Nvidia: అమెరికన్ చిప్ దిగ్గజం ఎన్విడియా కీలక నిర్ణయం తీసుకుంది. జెన్సన్ హువాంగ్ తిరిగి సీఈఓగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మలేషియా, థాయ్‌లాండ్, ఇండోనేషియా, సింగపూర్ నాలుగు ఆగ్నేయాసియా దేశాలకు సర్వర్ల సరఫరాను నిలిపేస్తున్నట్లు తెలిసింది. ఈ దేశాలకు సర్వర్లు పంపించొద్దని తమ తయారీ భాగస్వాములైన డెల్ (Dell), సూపర్‌మైక్రో (Supermicro) సంస్థలను ఎన్విడియా ఆదేశించినట్లు తెలుస్తోంది. అయితే, ఈ నిషేధం ఎన్ని రోజులు ఉంటుంది.? తాత్కాలికంగా అమలు చేస్తారా.? శాశ్వతంగా నిలిపేస్తారా? అనే దానిపై ఇంకా స్పష్టత లేదు. ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగానికి అవసరమైన అధునాతన చిప్‌లను తయారు చేసే సంస్థల్లో ఎన్విడియా అగ్రస్థానంలో ఉంది.
చైనాకు AI చిప్‌లు చేరకుండా అమెరికా ఆంక్షలు
చైనాకు అత్యాధునిక AI కంప్యూటింగ్ సామర్థ్యాలు అందకుండా అమెరికా ప్రభుత్వం ఎగుమతి నియంత్రణలను కఠినతరం చేస్తోంది. చైనా చేతికి అధునాతన చిప్‌లు, ఏఐ సాంకేతికత దక్కకుండా అడ్డుకోవడమే ఈ ఆంక్షల ప్రధాన ఉద్దేశం. ఈ నేపథ్యంలోనే ఆగ్నేయాసియాలోని నాలుగు దేశాలకు సర్వర్ల సరఫరా నిలిపివేయాలని ఎన్విడియా నిర్ణయించినట్లు తెలుస్తోంది.
అలిస్ హువాంగ్ వ్యవహారంతో యూఎస్ అప్రమత్తం..
ఎన్విడియా చీఫ్ జెన్సన్ హువాంగ్‌తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలు ఎదుర్కొంటున్న అలిస్ హువాంగ్ వ్యవహారంతో అమెరికా కఠిన చర్యలు తీసుకుంటోంది. అలిస్ చైనా తరుఫున గూఢచర్యం చేసినట్లు యూఎస్ అధికారులు అనుమానిస్తున్నారు. సింగపూర్ కేంద్రంగా పనిచేస్తున్న మెగాస్పీడ్ కంపెనీలో అలిస్ కీలక పదవిలో ఉంది. ఈ కంపెనీకి ఎన్విడియా చిప్‌లు సరఫరా చేసింది. అయితే, ఈ చిప్‌లను అలిస్ చైనాకు తరలించారనే ఆరోపణలు ఉన్నాయి. దీని కోసమే ఆమె జెన్సన్ హువాంగ్‌తో సన్నిహితంగా ఉన్నట్లు అనుమానిస్తున్నారు.

