NTV Telugu Site icon

Pakistan Flood: పాకిస్తాన్‌లో భారీ వరదలు.. అంతర్జాతీయ సాయం కోసం అభ్యర్థన

Pakistan Floods

Pakistan Floods

Pakistan appeals for urgent aid from international community: పాకిస్తాన్ దేశాన్ని భారీ వరదలు తీవ్రంగా ముంచెత్తాయి. అసలే ఆర్థిక పరిస్థితులు బాగా లేక కొట్టుమిట్టాడుతున్న ఆ దేశాన్ని వరదలు మరింతగా నష్టపరిచాయి. ఏంతలా అంటే ప్రస్తుతం పాకిస్తాన్ లోని మూడోంతుల్లో ఒక వంతు భూభాగం పూర్తిగా నీటితోనే నిండి ఉంది. సింధు నది దాని ఉపనదులు పొంగిపొర్లడంతో సింధ్ ప్రావిన్స్, బలూచిస్తాన్ ప్రావిన్సుల్లో తీవ్రంగా నష్టం వాటిల్లింది. జూన్ మధ్య నుంచి ఇప్పటి వరకు కురిసిన వర్షాల వల్ల 1265 మంది మరణించారు. వరదల వల్ల 3.3 కోట్ల మంది ప్రజలు ప్రభావితం అయ్యారు.

ఇప్పటికే తీవ్రమైన అప్పులు, ఆర్థిక సంక్షోభంలో ఉంది పాకిస్తాన్. ఈ వరదల వల్ల పాకిస్తాన్ కు 10 బిలియన్ డాలర్ల నష్టం ఏర్పడింది. మౌళిక సదుపాయాలైన రోడ్డు, బ్రిడ్జిలు, కరెంట్ స్తంబాలు ఎక్కడికక్కడ దెబ్బతిన్నాయి. వ్యవసాయ భూములు కొట్టుకుపోయాయి. వరదల ధాటికి పెద్ద పెద్ద సరస్సులు ఏర్పడ్డాయి. గడిచిన 24 గంటల్లోనే వరదల వల్ల మరో 57 మంది మరణించారు. ఇప్పటి వరకు గాయపడిన వారి సంఖ్య 12,577కు చేరుకుంది.

Read Also: India vs Pakistan Live : సూపర్ ఫోర్‌లో భాగంగా భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్

పాక్ సైన్యంతో పాటు అన్ని అధికారిక డిపార్ట్మెంట్లు వరద బాధితులకు సహాయం చేస్తున్నారు. బలూచిస్థాన్, ఖైబర్ పఖ్తుంక్వా, సింధ్, పంజాబ్ ప్రావిన్స్‌లలో ప్రస్తుతం 500,000 మందికి పైగా ప్రజలు సహాయక శిబిరాల్లో నివసిస్తున్నారు. గత 30 ఏళ్లలో పాకిస్తాన్ లో ఇలాంటి వరదలు రాలేదు. పాకిస్తాన్ వరదల కారణంగా దేశంలో ‘జాతీయ ఎమర్జెన్సీ’ని విధించింది. పాకిస్తాన్ లోని వరదలను 2005లో యూఎస్ లో సంభవించిన హరికెన్ కత్రినాతో పోలుస్తున్నారు. మరోవైపు పాకిస్తాన్ వరద కష్టాల నుంచి బయటపడేందుకు అంతర్జాతీయ సహాయాన్ని కోరుతోంది. ఇప్పటికే యూఎన్ పాకిస్తాన్కు సహాయాన్ని ప్రారంభించింది. ఫ్రాన్స్, యూఏఈ, ఉజ్బెకిస్థాన్ దేశాల నుంచి వరద సాయం పాకిస్తాన్ కు అందింది. యూఏస్ఏ 30 మిలియన్ డాలర్ల సహాయాన్ని ప్రకటించింది.