Israel Iran: ఇజ్రాయిల్- ఇరాన్ యుద్ధం ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తుందో అని ప్రపంచం భయపడుతోంది. శుక్రవారం నుంచి ఇరు దేశాల మధ్య తీవ్రస్థాయిలో వైమానిక దాడులు జరుగుతున్నాయి. ఈ దాడులు ఐదో రోజుకు చేరుకున్నాయి. ఇరాన్ అణు కార్యక్రమాన్ని టార్గెట్ చేస్తూ ఇజ్రాయిల్ దాడులు చేసింది. ఇరాన్ అణు శాస్త్రవేత్తలతో పాటు ఆ దేశ మిలిటరీ టాప్ జనరల్స్‌ని హతమార్చింది. ప్రతిగా, ఇరాన్, ఇజ్రాయిల్‌లోని టెల్ అవీవ్, జెరూసలెం, హైఫా నగరాలపై వందలాది మిస్సైళ్లతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో ఇరాన్‌లో 200 మందికి పైగా మరణించగా, ఇజ్రాయిల్‌లో 20 మంది మరణించినట్లు తెలుస్తోంది.
ఒకప్పుడు మిత్రులు, ఇప్పుడు శత్రువులు
అయితే, ఈ రెండు దేశాలు ఒకప్పుడు మంచి మిత్రులని చాలా మందికి తెలియదు. 1948లో ఇజ్రాయిల్ ఏర్పడినప్పుడు, చాలా ముస్లిం మెజారిటీ పశ్చిమాసియా దేశాలు ఇజ్రాయిల్‌ని గుర్తించేందుకు నిరాకరించాయి. అయితే, షియా ముస్లిం-మెజారిటీ కలిగిన ఇరాన్‌తో పాటు టర్కీలు ఇజ్రాయిల్‌ని గుర్తించాయి. దీనికి ఒక కారణం ఈ రెండు దేశాలకు అమెరికాతో సంబంధాలు ఉండటం.
ఆ సమయంలో ఇరాన్‌ని షా మొహమ్మద్ రెజా పహ్లావి పాలిస్తుండేవారు. కోల్డ్ వార్ సమయంలో అమెరికాకు ఇరాన్ కీలక మిత్రదేశంగా ఉండేది. ఆ తర్వాత రెండు దశాబ్దాలు మాజీ ఇజ్రాయిల్ ప్రధాని డెవిడ్ బెన్ గురియన్ తన ‘‘పెరిఫెరీ డ్రాక్ట్రిన్’’ ద్వారా అరబ్ యేతర దేశాలతో పొత్తు పెట్టుకునే ప్రయత్నం చేశారు. ఇరాన్, టర్కీ, ఇథియోపియాతో ఇజ్రాయిల్‌కి మంచి సంబంధాలు ఏర్పడ్డాయి. ఒకానొక సమయంలో ఇజ్రాయిల్ గూఢచర్య సంస్థ మొసాద్, ఇరాన్ సావక్ మధ్య ఆయుధాల అమ్మకాలు, నిఘా భాగస్వామ్యం పెంచుకోవాలని భావించాయి. ఇజ్రాయిల్ కు అరబ్ దేశాలతో జరిగిన ‘‘6-డే వార్’’ తర్వాత కూడా ఇరాన్, ఇజ్రాయిల్‌కి చమురు సరఫరా చేసింది. ఇరాన్‌లో వాణిజ్యం, మౌలిక సదుపాయాలకు ఇజ్రాయిల్ మద్దతు ఇచ్చింది.
మిత్రుడు శత్రువుగా మారిన వేళ
అంతా బాగానే ఉన్న సమయంలో 1979లో ఇరాన్‌లో వచ్చిన ‘‘ఇస్లామిక్ విప్లవం’’ తర్వాత ఇజ్రాయిల్‌తో ఇరాన్ సంబంధాల్లో మార్పు వచ్చింది. షా మొహమ్మద్ పదవి కోల్పోయాడు. అయతుల్లా రుహెల్లా ఖమేనీ నేతృత్వంలో ఇస్లామిక్ రిపబ్లిక్ గా ఇరాన్ ఏర్పడింది. ఇరు దేశాల మధ్య ఇస్లామిస్ట్ అంశాలు, పాలస్తీనా కోసం ఇరాన్ వాదించడంతో మిత్రుత్వం, శత్రుత్వంగా మారింది. ఇరాన్ ఇజ్రాయిల్ పాస్‌పోర్టులను అంగీకరించడానికి నిరాకరించింది. ఇజ్రాయిల్‌ని ‘‘ఇస్లాంకు శత్రువు’’, ‘‘చిన్న సైతాన్’’గా ఇరాన్ అభివర్ణించింది.
దీనికి తోడు ఇరాన్ తన ప్రాక్సీలుగా పాలస్తీనాలో హమాస్, లెబనాన్‌లో హిజ్బుల్లా, యెమెన్‌లో హౌతీలను పెంచిపోషించింది. 1983లో హిజ్బుల్లా లెబనాన్‌లోని ఇజ్రాయిల్ మిలిటరీ ప్రధాన కార్యాలయం ముందు ఆత్మాహుతి దాడి చేసింది. ఈ దాడి ఇజ్రాయిల్, వెస్ట్రన్ దేశాలు లెబనాన్ విడిచివెళ్లాలా చేసింది.
డిసెంబర్ 2020లో ఇప్పటి ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ ఇజ్రాయిల్‌ని ‘‘క్యాన్సర్ కణితి’’గా అభివర్ణించి, తొలగించాలని పిలుపునిచ్చాడు. 2023లో ఇజ్రాయిల్‌పై హమాస్ దాడితో ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు మొదలయ్యాయి. అయితే, హమాస్ వెనక ఇరాన్ ఉండి దాడి చేయించిందని ఇజ్రాయిల్ ప్రధాన ఆరోపణ. దీనికి తోడు, ఇరాన్ అణు అస్త్రాలకు మరికొంత దూరంలోనే ఉందనే నిఘా సమాచారం తర్వాత ఇజ్రాయిల్ ఇరాన్‌పై విరుచుకుపడుతోంది. ఏ అరబ్ దేశం వద్ద అణ్వాయుధాలు ఉండవద్దనేది ఇజ్రాయిల్ పాలసీ. ఇది తమ అస్తిత్వానికి ముప్పు తీసుకువస్తుందని భావిస్తోంది.
