Nepal: 25 మందిని చంపిన ‘‘కిల్లర్ ఏనుగు’’.. ఒకే కుటుంబంపై రెండుసార్లు దాడి..

  • నేపాల్‌లో మరోసారి బీభత్సం సృష్టించిన కిల్లర్ ఏనుగు.
  • 14 ఏళ్లలో 25 మంది ప్రాణాలు బలిగొన్నట్లు రికార్డులు.
  • ఒకే కుటుంబంపై రెండోసారి దాడి చేసి తల్లి, కుమారుడి మృతి.
  • ప్రభుత్వం చంపేందుకు అనుమతి ఇచ్చినా ఇప్పటికీ దొరకని ఏనుగు.
Chaudhary Elephant Attack

Chaudhary Elephant Attack

Nepal:  నేపాల్‌లో ఒక ఏనుగు 14 ఏళ్లుగా  బీభత్సం సృష్టిస్తోంది. చిత్వాన్ నేషనల్ పార్క్ సమీపంలోని జగత్‌పూర్ ప్రాంతంలో 25 ఏళ్ల మహిళ, ఆమె 4 ఏళ్ల కుమారుడిని తొక్కి చంపింది. దీనిని నేపాల్‌లో అత్యంత ప్రమాదకరమైన ‘‘కిల్లర్ ఏనుగు’’గా అధికారులు పరిగణిస్తారు. ఈ ఏనుగు ఇప్పటి వరకు 25 మందిని చంపింది. దాడి తర్వాత ఈ ఏనుగు అడవిలోకి పారిపోయింది. అటవీ శాఖ ఏనుగును పట్టుకోవడానికి ప్రయత్నిస్తోంది.

2012లో ఇదే కుటుంబానికి చెందిన తల్లిదండ్రుల్ని ఈ ఏనుగు చంపేసింది. ఆ సమయంలో సురక్షితంగా ఉండేందుకు మిగిలిన కుటుంబీకులు ఆ ప్రాంతాన్ని ఖాళీ చేసి వెళ్లిపోయారు. ఇప్పుడు అదే ఏనుగు కుటుంబంలోని మహిళ, ఆమె కుమారుడిని బలి తీసుకుంది. చిత్వాన్ చుట్టుపక్కల అడవులు, గ్రామాలు పక్కపక్కనే ఉండటంతో తరుచుగా ఏనుగులు ఊళ్లపై దాడులు చేస్తుంటాయి.

చిత్వాన్ జాతీయ ఉద్యానవనం రికార్డుల ప్రకారం.. 2010 నుండి ఇప్పటి వరకు కనీసం 25 మంది మరణాలకు ఈ ఏనుగే కారణమని భావిస్తున్నారు. 2012లో, ఇది ఒక్క రోజులోనే 68 ఇళ్లను ధ్వంసం చేసింది. పదేపదే జరుగుతున్న ఈ దాడుల నేపథ్యంలో, ఈ ఏనుగును చంపడానికి నేపాల్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సైన్యం, అటవీ శాఖ ఏనుగు కోసం గాలింపు చేపట్టారు. దాడి తర్వాత ఏనుగు అడవిలోకి పారిపోయింది. ప్రస్తుతం దానిని చంపే లైసెన్స్ గడువు ముగిసింది. ఏనుగును ట్రాక్ చేయడానికి దాని మెడపై ట్రాకింగ్ కాలర్ అమర్చారు.