అగ్ర రాజ్యం అమెరికా రాజకీయాల్లో సంచలనంగా మారిన ‘ఎప్‌స్టీన్ ఫైల్స్’ నుంచి మరిన్ని ఫొటోలు బయటకు వచ్చాయి. ఎప్‌స్టీన్ ఫైల్స్‌ను బహిర్గతం చేయాలని న్యాయశాఖను ఆదేశించే బిల్లుపై ఇటీవలే సంతకం చేసినట్లు ట్రంప్ ప్రకటించారు. కానీ ఇంతలోనే హౌస్ డెమొక్రాట్లు జెఫ్రీ జెఫ్రీ ఎప్‌స్టీన్ ఎస్టేట్ నుంచి 68 ఫొటోలను విడుదల చేశారు. ఈ ఫొటోల్లో అత్యంత పేరుగాంచిన ప్రముఖులు ఉండడం విశేషం. ఫొటోల్లో హై ప్రొఫైల్ వివరాలు, పాస్‌పోర్టులు, పత్రాలు ఉన్నాయి. ఇక శుక్రవారం నాటికి పూర్తి ఫైల్స్‌ను న్యాయశాఖ విడుదల చేయనుంది.
గురువారం యూఎస్ హౌస్ డెమొక్రాట్లు జెఫ్రీ ఎప్‌స్టీన్ ఎస్టేట్ నుంచి 68 ఫొటోలు విడుదల చేశారు. ఇందులో ఎక్కువగా కొత్త ముఖాలు కనిపించాయి. తాజా ఫొటోల విడుదలతో న్యాయశాఖపై మరింత ఒత్తిడి పెరిగింది. ఇక తాజా ఫొటల్లో హై-ప్రొఫైల్ వ్యక్తులు ఉన్నారు. ముఖ్యంగా బిల్ గేట్స్, నోమ్ చోమ్స్కీ, స్టీవ్ బానన్, వుడీ అల్లెన్‌లు కనిపించారు. కొన్ని చిత్రాల్లో అస్పష్టమైన ముఖం కలిగిన ఒక మహిళ పక్కన బిల్స్ గేట్స్ నిలబడి ఉన్నారు.
పత్రాలు, వ్యక్తిగత రికార్డులు:
తాజా చిత్రాల్లో అనేక పత్రాలు, రికార్డులు కనిపించాయి. రష్యా, ఉక్రెయిన్, లిథువేనియా, దక్షిణాఫ్రికా, చెక్ రిపబ్లిక్ వంటి దేశాల నుంచి పాస్‌పోర్ట్‌లు, వీసాలు, గుర్తింపు కార్డులు, సున్నితమైన వివరాలు కనిపించాయి. ఇక అనేక పత్రాల్లో ‘స్త్రీ’ అని రాయబడి ఉంది.
ఇతర అంశాలు
‘‘యువతులకు సంబంధించిన టెక్ట్స్ సందేశాల స్క్రీన్‌షాట్‌లు కనిపించాయి. ఒక స్నేహితురాలు కొంత మంది అమ్మాయిలను పంపించింది. ఒక్కొక్క అమ్మాయి నగదు అడుగుతోంది.’’ అని రాసి ఉంది.
అయితే ఫోటోల్లో కనిపించినంతమాత్రాన తప్పు చేసినట్లు అర్థం కాదని హౌస్ డెమొక్రాట్లు తెలిపారు. ఎప్‌స్టీన్‌తో కలిసి నేరం చేసినట్లు కాదని పేర్కొన్నారు. ఇక బాధితుల గోప్యతను కాపాడటానికి పర్యవేక్షణ కమిటీ జాగ్రత్తలు పాటించింది. మహిళలు, బాలికల ముఖాలను దాచిపెట్టారు. బాధితులను కాపాడుతూ.. ప్రజలకు పారదర్శకతను అందించడానికే ఫొటోలు విడుదల చేసినట్లుగా హౌస్ డెమొక్రాట్లు పేర్కొన్నారు.
జులై 2019లో ఎప్‌స్టీన్‌పై సెక్స్ ట్రాఫికింగ్ అభియోగాలు మోపారు. అయితే అతను విచారణకు రాకముందే మాన్‌హాటన్ జైలు గదిలో ఆత్మహత్య చేసుకుని మరణించాడు.
