లు చీల్చిచెండాడుతున్నారు.

