NTV Telugu Site icon

Pakistan Elections: ముగిసిన ఓట్ల లెక్కింపు.. “బ్యాట్” లేకున్నా సెంచరీ కొట్టిన ఇమ్రాన్ ఖాన్.. సంకీర్ణ ప్రభుత్వమే..

Pakistan

Pakistan

Pakistan Elections: ఆర్థిక సంక్షోభం, ఉగ్రవాదం, వేర్పాటువాద ఉద్యమాలతో సతమతం అవుతున్న పాకిస్తాన్‌లో ఫిబ్రవరి 8న సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. 266 జాతీయ అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల కౌంటింగ్ ఈ రోజు పూర్తైంది. అయితే, ఏ పార్టీకి కూడా స్పష్టమైన మెజారిటీని సొంతం చేసుకోలేదు. ముఖ్యంగా ఈ ఎన్నికల్లో ఇమ్రాన్ ఖాన్ పార్టీ పాకిస్థాన్ తెహ్రీక్-ఇన్సాఫ్ (PTI)కి చెందిన నేతలు ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగారు. మరోవైపు మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ పార్టీ అయిన ‘‘పాకిస్తాన్ ముస్లింలీగ్-నవాజ్’’, బిలావల్ భుట్టో పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ(పీపీపీ) పోటీలో నిలిచాయి. అయితే, ఏ పార్టీ కూడా ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 133 మ్యాజిక్ ఫిగర్ మార్క్‌ని చేరుకోలేదు.

“బ్యాట్” లేకున్నా సెంచరీ చేసిన ఇమ్రాన్ ఖాన్:

ఈ ఎన్నికల ముందు అనేక అవినీతి కేసుల్లో మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్టయ్యాడు. ఎన్నికల్లో పాల్గొనకుండా పాక్ ఎన్నికల సంఘం ఇమ్రాన్‌‌పై నిషేధం విధించింది. చివరకు ఆయన పీటీఐ పార్టీ ఎన్నికల గుర్తు ‘‘బ్యాట్’’ని ఎన్నికల పెషావర్ కోర్టు బ్యాన్ చేసింది. ఈ నేపథ్యంలో ఇమ్రాన్ మద్దతుదారులు ఇండిపెండెంట్లుగా బరిలోకి దిగారు. ఏకంగా 101 స్థానాల్లో వీరు గెలుపొందారు. ప్రభుత్వ ఏర్పాటుకు కేవలం 32 సీట్ల దూరంలో ఆగిపోయారు. ఇదిలా ఉంటే, ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని ఇమ్రాన్ ఖాన్ పార్టీ ఆరోపణలు చేసింది. ఈ రోజు దేశవ్యాప్తంగా ఆందోళనలకి పిలుపునిచ్చింది.

సంకీర్ణ ప్రభుత్వమే:

మరోవైపు, నవాజ్ షరీఫ్ పార్టీకి 73 స్థానాలు, బిలావల్ భుట్టో పార్టీకి 54 స్థానాల్లో గెలుపొందింది. వీరిద్దరు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని చర్చలు జరుపుగుతున్నాయి. శనివారం నవాజ్ సోదరుడు మాజీ ప్రధాని షెహబాజ్ షరీఫ్, బిలావల్ భుట్టోతో భేటీ అయ్యాడు. ప్రభుత్వ ఏర్పాటుకు ఇరు పార్టీలు అంగీకారానికి వచ్చాయి అయితే, ఏయే పదవులు పంచుకోవాలనే దానిపై చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. మెజారిటీకి ఈ రెండు పార్టీలు మరో 6 స్థానాల దూరంలో ఉన్నాయి. చిన్నాచితక పార్టీలు కలిసి 27 స్థానాలు గెలిపొందిన క్రమంలో వీరి నుంచి సంకీర్ణ ప్రభుత్వానికి మద్దతు వచ్చే అవకాశం ఉంది.  పాక్ ఆర్మీ మద్దతు కూడా నవాజ్ షరీఫ్‌కి ఉండటంతో నవాజ్-బిలావల్ భుట్టోనే అధికారం చేపట్టే అవకాశం ఉంది.

పాక్ ఆర్మీకి షాక్:

పాకిస్తాన్‌లో బయటకు మాత్రమే ప్రజాస్వామ్యం కనిపిస్తు్న్నా, మొత్తం నడిపేది, నడిపించేది ఆ దేశ ఆర్మీనే. ఆర్మీకి ఎదురుతిరగడంతోనే ఇమ్రాన్ ఖాన్‌పై పలు కేసులు పెట్టి జైల్‌లో వేశారని పాక్ ఆర్మీపై అభియోగాలు ఉన్నాయి. ఎన్నికల ముందు ఉన్నపలంగా లండన్‌లో ఉన్న నవాజ్ షరీఫ్‌ని పాక్ ఆర్మీ తెరపైకి తీసుకువచ్చింది. పాక్ ఆర్మీ వల్లే నవాజ్ స్వదేశానికి వచ్చాడని సాక్ష్యాత్తు అతని కుమార్తె చెప్పింది. ఇన్ని ప్లాన్స్ చేసినా కూడా ఇమ్రాన్ ఖాన్‌కి మెజారిటీ సీట్లు రావడం పాకిస్తాన్ సైన్యానికి మింగుడుపడటం లేదు.