NTV Telugu Site icon

Israel-Hezbollah: ఇజ్రాయెల్‌పై హిజ్బుల్లా మెరుపుదాడి.. 90 రాకెట్లు ప్రయోగం

Israelhezbollah

Israelhezbollah

అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికైన తర్వాత హిజ్బుల్లా తొలిసారి రెచ్చిపోయింది. ట్రంప్ ఎన్నిక తర్వాత దాడులు తగ్గుతాయని అంతా భావించారు. కానీ అందుకు రివర్స్‌గా జరుగుతుంది. లెబనాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ హిజ్బుల్లా సోమవారం విరుచుకుపడింది. ఇజ్రాయెల్‌పై మెరుపుదాడికి దిగింది. ఏకంగా ఒకేసారి 90 క్షిపణులను ప్రయోగించింది. అయితే ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ చాలా రాకెట్లను అడ్డగించింది. అయితే కొన్ని హైఫా బేను తాకినట్లు ఇజ్రాయెల్ తెలిపింది. తాజా దాడిలో చిన్నారి సహా నలుగురు వ్యక్తులు గాయపడినట్లుగా ఐడీఎఫ్ తెలిపింది.

హైఫా బేలో చాలా కార్లు అగ్నికి ఆహుతియ్యాయి. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. లెబనాన్‌లో పేజర్ల పేలుడికి వెనుక టెల్ అవీస్ హస్తముందని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ప్రకటించిన తర్వాత ఈ మెరుపుదాడి జరగడం విశేషం. పేజర్ల దాడిలో 39 మంది చనిపోగా.. వందిలాది మంది గాయపడ్డారు. ఇక పేజర్ల దాడి తర్వాత హిజ్బుల్లా చీఫ్ నస్రల్లా కూడా చనిపోయాడు.

తొలుత 80 రాకెట్లు దూసుకొచ్చాయని.. వాటిలో అధిక సంఖ్యలో రాకెట్లను ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థ దీటుగా ఎదుర్కొందని ఇజ్రాయెల్‌ రక్షణ దళం వెల్లడించింది. వీటిలో కొన్ని మాత్రం నగరంలో పలుచోట్ల పడినట్లు తెలిపింది. రెండో దఫా 10 రాకెట్లు దూసుకురాగా.. వాటన్నింటినీ అడ్డుకున్నట్లు పేర్కొంది. అయితే హైఫా నగరంపై ఈస్థాయి దాడి జరగడం ఇది రెండోసారి. అక్టోబర్‌ 8న కూడా రెండు దఫాల్లో దాడులు జరగ్గా.. దాదాపు 100 రాకెట్లను హిజ్బుల్లా ప్రయోగించింది.