Site icon NTV Telugu

Kashmir: కశ్మీర్‌పై నోరు పారేసుకున్న పాక్‌ ప్రధాని.. కౌంటర్‌ ఇచ్చిన మోడీ..

Pm Shehbaz Sharif

Pm Shehbaz Sharif

పాకిస్థాన్‌ ప్రధానిగా షహబాజ్‌ షరీఫ్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకుంది నేషనల్‌ అసెంబ్లీ.. ఈ సందర్భంగా సభను ఉద్దేశించి షహబాజ్‌ షరీఫ్‌ ప్రసంగించారు. పాకిస్థాన్‌కు చైనా, సౌదీ, టర్కీ స్నేహితులని చెప్పుకొచ్చారు. చైనా సహకారంతో ప్రాజెక్టుల్ని పరుగులు పెట్టిస్తామన్నారాయన. అయితే, భారత్‌, అమెరికాలతో సత్సంబంధాలు ముఖ్యమే అన్నారు షరీఫ్‌. తాము భారత్‌తో సత్సంబంధాలు కోరుకుంటున్నా… కశ్మీర్‌కు శాంతియుత పరిష్కారంతోనే అది సాధ్యమన్నారాయన. ప్రతి అంతర్జాతీయ వేదికపైనా కశ్మీర్‌ అంశాన్ని లేవనెత్తుతామన్నారు పాక్‌ కొత్త ప్రధాని షహబాజ్‌ షరీఫ్‌. ఇక, కశ్మీర్‌లో 370 అధికరణను ఇండియా రద్దు చేయడాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. 2019 ఆగస్టులో 370వ అధికరణను భారత్‌ రద్దు చేయగానే ఇమ్రాన్ ఖాన్ ఆ విషయాన్ని ఎంత మాత్రం సీరియస్‌గా తీసుకోలేదని, దౌత్యపరమైన ప్రయత్నాలు చేయలేదని విమర్శించారు. ”కశ్మీరీ ప్రజల రక్తం రోడ్లపై పారింది, కశ్మీర్ లోయ రక్తసిక్తమైంది”అని షెహ్‌బాజ్ అన్నారు. కశ్మీర్ సమస్య పరిష్కారమయ్యేంత వరకూ శాంతి అసాధ్యమని చెప్పారు.

Read Also: IPL: గుజరాత్‌ దూకుడుకు బ్రేక్‌లు.. హైదరాబాద్‌ సెకండ్‌ విక్టరీ..

మరోవైపు, పాకిస్థాన్‌ నూతన ప్రధానిగా ఎన్నికైన షెహబాజ్‌ షరీఫ్‌కు భారత ప్రధాని మోడీ అభినందనలు తెలిపారు. అలాగే కశ్మీర్‌పై నోరు పారేసుకున్న షెహబాజ్‌కు సుతిమెత్తగా కౌంటర్‌ ఇచ్చారు నరేంద్ర మోడీ. ఉగ్రవాదం లేని ప్రాంతంలో భారత్‌ ఎల్లప్పటికీ శాంతి, స్థిరత్వాన్ని కొరుకుంటుందనీ, తద్వారా మనం అభివృద్ధి సవాళ్లపై దృష్టి సారించవచ్చనీ, ఇది ఇరుదేశాల ప్రజలకు ఎంతో శ్రేయస్కరం అని మోడీ ట్వీట్‌ చేశారు. మరోవైపు పాకిస్థాన్‌ నేషనల్‌ అసెంబ్లీకి మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ రాజీనామా చేశారు. దొంగలున్న అసెంబ్లీలో తాను కూర్చోబోనని ఆయన వ్యాఖ్యానించారు. ప్రధాని ఎన్నికకు సంబంధించి నేషనల్‌ అసెంబ్లీలో నిర్వహించిన ఓటింగ్‌ను తెహ్రీక్‌ ఈ ఇన్సాఫ్‌ నేతలు బహిష్కరించారు. ఓటింగ్‌ ప్రారంభం కావడానికి ముందే సభ నుంచి వాకౌట్‌ చేశారు. ఇదిలావుంటే, మనీ లాండరింగ్ కేసులో విచారణ ఎదుర్కొంటున్న షెహబాజ్ షరీఫ్‌తోపాటు ఆయన కుమారుడికి పాకిస్థాన్ కోర్టులో ఊరట లభించింది. న్యాయస్థానానికి హాజరుతోపాటు అరెస్టుకు సంబంధించి ముందస్తు బెయిల్‌ను పొడిగించింది కోర్టు. ఈ కేసును ఏప్రిల్ 27కు వాయిదా వేసింది.

Exit mobile version