Osama bin Laden: ఇజ్రాయిల్-హమాస్ యుద్ధం నేపథ్యంలో ప్రస్తుతం అమెరికాలో ఆల్ ఖైదా ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్ రాసిన లేఖ వైరల్ అవుతోంది. అమెరికాలో 2001లో 9/11 దాడులకు బిన్ లాడెన్ పాల్పడ్డాడు. వరల్డ్ ట్రేడ్ సెంటర్‌పై విమానాలతో దాడి చేసిన ఉగ్రఘటనలో మాస్టర్ మైండ్ ఒసామా బిన్ లాడెన్‌దే. ఆ సమయంలో అమెరికన్లను ఉద్దేశించి రాసిని లేఖ ఇప్పుడు ఆ దేశంలో టిక్ టాక్‌లో నెటిజన్లు వైరల్ చేస్తున్నారు. ఈ ఘటన జరిగిన 21 ఏళ్ల తరువాత ఒసామా బిన్ లాడెన్‌ని అమెరికన్లు ఈ లేఖ ద్వారా మరోసారి గుర్తు చేసుకుంటున్నారు.
ఒసామాకు సంబంధించి లేఖను వీడియోల రూపంలో వేలాది మంది టిక్ టాక్ వినియోగదారులు షేర్ చేసుకుంటున్నారు. ‘TikTok PsyOp సునామీ’గా అక్కడి ప్రజలు దీన్ని పిలుస్తున్నారు. ఈ లేఖలో బిన్ లాడెన్ పాలస్తీనా పరిస్థితిని గురించి మాట్లాడాడు. ఇజ్రాయిల్-హమాస్ యుద్ధం జరుగుతున్న ఈ సమయంలో ఈ లేఖకు ప్రాధాన్యత ఏర్పడింది.
Read Also: Rashmika Deep Fake Video: రష్మిక డీప్ ఫేక్ వీడియో.. మాజీ ప్రియుడు రక్షిత్ శెట్టి ఏమన్నాడంటే.. ?
9/11 దాడుల్ని సమర్థిస్తూ.. ‘‘మా పాలస్తీనాను ఆక్రమించి అణిచివేతకు పాల్పడుతున్న ఇజ్రయిల్‌కి అమెరికా మద్దతు ఇస్తుంది’’ అని లేఖలో ఆరోపించాడు. ‘‘పాలస్తీనా దశాబ్ధాలుగా ఆక్రమణలో ఉంది, సెప్టెంబర్ 11 తర్వాత మీ అధ్యక్షులు ఎవరూ కూడా దీని గురించి మాట్లాడలేదు. పాలస్తీనా బందీగా కనిపించదు, దాని సంకెళ్లు విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నిస్తాము. అమెరికా క్రైస్తవుల రక్తంతో దాని దురహంకారానికి మూల్యం చెల్లించుకుంటుంది’’ అని అమెరికన్లకు ఒసామా బిన్ లాడెన్ లేఖ రాశాడు.
మే 2011లో పాకిస్తాన్ లోని అబోట్టాబాద్‌లోని ఒక భవనంలో ఒసామా బిన్ లాడెన్‌ని అమెరికా నేవీ సీల్స్ ప్రత్యేక ఆపరేషన్ ద్వారా హతమార్చాయి. గార్డియన్ పత్రిక 2002 నుంచి ఒసామా బిన్ లాడెన్ లేఖను తన వెబ్‌సైట్ లో ఉందచింది. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ కావడంతో లేఖను తీసేసింది. ప్రస్తుతం ఇజ్రాయిల్-పాలస్తీనా సంక్షోభం నేపథ్యంలో ఈ లేఖ వైరల్ కావడం విశేషం.
అక్టోబర్7న గాజాలోని హమాస్ తీవ్రవాదులు ఇజ్రాయిల్ పై దాడులు చేసి 1400 మందిని హతమార్చడమే కాకుండా 240 మందిని బందీలుగా గాజాలోకి పట్టుకెళ్లారు. అప్పటి నుంచి ఇజ్రాయిల్ గాజా స్ట్రిప్ పై దాడులు చేస్తోంది. తాజాగా గాజాపై పట్టుసాధించే ప్రయత్నంలో ఉంది. ఈ యుద్ధంలో ఇజ్రాయిల్ దాడుల్లో 11 వేల మంది పాలస్తీనియన్లు మరణించారు.