Pakistan comments on buying oil from Russia: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో రష్యాపై అమెరికాతో పాటు అన్ని పాశ్చాత్య దేశాలు ఆంక్షలు విధిస్తున్నాయి. రష్యా నుంచి ఆయిల్, గ్యాస్ కొనుగోలును నిలిపివేశాయి యూరోపియన్ దేశాలు. ఇలాంటి కష్టసమయంలో భారత్, రష్యాకు అండగా నిలిచింది. డిస్కౌంట్ పై రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తోంది. ఇటీవల కాలంలో భారత్, రష్యా నుంచి దిగుమతి చేసుకునే చమురు పెరిగింది. అయితే భారత్ చర్యపై అమెరికాతో పాటు పలు యూరోపియన్ దేశాలు అసహనంతో ఉన్నాయి. అయినా పలు వేదికలపై రష్యా నుంచి ఆయిల్ ఎందుకు కొనుగోలు చేస్తున్నామో తెలియజేశారు విదేశాంగశాఖ మంత్రి ఎస్. జైశంకర్.
Read Also: Manchu Vishnu: దమ్ముంటే ఆ బడా హీరో పేరు చెప్పు.. లేదంటే..
ఇదిలా ఉంటే పాకిస్తాన్ సరికొత్త వాదన తీసుకువచ్చింది. భారత్ కు ఇస్తున్న ధరకే తమకు కూడా చమురును అందిస్తే పాకిస్తాన్ కూడా రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తుందని పాకిస్తాన్ ఆర్థిక మంత్రి ఇషాక్ దార్ అన్నారు. యూఎస్ పర్యటనలో ఉన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ వరదలపై యూఎన్ఓ, ఆసియా అభివృద్ధి బ్యాంక్, ప్రపంచ బ్యాంక్ అధికారులకు నివేదిక సమర్పించారు. వరదల కారణంగా పాకిస్తాన్ 32.40 బిలియన్ డాలర్ల మేర నష్టపోయిందని.. పునరావాస సహాయం కోసం 16 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ నిధులు అవసరం అని పాక్ ఆర్థిక మంత్రి అన్నారు.
వరదల కారణంగా పాకిస్తాన్ లో గోధుమల ఉత్పత్తి తగ్గిపోయే అవకాశం ఉంది. దీంతో రానున్న కాలంలో పాకిస్తాన్ లో తీవ్ర ఆహార సంక్షోభం ఎదుర్కోనుంది. ఇదిలా ఉంటే పాకిస్తాన్ వరదలు అక్కడి వ్యవసాయాన్ని పూర్తిగా దెబ్బతీయడంతో ఆ దేశం రష్యా నుంచి గోధుమలు కొనుగోలు చేయాలని భావిస్తోంది. ఆహార సంక్షోభం మధ్య ఆహార సరఫరా విషయంలో రష్యాను దీర్ఘకాలిక, స్థిరమైన భాగస్వామిగా చూస్తున్నామని పాకిస్తాన్ రాయబారి అన్నారు. ఇటీవల యూఎస్ ప్రెసిడెంట్ పాకిస్తాన్ ను ప్రపంచంలో అత్యంత ప్రమాదకర దేశాల్లో ఒకటి అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యల అనంతరం పాకిస్తాన్ , రష్యా సంబంధాలపై ఈ వ్యాఖ్యలు చేసింది.