Site icon NTV Telugu

Venezuela: నికోలస్ మదురో.. డెల్సీ రోడ్రిగ్జ్ ఇద్దరూ సాయిబాబా భక్తులే.. ఫొటోలు వైరల్

Nicolas Maduro5

Nicolas Maduro5

వెనిజులాపై అమెరికా సైన్యం దాడి తర్వాత ఎక్కువగా మార్మోగుతున్న పేరు నికోలస్ మదురో. శనివారం తెల్లవారుజామున అధ్యక్ష భవనంపై యూఎస్ దళాలు మెరుపు దాడి చేసి అధ్యక్షుడు నికోలస్ మదురో.. అతని భార్య సిలియా ఫ్లోర్స్‌‌ను కిడ్నాప్ చేసి అమెరికాకు తరలించారు. అనంతరం వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలిగా డెల్సీ రోడ్రిగ్జ్ పదవీ బాధ్యతలు చేపట్టారు.

తాజాగా నికోలస్ మదురో భారతదేశం పర్యటనకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నికోలస్ మదురో.. భార్య సిలియా ఫ్లోర్స్‌, తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్స్ ముగ్గురూ కూడా పుట్టపర్తి సత్యసాయి బాబా భక్తులుగా తెలుస్తోంది. యువకుడిగా ఉన్న సమయంలో పలుమార్లు నికోలస్ మదురో పుట్టపర్తి వచ్చారు. సాయిబాబాతో అత్యంత సన్నిహితంగా మెలిగిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. అలాగే తాత్కాలిక అధ్యక్షురాలిగా ఉన్న డెల్సీ రోడ్రిగ్స్ కూడా ఇప్పటికే పలుమార్లు పుట్టపర్తిని సందర్శించారు. ఈమె కూడా సాయిబాబాను ఎంతగానో ఇష్టపడుతుంటారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

వాస్తవానికి నికోలస్ మదురో కేథలిక్ వాతావరణంలో పెరిగారు. అయితే సిలియా ఫ్లోర్స్‌ను మదురో వివాహం చేసుకోకముందు పుట్టపర్తి సత్యసాయి బాబాను పరిచయం చేశారు. ‌దీంతో సాయిబాబా భక్తుడిగా మారిపోయారు. 2005లో సాయిబాబాను కలిసేందుకు సిలియా ఫ్లోర్స్‌తో కలిసి మదురో పుట్టపర్తి వచ్చారు. ఏపీలోని పుట్టపర్తి ప్రశాంతి నిలయం ఆశ్రమాన్ని సందర్శించి గడిపారు. ఆ సమయంలో నికోలస్ మదురో చాలా యువకుడిగా ఉన్నారు. ఫ్లోర్‌పై కింద కూర్చుని సాయిబాబా పాదాల దగ్గర కూర్చున్నారు.

ఇక నికోలస్ మదురో అధికారంలోకి వచ్చాక. మిరాఫ్లోర్స్ ప్యాలెస్‌లోని ప్రైవేటు కార్యాలయం గోడలపై సైమన్ బొలివర్, హ్యూగో చావెజ్‌లతో పాటు సాయిబాబా చిత్ర పటాలు కూడా ఉన్నాయి. ప్రముఖంగా గోడలపై ఇప్పటికీ సాయిబాబా ఫొటోలనే ఉంటాయని నివేదికలు చెబుతున్నాయి.

ఇక 2011లో సాయిబాబా మరణించిన తర్వాత వెనిజులా విదేశాంగ మంత్రిగా ఉన్న మదురో.. సభలో సాయిబాబాకు అధికారికంగా సంతాప తీర్మానం ప్రవేశపెట్టాలని తీవ్ర ఒత్తిడి చేశారు. మదురో ఆధ్వర్యంలో వెనిజులా జాతీయ అసెంబ్లీలో అధికారికంగా సాయిబాబాకు సంతాప తీర్మానాన్ని ఆమోదించింది. అధికారికంగా గుర్తించడానికి జాతీయ సంతాప దినాన్ని కూడా ప్రకటించింది. అంతేకాదు.. ఇప్పటికీ వెనిజులాలో అనేక మంది సాయిబాబా భక్తులు ఉండడం విశేషం. ఇంకో విశేషం ఏంటంటే.. 2024లో వెనిజులా ప్రభుత్వం జాతీయ దినోత్సవ వేడుకలకు ‘‘ఓం’’ చిహ్నాన్ని ముద్రించి ఆహ్వానాలు పలికారు. అంతేకాదు.. సాయిబాబా శతజయంతిని పురస్కరించుకుని రాజకీయ సందేశాలు పంపుతూ ఒక ప్రకటనలో ‘‘సాయిబాబా వెలుగు జీవి’’ గా అభివర్ణించారు.

Exit mobile version