Pakistan Violence: దాయాది పాకిస్థాన్‌లో తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా తెహ్రీక్-ఏ-లబ్బైక్ పాకిస్థాన్ (టీఎల్‌పీ) అనే మతతత్వ పార్టీ తలపెట్టిన భారీ ర్యాలీతో పాక్ సర్కార్ అప్రమత్తమైంది. ఈరోజు ( అక్టోబర్ 10న) జరగనున్న ‘లబ్బైక్ యా అక్సా మిలియన్ మార్చ్’ కారణంగా రాజధాని ఇస్లామాబాద్, రావల్పిండి నగరాల్లో మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిరవధికంగా ఆపేశారు. ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా, రాజధానికి వెళ్లే అన్ని ప్రధాన మార్గాలను దిగ్బంధించారు. నగరంలో రెడ్ జోన్‌ను పూర్తిగా సీల్ చేసి, కేవలం అధికారిక పాసులు ఉన్నవారికి మాత్రమే పర్మిషన్ ఇస్తున్నారు. అంతర్గత వ్యవహారాల మంత్రి మోహ్సిన్ నఖ్వీ ఆదేశాలతోనే ఈ నిర్ణయం తీసుకున్నారు. అలాగే, పంజాబ్ ప్రావిన్స్ వ్యాప్తంగా 10 రోజుల పాటు 144 సెక్షన్‌ను అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో బహిరంగ ప్రదేశాల్లో నలుగురి కంటే ఎక్కువ మంది తిరగడటంపై నిషేధం విధించారు.
Read Also: Post Office Scheme: ఏడాదికి కేవలం రూ.755లకే ప్రీమియం.. రూ.15 లక్షల ప్రయోజనాలు
అయితే, ఈ ర్యాలీకి ముందే లాహోర్‌లో హింసాత్మక ఘటనలు జరిగాయి. టీఎల్‌పీ చీఫ్ సాద్ హుస్సేన్ రిజ్వీని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు బుధవారం రాత్రి వారి ప్రధాన కార్యాలయానికి వెళ్లారు. దీంతో టీఎల్‌పీ కార్యకర్తలు రాళ్లు, ఇనుప రాడ్లతో పోలీసులపై దాడికి దిగారు. ఈ ఘర్షణల్లో ఐదుగురు పోలీసులు, పదుల సంఖ్యలో ఆందోళనకారులు గాయపడ్డారు. ఈ సందర్భంగా తమ కార్యకర్త ఒకరు మరణించగా, 20 మందికి గాయాలు అయ్యాయని టీఎల్‌పీ వర్గాలు పేర్కొన్నాయి. పాక్ ప్రభుత్వ చర్యలను టీఎల్‌పీ తీవ్రంగా ఖండించింది. శాంతియుతంగా తలపెట్టిన మా ర్యాలీని అడ్డుకోవడానికి సర్కార్ నీచమైన చర్యలకు దిగుతుందని ఆరోపించారు. పాలస్తీనాకు సపోర్టు తెలపడం పాకిస్థాన్‌లో నేరంగా మారిందన్నారు టీఎల్‌పీ ప్రతినిధి.
Read Also: Ap Fake Liquor Case : ఏపీ కల్తీ మద్యం కేసులో పెద్ద షాక్..! విదేశాల్లో మెయిన్ నిందితుడు..
ఇక, ఈ నిర్బంధాలను ఆపకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవల్సి వస్తుందని టీఎల్‌పీ నేతలు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ప్రస్తుతం లాహోర్‌లోని టీఎల్‌పీ ప్రధాన ఆఫీసు వద్ద భారీగా పోలీసులను మోహరించారు. పరిస్థితి అదుపు తప్పితే పారామిలటరీ దళాలైన రేంజర్లను రంగంలోకి దించాలని పంజాబ్ సర్కార్ ప్లాన్ చేస్తుంది. మరోవైపు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గాజా ప్రణాళికకు పాకిస్తాన్ ప్రభుత్వం మద్దతు ఇవ్వడాన్ని నిరసిస్తూ నిరసనకారులు వీధుల్లోకి వచ్చి పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా పాక్ ప్రధాని మంత్రి షెహబాజ్ షరీఫ్, సైన్యాధ్యక్షుడు అసిఫ్ మునీర్ అమెరికాకు తొత్తులుగా మారి పాలస్తీనాకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని టీఎల్‌పీ శ్రేణులు ఆరోపించారు.
