NTV Telugu Site icon

Europa Clipper Probe: జూపిటర్ వద్దకు బయలుదేరిన “యూరోపా క్లిప్పర్ ప్రోబ్”.. గురుడి చందమామ లక్ష్యం..

Nasa's Europa Clipper

Nasa's Europa Clipper

Europa Clipper Probe: సౌరకుటుంబంలో గ్రహాలకు పెద్దన్న బృహస్పతి(గురు గ్రహం) వద్దకు నాసాకు చెందిన ‘‘యూరోపా క్లిప్పర్ ప్రోబ్’’ ప్రయాణం మొదలైంది. సోమవారం ఫ్లోరిడా నుంచి అంతరిక్ష నౌక బయలుదేరింది. 2.9 బిలియన్ కిలోమీటర్ల దూరంలోని గురుడిని చేరుకోవడానికి అంతరిక్ష నౌక ఏకంగా 5.5 ఏళ్ల పాటు ప్రయాణించనుంది. 2030 నాటికి జూపిటర్ కక్ష్యలోకి చేరుకుంది. నిజానికి ఈ ప్రయోగం గత వారం ప్లాన్ చేసినప్పటికీ.. మిల్టన్ హరికేన్ కారణంగా నిలిపేయబడింది.

గురుడి చందమామ, గురుగ్రహానికి ఉన్న ఉపగ్రహాల్లో నాలుగో అతిపెద్దదైన ‘‘యూరోపా’’ గురించి ఈ అంతరిక్ష నౌక పరిశోధనలు చేయనుంది. భూమి తర్వాత, భూమి కన్నా అధిక నీటిని యూరోపా కలిగి ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. యూరోపాపై ఉన్న మహా సముద్రాలను, దానిలో జీవానికి అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయో లేదో తెలుసుకునేందుకు ఈ మిషన్‌ని నాసా చేపట్టింది.

దాదాపుగా ఈ అంతరిక్ష నౌక 100 అడుగుల (30.5 మీటర్లు) పొడవు మరియు దాదాపు 58 అడుగుల (17.6 మీటర్లు) వెడల్పులు కలిగిన యాంటెన్నాలను కలిగి ఉంది. బాస్కెట్ బాల్ కోర్ట్ కంటే ఇది పెద్దది. సుమారు 6000 కిలోల బరువుతో నాసా నిర్మించిన అతిపెద్ద అంతరిక్ష నౌక ఇది.

Read Also: AP Weather: ఏపీకి ముంచుకొస్తున్న ముప్పు.. రాయలసీమ, దక్షిణ కోస్తాకు హైఅలర్ట్

జూపిటర్‌కి ఉన్న 95 చంద్రులలో నాల్గవ అతిపెద్ద చందమామ యూరోపా. యూరోపా వ్యాసం భూమితో పోలిస్తే నాలుగో వంతు మాత్రమే అయినప్పటికీ, దీని నిండా విస్తారమైన ఉప్పు ద్రవ నీటితో కూడిన మహాసముద్రాలు ఉన్నాయి. భూమి కన్నా రెండు రెట్లు అధికంగా నీరు ఉండే అవకాశం ఉంది. దాదాపుగా 3100 కి.మీ వ్యాసం కలిగిన యూరోపా, మన చంద్రుడిలో 90
శాతం ఉంటుంది. దానిపై మంచు మందం 15-20 కి.మీ ఉంటుందని, 60-150 కి.మీ లోతైన సముద్రం ఉంటుందని అంచనా..

ఈ మిషన్ ద్వారా అంతర్గత సముద్రాలు, దానిపై ఉన్న మంచుని అధ్యయనం చేయనుంది. యూరోపాకి 25 కి.మీ దగ్గర వెళ్లనుంది. యూరోపా క్లిప్పర్ మన సౌర వ్యవస్థ యొక్క అతిపెద్ద గ్రహం అయిన బృహస్పతి చుట్టూ తీవ్రమైన రేడియేషన్ వాతావరణంలో పని చేస్తుంది. గురుడికి భూమి కన్నా 20,000 రెట్ల బలమైన అయస్కాంత క్షేత్రం ఉంది. ఇది అంతరిక్ష నౌకలకి హాని కలిగించే రేడియేషన్‌ని సృష్టిస్తుంది. ఈ రేడియేషన్ నుంచి రక్షించుకోవడానికి యూరోపా క్లిప్పర్ లోపల టైటానియం, అల్యూమినియంతో తయారు చేసిన భాగాలు ఉన్నాయి.

యూరోపా క్లిప్పర్‌లో మొత్తం 2750 కిలోల ఇంధనం ఉంది. ఇది నేరుగా గురుడి వైపు వెళ్లదు. మధ్యలో అంగారకుడి గురుత్వాకర్షణ శక్తిని ఉపయోగించుకుని తన వేగం పెంచుకుని, గురుడి వైపు వెళ్తుంది. దీంట్లో మొత్తం 9 సైంటిఫిక్ పరికరాలు ఉన్నాయి.