NTV Telugu Site icon

Iran: గతేడాదిలో 900 మందికి ఉరిశిక్షలు అమలు చేసిన ఇరాన్..

Iran

Iran

Iran: ఇస్లామిక్ దేశం ఇరాన్ తన ప్రజలను ఉరితీసుకుంటూ వెళ్తోంది. ఆ దేశంలో నేరాలకు పాల్పడిన ఖైదీలకు విచ్చలవిడిగా మరణశిక్షలు విధించడంపై ఐక్యరాజ్యసమితి మానవహక్కుల చీఫ్ మంగళవారం ఆందోళన వ్యక్తం చేశారు. గత ఏడాది ఇరాన్‌లో 900 మందికిపైగా మరణశిక్షలు విధించారని, వీరిలో డిసెంబర్‌లో ఒకే వారంలో దాదాపుగా 40 మందికి ఉరిశిక్ష అమలు చేసినట్లు వోల్కర్ టర్క్ చెప్పారు. 2024లో మొత్తంగా 901 మందికి ఉరిశిక్ష విధించినట్లు వెల్లడించారు. ఇరాన్ వ్యాప్తంగా ఉరిశిక్షల సంఖ్య ప్రతీ ఏడాది కూడా పెరుగుతూ వెళ్లడం ఆందోళన కలిగిస్తోందని చెప్పారు.

Read Also: Kerala: సీపీఎం నేత హత్య కేసులో 9 మంది ఆర్ఎస్ఎస్ కార్యకర్తలకు యావజ్జీవం..

ఇరాన్ హత్య, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, అత్యాచారం, లైంగిక వేధింపులతో సహా ప్రధాన నేరాలకు మరణశిక్షలను అమలు చేస్తుంది. ఇస్లామిక్ దేశాలు, చైనా మినహా మరే దేశం కూడా ఈ స్థాయిలో మరణశిక్షలు విధించడం లేదని చెప్పింది. ఇరాన్ అత్యున్నత నాయకుడు అయతొల్లా అలీ ఖమేనీ పాలనలో అధికారులు, ప్రభుత్వం అంటే భయపడేలా ఉరిశిక్షల్ని ఒక ఆయుధంగా వాడుతున్నారు. 2022-23 హిజాబ్ వ్యతిరేక నిరసనల నేపథ్యంలో సమాజంలో ఒక భయాన్ని సృష్టించాలని చూస్తున్నారు.

ఇరాన్‌లో మరణశిక్షలను నిశితంగా పరిశీలిస్తున్న నార్వేకు చెందిన ఇరాన్ హ్యూమన్ రైట్స్ (ఐహెచ్‌ఆర్) సోమవారం ఒక నివేదికలో 2024లో కనీసం 31 మంది మహిళలకు మరణశిక్ష విధించినట్లు తెలిపింది. జీవించే ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా ఇలా ఉరితీయం ఆమోదయోగ్యం కాదని హక్కుల సంస్థలు చెబుతున్నాయి.

Show comments