Kim Jong Un: ఉత్తర కొరియా ఇటీవల తన మొదటి సైనిక నిఘా శాటిలైట్‌ని విజయవంతంగా అంతరిక్షంలో ప్రవేశపెట్టింది. దీనికి ముందు రెండుసార్లు ఇలాగే ప్రయోగాలు చేయగా.. విఫలమైంది. అయితే ఉత్తర కొరియా చర్యలను దక్షిణ కొరియా, జపాన్, అమెరికా తప్పపట్టింది. అయితే కిమ్ పంపిన ఉపగ్రహ కార్యకలాపాలకు అంతరాయం కలిగించే సామర్థ్యం అమెరికాకు ఉందని ఆ దేశ అంతరిక్ష అధికారి ఇటీవల వ్యాఖ్యానించారు.
Read Also: Ambati Rambabu: నీటి పంపకాల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదు.. అంబటి రాంబాబు కీలక వ్యాఖ్యలు
అయితే, ఈ హెచ్చరికల్ని ఉత్తరకొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ తీవ్రంగా పరిగణిస్తున్నారు. తమ శాటిలైట్ పనికి అడ్డువస్తే దాన్ని యుద్ధంగానే పరిగణిస్తామని, ఎలాంటి దాడి చేసినా, అమెరికా నిఘా శాటిలైట్లను ధ్వంసం చేస్తామని కిమ్ వార్నింగ్ ఇచ్చారు. తమ జోలికి వస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. గత వారం ఉత్తర కొరియా ఈ నిఘా శాటిలైట్ ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించింది. స్వయంగా కిమ్ ఈ ప్రయోగాన్ని దగ్గరుండి వీక్షించారు. అయితే దీనికి కావాల్సిన టెక్నాలజీని రష్యా అందించిందనే వాదనలు ఉన్నాయి. ఇటీవల కిమ్ రష్యా పర్యటనకు వెళ్లారు. ఆ పర్యటనలో రష్యాకు ఆయుధాలు ఇచ్చేందుకు ఉత్తరకొరియా ఒప్పుకుంది, దీనికి బదులుగా శాటిలైట్ టెక్నాలజీని రష్యా అందించినట్లు తెలుస్తోంది.
ఇటీవల కాలంలో నార్త్ కొరియా తన బాలిస్టిక్ మిస్సైల్ ప్రయోగాలను పెంచింది. దీంతో కొరియా ద్వీపకల్ప ప్రాంతంలో ఉద్రిక్తతలు తలెత్తుతున్నాయి. జపాన్ కూడా కిమ్ చర్యల్ని ఖండిస్తోంది. మరోవైపు నిఘా శాటిలైట్ ప్రయోగంతో తాను శత్రువులుగా భావించే దక్షిణ కొరియాలోని పలు ప్రాంతాలతో పాటు అమెరికాలోని వైట్ హౌజ్, పెంటగాన్ వంటి వాటిని చిత్రీకరించామని ఉత్తరకొరియా చెబుతోంది. ఈ ఉపగ్రహం వల్ల భవిష్యత్తులో ఉత్తర కొరియా తన యుద్ధతంత్రాలకు టెక్నాలజీని కూడా జోడించినట్లైంది.