Nawaz Sharif: పాకిస్తాన్ మాజీ ప్రధాని, ఆ దేశానికి మూడు సార్లు ప్రధానిగా పనిచేసిన నవాజ్ షరీఫ్ స్వదేశానికి తిరిగి వచ్చారు. నాలుగేళ్లుగా యూకేలో అజ్ఞాతవాసంలో ఉన్న నవాజ్ మరోసారి రాజకీయాల్లో యాక్టీవ్ కాబోతున్నారు. గత కొన్ని రోజులుగా దుబాయ్ లో గడిపిన షరీఫ్, ఈ రోజు అక్కడ నుంచి పాక్ రాజధాని ఇస్లామాబాద్ కి చేరుకున్నారు. ఆ తరువాత ఆయన సొంత ప్రాంతం లాహోర్‌కి వెళ్లనున్నారు. అక్కడే ఆయన మద్దతుదారులు ఆయనకు ఘనస్వాగతం పలకనున్నారు. 73 ఏళ్ల పాకిస్తాన్ ముస్లిం లీగ్-నవాజ్ (PML-N) అధినేత కొంతమంది కుటుంబ సభ్యులు, సీనియర్ పార్టీ నాయకులు మరియు స్నేహితులతో కలిసి “ఉమీద్-ఎ-పాకిస్తాన్” అనే చార్టర్డ్ ఫ్లైట్‌లో దుబాయ్ నుండి ఇస్లామాబాద్‌కు వచ్చారు.
Read Also: T Congress: కాంగ్రెస్ పార్టీకి ఫేక్ జాబితాల టెన్షన్.. ఆశావహులు ఆఖరి ప్రయత్నాలు..
నాలుగేళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉన్న పాకిస్తాన్ ముస్లింలీగ్ – నవాజ్(పీఎంఎల్-ఎన్) చీఫ్ నవాజ్ షరీఫ్ మరోసారి రాజకీయ పునరాగమనం చేయబోతున్నారు. గతేడాది ఇమ్రాన్ ఖాన్ ప్రధాని పదవి నుంచి దిగిన తర్వాత, ఆయన స్థానంలో నవాజ్ షరీఫ్ తమ్ముడు షహబాజ్ షరీఫ్ ప్రధాని పదవి చేపట్టారు. వచ్చే ఏడాది జనవరిలో పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్నాయి. ప్రస్తుతం ఆ దేశానికి అపద్ధర్మ ప్రధానిగా అన్వర్ ఉల్ హక్ కాకర్ ఉన్నారు.
తీవ్ర ఆర్థిక సంక్షోభం, రాజకీయ అనిశ్చిత, ఉగ్రవాదం ఇలా అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటున్న పాకిస్తాన్, త్వరలో ఎన్నికలకు వెళ్లబోతోంది. మరోవైపు పలు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న నవాజ్ షరీఫ్‌కి ప్రస్తుతం పాక్ కోర్టులు కూడా అరెస్ట్ నుంచి రక్షణ ఇచ్చాయి. మంగళవారం ఇస్లామాబాద్ హైకోర్టు షరీఫ్ కు రక్షణ బెయిల్ మంజూరు చేసింది. అతను దేశంలో తిరిగి వచ్చిన తర్వాత తక్షణ అరెస్టు నుంచి రక్షణ పొందనున్నారు. మూడు సార్లు ప్రధానిగా పనిచేసిన నవాజ్ షరీఫ్ 2017లో పదవీచ్యుతుడయ్యాడు. అవినీతి ఆరోపణలతో రాజకీయాల నుంచి జీవితకాల అనర్హత ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో ఆయన కీలక పాత్ర పోషించబోతున్నారు.