No Point In Economic Reforms When We Dont Have Economy Says Landan President: ఆహార, ఆర్థిక సంక్షోభాలతో శ్రీలంక ఎలా అస్తవ్యస్తమైందో అందరికీ తెలుసు. ధరలు ఒక్కసారిగా ఆకాశాన్నంటడంతో.. జనాలు రోడ్లు మీదకి వచ్చి, రాజకీయ నాయకులపై తిరుగుబాటు చేశారు. ఈ దెబ్బకు అక్కడ రాజకీయ అస్థిరత ఏర్పడింది. మే నెలలో అప్పటి దేశ అధ్యక్షడు రాజపక్స దేశం విడిచి పారిపోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఆ తర్వాత రణిల్ విక్రమసింఘే అధ్యక్షుడిగా బాధ్యలు చేపట్టినా.. పరిస్థితులు వెంటనే చక్కదిద్దుకోలేదు. అయితే.. ఇటీవలే రాజకీయ సుస్థిరత నెలకొంది. కానీ.. దేశ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. దీంతో ఆ దేశంలో ఆర్థిక సంస్కరణలు చేపట్టాలనే వాదన మొదలైంది.
ఈ నేపథ్యంలోనే అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే షాకింగ్ కామెంట్స్ చేశారు. దేశంలో ఆర్థిక వ్యవస్థే లేనప్పుడు.. సంస్కరణలతో ఏం ప్రయోజనమని బాంబ్ పేల్చారు. దాని బదులు నూతన ఆర్థిక వ్యవస్థను తయారు చేస్తామని పేర్కొన్నారు. శ్రీలంక ఆర్థిక సదస్సు 2022లో ఆయన మాట్లాడుతూ.. కాలం చెల్లిన ప్రస్తుత ఆర్థిక విధానాలతో ఆర్థిక వ్యవస్థను సరిదిద్దడం ఏమాత్రం సాధ్యం కాదన్నారు. దేశ ఆర్థిక పరిస్థితులు మరింత క్షీణించాయన్న ఆయన.. ప్రస్తుత పరిస్థితులకు ఆర్థిక సంస్కరణలు చేయడం విరుగుడు కాదని తేల్చి చెప్పారు. సంస్కరణలు చేపట్టినా ప్రయోజనం ఉండదని.. బలహీనమైన ప్రస్తుత విధానాలతో ముందుకెళ్తే, అవి మళ్లీ దెబ్బతీస్తాయని పేర్కొన్నారు. అందుకే.. కొత్త ఆర్థిక వ్యవస్థకు రూపకల్పన చేస్తామన్నారు. ఇందుకోసం.. భాగస్వామ్య పక్షాలతో సంప్రదింపులు జరుపుతున్నామని ఆయన అన్నారు.
కాగా.. స్వాతంత్ర తర్వాత శ్రీలంక ఎన్నడూ లేనంత ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఈ తరుణంలోనే ఆ దేశాన్ని విదేశీ మారక నిల్వల కొరత వేధిస్తోంది. ఈ దెబ్బకు దివాలా అంచుకు చేరిన ఆ దేశం.. అంతర్జాతీయ రుణాలను చెల్లించలేమని ఏప్రిల్‌లో చేతులెత్తేసింది. అది నిత్యవసర వస్తువుల దిగుమతులపై తీవ్ర ప్రభావం చూపడంతో.. శ్రీలంక పౌరులకు ఇంధనం, ఔషధాలు, ఎరువుల కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది.
