పాకిస్థాన్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఖైబర్ పఖ్తున్ఖ్వా ప్రావిన్స్ రాజధాని పెషావర్ నగరంలో ఓ ప్రైవేట్ పాఠశాల పైకప్పు కూలి 28 మంది విద్యార్థులు, ఓ మహిళా ఉపాధ్యాయురాలు ప్రాణాలు కోల్పోయారు. విద్యార్థులంతా 13 ఏళ్లలోపు వారుగా గుర్తించారు. ఈ ఘటనలో మరో 40 మందికి పైగా గాయపడ్డారు. శిథిలాల కింద మరికొందరు చిన్నారులు చిక్కుకున్నట్లు సమాచారం. దీంతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
పెషావర్‌లోని దిర్ కాలనీలో ఉన్న ప్రైవేట్ పాఠశాలలో ఈ ప్రమాదం జరిగింది. పైకప్పు ఒక్కసారిగా కూలిపోవడంతో విద్యార్థులు శిథిలాల కింద చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న అత్యవసర సేవల సిబ్బంది వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాలను తొలగిస్తూ లోపల చిక్కుకున్న వారిని బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు అత్యవసర సేవల ప్రతినిధి బిలాల్ ఫైజీ తెలిపారు. ప్రమాదానికి గల కారణాలు వెంటనే తెలియరాలేదు.
ప్రమాదంలో మృతి చెందిన 28 మంది విద్యార్థులు, మహిళా ఉపాధ్యాయురాలి మృతదేహాలను పెషావర్‌లోని లేడీ రీడింగ్ ఆసుపత్రికి తరలించినట్లు ఆసుపత్రి ప్రతినిధి మొహమ్మద్ ఆసిమ్ వెల్లడించారు. మరోవైపు 40 మందికి పైగా గాయపడినట్లు స్థానిక మీడియా సంస్థ జియో న్యూస్ తెలిపింది. వీరిలో 20 మంది చిన్నారులు ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. గాయపడిన వారికి ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు.
ఈ ప్రమాదంపై పాకిస్థాన్ ప్రావిన్షియల్ విద్యాశాఖ కార్యదర్శి ఇనాయతుల్లా వసీమ్ స్పందించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని ప్రైవేట్ స్కూల్స్ రెగ్యులేటరీ అథారిటీ మేనేజింగ్ డైరెక్టర్‌ను ఆదేశించారు. గురువారం నాటికి నివేదిక ఇవ్వాలని సూచించినట్లు జియో న్యూస్ కథనం పేర్కొంది. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన విద్యార్థులు, ఉపాధ్యాయురాలి కుటుంబాలకు సంతాపం తెలిపారు.

