Earthquake: పాకిస్థాన్‌లో భారీ భూకంపం.. భారత్‌లోనూ ప్రకంపనలు

  • పాకిస్థాన్‌లో భారీ భూకంపం
  • భూకంప తీవ్రత 5.8గా నమోదు
  • భారత్‌లోనూ ప్రకంపనలు
Earthquake

Earthquake

పాకిస్థాన్‌లో భారీ భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత 5.8గా నమోదైంది. భూకంప కేంద్రం పాకిస్థాన్‌లోనే ఏర్పడింది. భూకంప తీవ్రత భారతదేశంలోని కొన్ని ప్రాంతాలపై కూడా ప్రభావం చూపించింది. ప్రస్తుతానికి ఎలాంటి ప్రాణనష్టం గానీ, ఆస్తి నష్టం గానీ జరగలేదు.

శనివారం తెల్లవారుజామున హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లాలో భూకంపం సంభవించింది. ఈ భూకంప తీవ్రత 4.1గా నమోదైంది. రాష్ట్ర రాజధానికి సుమారు 130 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాంపూర్ ప్రాంతంలో ఈ ప్రకంపనలు నమోదయ్యాయి. జాతీయ భూకంప శాస్త్ర కేంద్రం (నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ) ప్రకారం.. ఉదయం 4:36 గంటల ప్రాంతంలో కొన్ని సెకన్ల పాటు ఈ ప్రకంపనలు సంభవించాయి. భూకంప కేంద్రం భూమికి 10 కిలోమీటర్ల లోతులో ఉందని పేర్కొంది.

భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ (ఎస్‌డిఎంఏ) పేర్కొంది. కొండ ప్రాంత రాష్ట్రమైన హిమాచల్ ప్రదేశ్‌లో తరచుగా సంభవిస్తున్న భూకంపాలు స్థానికులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇటీవల ఆగస్టు 26వ తేదీ ఉదయం సిమ్లాలో స్వల్ప ప్రకంపనలు సంభవించాయి. అధికారిక సమాచారం ప్రకారం.. ఆగస్టు 1వ తేదీ నాటికి గత మూడేళ్లలో హిమాచల్ ప్రదేశ్‌లో 67 భూకంపాలు సంభవించాయి. వీటివల్ల రూ. 7.05 లక్షల విలువైన ప్రైవేట్ ఆస్తి నష్టం జరిగింది.