Earth Water: ఈ విశ్వంలో దేవుడు సృష్టికి అద్భుత సాక్ష్యం మనం నివసిస్తున్న ‘‘భూగ్రహం’’. అత్యంత పక్కాగా ఒక నక్షత్రం నుంచి ఎంత దూరంలో ఉంటే జీవజాలం మనుగడ సాధ్యం అవుతుందో అలాంటి ‘‘గోల్డెన్ లాక్ జోన్’’లో భూమి ఉంది. అయితే, మొదట జీవం సముద్రాల్లో పుట్టిందని అనేక థియరీలు చెబుతాయి. ఇలాంటి సముద్రాల్లోకి నీరు ఎలా వచ్చిందనేది ఇప్పటికీ చాలా మందిని వేధిస్తున్న ప్రశ్న. దీనికి నాసా అధ్యయనం సమాధానం ఇస్తోంది. భూమిపై ఉన్న నీటిలో ఎక్కువ భాగం గ్రహం ఏర్పడినప్పుడే ఉన్న మూల పదార్థాల నుంచి వచ్చిందని నాసా నిర్వహించిన తాజా అధ్యయనం వెల్లడించింది. 4 బిలియన్ ఏళ్లలో ఉల్కలు భూమికి తీసుకువచ్చిన నీటి పరిమాణం చాలా తక్కువ అని ఈ పరిశోధన వెల్లడించింది.
Read Also: Gen Z: కార్పొరేట్ ఇండియాకు యువత మాస్ వార్నింగ్.. 23వేల మంది చెప్పిన నమ్మలేని నిజం!
అపోలో మిషన్ల సమయంలో చంద్రుడి నుంచి సేకరించిన మట్టి నమూనాలను విశ్లేషిస్తూ, ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. దీని ఫలితాలు ప్రొసీడింగ్స్ ఆఫ్ ద నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ (PNAS) జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. ఈ అధ్యయనానికి నాసా జాన్సన్ స్పేస్ సెంటర్‌కు చెందిన సైంటిస్ట్ టోనీ గార్గానో నేతృత్వం వహించారు. చంద్రుడి మట్టిలో కనీసం 1 శాతం వరకు కార్బన్ అధికంగా ఉన్న ఉల్కల పదార్థం ఉన్నట్లు తేలింది. ఈ ఉల్కలు చంద్రుడిని ఢీకొన్నప్పుడు కొంత వరకు ఆవిరైపోయాయని పరిశోధకులు గుర్తించారు. భూమి మీద ఉల్కల ప్రభావం చంద్రుడితో పోలిస్తే సుమారు 20 రెట్లు ఎక్కువగా ఉండటాన్ని పరిగణలోకి తీసుకున్నా, ఉల్కల ద్వారా భూమికి చేరిన నీటి పరిమాణం చాలా స్వల్పమేనని ఈ అధ్యయనం తేల్చింది.
ఈ పరిశోధనలో శాస్త్రవేత్తలు ట్రిపుల్ ఆక్సిజన్ ఐసోటోప్స్ అనే పద్ధతిని ఉపయోగించారు. ఉల్కలు ఢీకొన్న సమయంలో తీవ్రమైన వేడి, ఆవిరీకరణ జరిగినా, ఆక్సిజన్ ఐసోటోప్స్ మారకుండా ఉండటం వల్ల, అవి ఉల్కల నుంచి వచ్చిన పదార్థాన్ని గుర్తించడానికి కీలక ఆధారంగా పనిచేస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. బిలియన్ ఏళ్లుగా భూమి పరిసర ప్రాంతంలో ఏ రకమైన ఉల్కలు పడ్డాయనే ఆధారాలను చంద్రుడి మట్టే అందిస్తుందని, భూమిపై భూగర్భ కదలికలు, వాతావరణ ప్రభావం ఈ చరిత్రను చెరిపేస్తాయని శాస్త్రవేత్తలు చెప్పారు. చంద్రుడి ధ్రువాల వద్ద నీరు ఉందని ఇప్పటికే గుర్తించారు. ఇది నాసా నిర్వహిస్తున్న ఆర్టెమిస్ మిషన్లకు కీలకం అవుతుంది. ఈ అధ్యయనం 50 ఏళ్ల క్రితం చంద్రుడిపై నుంచి అపోలో మిషన్ల ద్వారా తీసుకువచ్చిన మట్టితో చేశారు.
