NTV Telugu Site icon

Mpox: “ఎంపాక్స్ వైరస్” ముంచుకొచ్చే ప్రమాదం.. శాస్త్రవేత్తల హెచ్చరిక..

Mpox

Mpox

Mpox: ఆఫ్రికా దేశం డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ‘‘ఎంపాక్స్(మంకీ పాక్స్)’’ వ్యాప్తి కలవరపెడుతోంది. ప్రజల మధ్య తేలికగా వ్యాపించే ఈ వ్యాధి అనేక గర్భస్రావాలకు, పిల్లల మరణాలకు కారణమవుతోంది. అయితే, ఈ వ్యాధి ఇప్పటికే ఇరుగుపొరుగు దేశాలకు వ్యాపించే అవకాశం ఉందని పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎంపాక్స్ కొత్త వేరియంట్ ఇతర ప్రాంతాలకు వ్యాపించకముందే అన్ని దేశాలు సిద్ధంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.

2022లో 110 కంటే ఎక్కువ దేశాల్లో మంకీపాక్స్ వ్యాధి వ్యాపించింది. ముఖ్యంగా స్వలింగ, ద్విలింగ సంపర్కుల్లో ఈ వ్యాధి బయటపడింది. ఇది ఎంపాక్స్ క్లాడ్ 2 స్ట్రెయిన్ ఈ వ్యాప్తికి కారణమైంది. ఇదిలా ఉంటే 1970లో కాంగోలో మొదటిసారిగా గుర్తించినప్పటి నుంచి క్లాడ్ 1 స్ట్రెయిన్ క్రమంగా వ్యాప్తి చెందుతోందని, ఇది ప్రాణాంతకమని రువాండా విశ్వవిద్యాలయంలో పరిశోధకుడు జీన్ క్లాడ్ ఉదాహెముకా చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా లైంగికంగా ఈ వ్యాధి సంక్రమించినప్పటికీ, ఆఫ్రికాలో మాత్రం సాధారణంగా బుష్‌మీట్ తినడం వల్ల క్లాడ్ 1 వస్తోంది.

Read Also: Teacher Transfers: తెలంగాణలో 18, 942 ఉపాధ్యాయులకు ప్రమోషన్లు..!

కాంగోలోని కమిటుగాలో సెక్స్ వర్కర్లలో ఈ ఎంపాక్స్ వ్యాప్తి ఉంది. ఇది స్త్రీ,పురుషుల మధ్య లింగభేదం లేకుండా సెక్స్ ద్వారా వ్యాప్తి చెందుతోంది. పరీక్షల్లో ఇది క్లాడ్ Ib అని పిలువబడే అసలైన జాతి యొక్క పరివర్తన చెందిన రూపాంతరం అని వెల్లడైంది. ఇప్పటి వరకు ఉన్న దాంట్లో ఇదే ప్రమాదకరమైన రూపాంతరంగా పరిశోధకలు చెబుతున్నారు. దక్షిణ కివు ప్రావిన్స్‌లో 1000 కంటే ఎక్కువ మందికి క్లాడ్ ఐబీ కేసులు నమోదయ్యాయి. ఒక్క కమిటుగా పట్టణంలోనే ప్రతీ వారం 20 కొత్త కేసులు నమోదు అవుతున్నాయి.

5 శాతం పెద్దలు, 10 శాతం పిల్లల్లో ఈ స్ట్రెయిన్ బారిన పడుతున్నారని పరిశోధకులు చెబుతున్నారు. దీని వల్ల శరీరంపై భయకరంగా పెద్ద మొత్తంలో శరీరంపై దద్దుర్లు వస్తున్నాయి. ఈ ఐబీ స్ట్రెయిన్ గర్భస్రావాలకు కారణమవుతోందని, సంతానోత్పత్తిపై దీర్ఘకాలిక ప్రభావాన్ని పరిశోధకులు అధ్యయనం చేస్తున్నారు. ఈ ఏడాది కాంగోలో ఎంపాక్స్ వల్ల మరణించిన 384 మందిలో 60 శాతం కన్నా ఎక్కువ పిల్లలే ఉన్నారు.