PoK Unrest 2026: పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ (PoK) లో గత మూడు రోజులుగా మునుపెన్నడూ లేని విధంగా తీవ్ర అశాంతి, హింస చెలరేగుతున్నాయి. అక్కడి స్థానిక ‘పీపుల్స్ యాక్షన్ కమిటీ’ (PAC) పై పాక్ ప్రభుత్వం నిషేధం విధించడంతో వేలాది మంది ప్రజలు రోడ్లపైకి వచ్చి ఆర్మీ, పోలీసులతో తలపడుతున్నారు. ఈ తీవ్రమైన ఘర్షణల్లో ఇప్పటివరకు నలుగురు పోలీసులు, ఏడుగురు పౌరులు ప్రాణాలు కోల్పోగా, 70 మందికి పైగా తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. నిరసనలను ఉక్కుపాదంతో అణచివేసేందుకు పాక్ సర్కార్ తన పూర్తి సైనిక బలగాలను రంగంలోకి దించింది.
9 నెలల క్రితం పడిన బీజం
పీఓకేలో ఇప్పుడు కనిపిస్తున్న ఈ కార్చిచ్చుకు తొమ్మిది నెలల క్రితమే బీజం పడింది. 2025 సెప్టెంబర్‌లో పీపుల్స్ యాక్షన్ కమిటీ (PAC) ఆధ్వర్యంలో ఒక వారం పాటు భారీ నిరసనలు జరిగాయి. పీఓకే అసెంబ్లీలో ప్రవాస కాశ్మీరీల కోసం రిజర్వ్ చేసిన 12 సీట్లను తక్షణమే రద్దు చేయాలనేది ఈ కమిటీ ప్రధాన డిమాండ్. ఆ సమయంలో సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇస్తూ ప్రభుత్వం, పీఏసీ మధ్య ఒక ఒప్పందం కుదిరింది. కానీ, గడిచిన తొమ్మిది నెలలుగా పాక్ ప్రభుత్వం ఈ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇదే సమయంలో పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో వివాదం మళ్లీ మొదటికి వచ్చింది. ప్రభుత్వం తమ డిమాండ్లను పట్టించుకోకుండా ఎన్నికలకు వెళ్లడాన్ని నిరసిస్తూ జూన్ 9న పీఓకే వ్యాప్తంగా భారీ నిరసనలకు ఈ కమిటీ పిలుపునిచ్చింది.
అయితే ఈ నిరసన కార్యక్రమం జరగకముందే పాకిస్థాన్ ప్రభుత్వం అత్యంత కఠినంగా వ్యవహరించింది. పీపుల్స్ యాక్షన్ కమిటీ (PAC) పై నిషేధం విధించడమే కాకుండా, అందులోని కీలక సభ్యులపై ఉగ్రవాద నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేసి జైల్లో పెట్టింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎలాంటి తిరుగుబాటు రాకుండా ఉండేందుకే ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా ఆ 12 పోస్టుల రిజర్వేషన్ రద్దు చేసే వరకు తమ అహింసాత్మక పోరాటం ఆగేది లేదని కమిటీ స్పష్టం చేసింది.
పాక్ ప్రధాని సంచలన ఆరోపణలు
పీఓకే పరిపాలనా అధిపతి, పాకిస్థాన్ ప్రధానమంత్రి ఫైసల్ ముంతాజ్ రాథోర్ ఈ ఉద్రిక్తతలపై సంచలన ప్రకటన విడుదల చేశారు. “పీపుల్స్ యాక్షన్ కమిటీ (PAC) కేవలం నిరసనల సాకుతో పాక్ ఆక్రమిత కాశ్మీర్‌ను రెండు ముక్కలుగా విడగొట్టడానికి కుట్ర పన్నుతోంది. భవిష్యత్తులో వీరు మితిమీరిన హింసకు, ప్రభుత్వ ఆస్తుల విధ్వంసానికి ప్లాన్ చేస్తున్నట్లు మా నిఘా వర్గాల సమాచారంలో తేలింది. అందుకే ఈ కమిటీని నిషేధించాల్సి వచ్చింది. ఇప్పటికైనా వారు హింసను వీడి ప్రభుత్వంతో చర్చలకు రావాలి” అని పిలుపునిచ్చారు. ప్రస్తుతం పీఓకేలోని ముజఫరాబాద్ సహా పలు ప్రధాన నగరాల్లో కర్ఫ్యూ లాంటి వాతావరణం నెలకొంది. ఇటు ప్రజలు, అటు పాక్ సైన్యం వెనక్కి తగ్గకపోవడంతో కాశ్మీర్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పీక్ స్టేజ్‌కు చేరుకున్నాయి. ఈ టైంలో పీఓకే ప్రజలు భారత్‌లో కలవడానికి మొగ్గు చూపుతారా అనే ఊహాగానాలు కూడా వెలువడుతున్నాయి.

