Pakistan-Afghanistan War: పాకిస్తాన్-ఆఫ్ఘనిస్తాన్ మధ్య మరోసారి తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. బలూచిస్తాన్‌లోని గులిస్తాన్ సెక్టార్‌లో పాకిస్తాన్ భద్రతా బలగాలు, ఆఫ్ఘాన్ తాలిబాన్ల మద్య కాల్పులు జరిగినట్లు పాక్ మీడియ తెలిపింది. తాలిబాన్లు పాకిస్తాన్ భూభాగంలోకి ప్రవేశించే ప్రయత్నాలను తిప్పికొట్టామని పాక్ భద్రతా బలగాలు చెప్పాయి. తాము చేసిన దాడుల్లో పలువురు తాలిబాన్లు మరణించినట్లు పాకిస్తాన్ చెప్పింది. అయితే, దీనిపై తాలిబాన్ ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక వివరణ రాలేదు.
మరోవైపు, కాందహార్ స్పిన్ బోల్డక్ ప్రాంతంలో కూడా పాకిస్తాన్, ఆఫ్ఘాన్ బలగాల మధ్య కాల్పులు జరిగాయి. కొన్ని పాకిస్తానీ సరిహద్దు పోస్టులను పాక్ సైనికులు విడిచిపెట్టి పారిపోయారని ఆఫ్ఘాన్ మీడియా చెప్పింది. పాక్-ఆఫ్ఘాన్ మధ్య డ్యూరాండ్ లైన్ వెంట గతంలో పలుమార్లు కాల్పులు చోటుచేసుకున్నాయి.
పాకిస్తాన్ సెప్టెంబర్ 24న ఆఫ్ఘనిస్తాన్‌లోని 10 ప్రాంతాలపై దాడులు చేసింది. తమ దేశంపై డ్రోన్ దాడులు జరిగేందుకు ఈ ప్రాంతంలో డ్రోన్లను నిల్వచేస్తున్నారని అందుకే దాడి చేయాల్సి వచ్చిందిన పాకిస్తాన్ చెప్పింది. అయితే, ఈ వ్యాఖ్యల్ని ఆఫ్ఘనిస్తాన్ తోసిపుచ్చింది. పాక్ చేసిన దాడుల్లో నలుగురు మరణించినట్లు వెల్లడించింది. సెప్టెంబర్ 23న ఆఫ్ఘాన్ నుంచి వచ్చినట్లు భావిస్తు్న్న 8 డ్రోన్లను తమ భద్రతా బలగాలు కూల్చేశాయని పాకిస్తాన్ చెప్పింది.

