Site icon NTV Telugu

Benjamin Netanyahu: ప్రపంచంలో ఎక్కడ ఉన్నా హమాస్‌ని విడిచిపెట్టొద్దు.. “మొసాద్‌”కి నెతన్యాహు ఆదేశాలు..

Pm Benjamin Netanyahu

Pm Benjamin Netanyahu

Benjamin Netanyahu: హమాస్ ఉగ్రవాదుల దాడిపై ఇజ్రాయిల్ రగిలిపోతోంది. పటిష్టమైన నిఘా వ్యవస్థ, మొసాద్ వంటి అగ్రశ్రేణి గూఢచార వ్యవస్థ ఉన్నప్పటికీ దాడుల్ని అడ్డుకోలేకపోయాయి. అక్టోబర్ 7న హమాస్ ఉగ్రవాదులు కేవలం 20 నిమిషాల్లోనే గాజా నుంచి 5 వేల రాకెట్లను ఇజ్రాయిల్ పైకి ప్రయోగించారు. హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయిల్ బార్డర్ వద్ద నిఘా వ్యవస్థ కళ్లుగప్పి ఇజ్రాయిల్ పౌరుల్ని హతమార్చారు. ఈ ఊచకోతలో 1200 మంది చనిపోగా.. మరో 240 మందిని హమాస్ బందీలుగా గాజాలోకి తీసుకెళ్లింది.

అప్పటి నుంచి హమాస్ లక్ష్యంగా ఇజ్రాయిల్ గాజాపై భీకరదాడులు చేస్తోంది. ఈ దాడుల్లో ఇప్పటి వరకు 13000 మందికి పైగా పాలస్తీనియన్లు మరణించారు. మరోవైపు ఖతార్ మధ్యవర్తిత్వంతో ఇజ్రాయిల్-హమాస్ మధ్య సంధి ఏర్పడింది. ఇజ్రాయిల్ వద్ద ఉన్న 150 మంది ఖైదీలను విడుదల చేస్తే, హమాస్ తమ చెరలో ఉన్న 50 మంది బందీలను విడుదల చేస్తామని ఒప్పందానికి వచ్చాయి.

Read Also: Jagadeeshwar Goud: మహిళల అభ్యున్నతే కాంగ్రెస్ పార్టీ ధ్యేయం

మరోవైపు ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఆ దేశ గూఢచార సంస్థ మొసాద్‌కి కీలక ఆదేశాలు జారీ చేశారు. గాజా వెలుపల ప్రపంచవ్యాప్తంగా హమాస్ ఉగ్రవాదులు ఎక్కడ ఉన్నా చర్యలు తీసుకోవాలని మొసాద్‌కి సూచించారు. హమాస్ ప్రధాన నాయకత్వం అంతా ప్రస్తుతం ప్రవాసంలో ఉన్నారు. ముఖ్యంగా ఖతార్, లెబనాన్ రాజధాని బీరూట్‌లో వీరు ఉన్నారు.

గతంలో ఇజ్రాయిల్ వ్యతిరేక శక్తుల్ని అనేక దేశాల్లో మొసాద్ హతమార్చింది. ఇరాన్ అణుశాస్త్రవేత్త, ఆ దేశ సైనికాధికారి హత్యల్లో మొసాద్ పాత్ర ఉంది. ఇదిలా ఉంటే సంధి ఒప్పందం గురించి మాట్లాడుతూ.. శుక్రవారం కన్నా ముందుగా బందీలను విడుదల చేయడం జరగదని ఇజ్రాయిల్ జాతీయ భద్రతా సలహాదారు తెలిపారు. సంధి ఒప్పందం ఖరారైనందున, తాత్కాలిక కాల్పుల విరమణ తర్వాత హమాస్‌పై ఇజ్రాయిల్ యుద్ధాన్ని కొనసాగిస్తుందని ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహు, అమెరికా ప్రెసిడెంట్ జోబైడెన్‌కి స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. హమాస్‌ని నాశనం చేసే వరకు యుద్ధాన్ని చేస్తామని నెతన్యాహు చెప్పారు.

Exit mobile version