Pakistan: పాకిస్తాన్ పరిపాలన సైన్యం చేతుల్లో ఉందో, లేక ఎన్నికైన ప్రభుత్వం చేతుల్లో ఉందా? అనేది ఎవరికి తెలియదు. నిజానికి బయటకు ప్రజాప్రభుత్వం కనిపిస్తున్నా, అంతా వెనకనుంచి నడిపించేది ఆ దేశ సైన్యమే. ఆ దేశ సైన్యాన్ని కాదని ఎలాంటి నిర్ణయాలు కూడా తీసుకునే పరిస్థితి ఉండదు. ఇదిలా ఉంటే, పాక్ ఆర్మీ అంతర్గత భద్రతను పర్యవేక్షించే పోలీసులు విధుల్లో్ కూడా జోక్యం చేసుకుంటోంది. ఆ దేశంలో సైన్యం వర్సెస్ పోలీసులుగా వ్యవహారం మారింది.
సైన్యం తమ విధుల్లో జోక్యం చేసుకుంటోందని పోలీసులు పేర్కొంటూ, సైన్యం నిష్ర్కమించాలని నిరసన చెపట్టారు. ఈ ప్రాంతంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని, భద్రతను మరింత దిగజార్చేందుకు మిలిటరీ, ఐఎస్ఐ కారణమని పోలీసులు ఆరోపించారు. గత కొన్నేళ్లుగా తమ సహోద్యోగుల్ని తాలిబాన్లు కిడ్నాప్ చేయడం లేదా మెరుపుదాడులు చేయడం చూశామని, కొన్ని సందర్భాల్లో వారి కుటుంబాలను కూడా టార్గెట్ చేస్తున్నారని పోలీసులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఆరోపణలతో పోలీసులు చేస్తున్న నిరసన పాకిస్తాన్‌లో శుక్రవారం ఐదో రోజుకు చేరుకున్నాయి.
Read Also: S Jaishankar: “IC 421 హైజాక్ విమానంలో నా తండ్రి”.. ఆనాటి ఘటనను గుర్తు చేసుకున్న జైశంకర్..
ఈ వారం ప్రారంభంలో వివిధ ప్రాంతాలకు చెందిన పోలీస్ అధికారులు ముఖ్యంగా ఖైబర్ ఫఖ్తుంఖ్వా, బలూచిస్తాన్ వంటి అస్థిర ప్రాంతాల్లో సైనిక, నిఘా వర్గాలు తమ విధుల్లో జోక్యం చేసుకుంటున్నాయని పాక్ పోలీసులు ఆరోపించారు. సెప్టెంబర్ 9న షెషావర్, కరాచీ నగరాలను కలిపే సింధు రహదారిని పోలీసులు అడ్డుకున్నారు. నిరసన తెలుపుతున్న పోలీసులకు బన్నూ, డేరా ఇస్మాయిల్ ఖాన్‌తో సహా సమీప జిల్లాల అధికారుల నుంచి మద్దతు లభించింది. పోలీసుల నిరసనకు గిరిజన సంఘాలు, రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల నుంచి మద్దతు లభించింది.
‘‘ వారి మంచి, చెడు తాలిబాన్ల ఆట ఇంకా ముగియలేదు. మేము(పోలీసులు) తీవ్రవాదుల్ని అరెస్ట్ చేస్తే, వారు(మిలిటరీ) వారిని విడుదల చేయాలని చెబుతున్నారు’’ అని ఓ పోలీస్ అధికారి చెప్పారు. మిలిటరీ అధికారులు తమ జోక్యాన్ని నిలిపేస్తే, మూడు నెలల్లో ఈ ప్రాంతాల్లో శాంతిని పునరుద్ధరిస్తామని మరో అధికారి హామీ ఇచ్చారు.
ఇటీవల కాలంలో పాకిస్తాన్ వ్యాప్తంగా పోలీసులపై పాక్ తాలిబాన్లు దాడులు చేస్తున్నారు. పోలియో వ్యాక్సిన్ ప్రచారంలో రక్షణ కల్పిస్తున్న పోలీసు అధికారిపై కాల్పులు జరిగాయి. సెప్టెంబర్ 11న, వాయువ్య పాకిస్తాన్‌లో పోలీయో టీకా బృందంపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఇందులో ఓ పోలీస్ హతమయ్యాడు. దీంతో నిరసనకు దిగిన పోలీస్ అధికారులు పోలియో డ్యూటీని బహిష్కరించాలని పిలుపునిచ్చారు.