NTV Telugu Site icon

Nasa: నాసా ఆర్టెమిస్-1 ప్రయోగం మళ్లీ వాయిదా.. కారణం ఇదే..!!

Nasa Artemis

Nasa Artemis

Nasa Artemis-1: అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా తలపెట్టిన ఆర్టెమిస్-1 ప్రయోగం మరోసారి వాయిదా పడింది. చంద్రుడి మీదకు అత్యంత శక్తిమంతమైన రాకెట్‌‌ను ప్రయోగించాలని నాసా ఈ ప్రయత్నాన్ని తలపెట్టింది. 50 ఏళ్ళ తరువాత మనిషిని చంద్రుడి మీదకు పంపించే ప్రయత్నాలను మళ్ళీ ప్రారంభించిన నాసా ఈ ‘ఆర్టెమిస్ మూన్ రాకెట్’ ప్రయోగంపై ఎంతో ఉత్తేజంగా ఉంది. ఈ ప్రయోగాన్ని గత నెల 29నే చేపట్టాలని భావించగా రాకెట్ ఇంజిన్‌లో ఇంధ‌న లీకేజీ కార‌ణంగా సెప్టెంబర్ 3వ తేదీకి వాయిదా పడింది. శ‌నివారం కూడా గ‌తంలో త‌లెత్తిన స‌మ‌స్యే త‌లెత్తింది. రాకెట్‌లోని ఇంజిన్ నెంబ‌ర్ 3లో ఇంధ‌న లీకేజీ క‌నిపించ‌గా దానిని స‌రిదిద్దే య‌త్నాలు చేసినా ఫ‌లించ‌లేదు. దీంతో వ‌రుస‌గా రెండోసారి ఆర్టెమిస్‌- 1ను వాయిదా వేస్తున్నట్లు నాసా ప్రక‌టించింది. అయితే తిరిగి ఈ ప్రయోగాన్ని ఎప్పుడు చేప‌ట్టేది మాత్రం నాసా వెల్లడించ‌లేదు.

Read Also: Custard Apple : సీతాఫలం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..

చంద్రుడి మీదకు వ్యోమగాములను పంపించడమే ఈ 100 మీటర్ల ఆర్టెమిస్ ఉద్దేశ్యం. 1972లో ప్రాజెక్ట్ అపోలో ముగిసిన తర్వాత ఈ ప్రయత్నం జరగలేదు. ఆర్టెమిస్-1 కేవలం సాంకేతిక ప్రయోగం మాత్రమే. ఈ స్పేస్ క్యాప్సూల్‌లో మనుషులు ప్రయాణించరు. కానీ అన్నీ ఊహించినట్లుగా జరిగితే 2024లో ప్రయోగించనున్న ఆర్టెమిస్-2 చంద్రుని పైకి కచ్చితంగా వ్యోమగాములను తీసుకుని వెళుతుంది. కాగా ఆర్టెమిస్ ప్రయోగం పట్ల ప్రతిఒక్కరూ సహనం వహించాలని, ఒకవేళ ఈ ప్రయోగం మరింత వాయిదా పడినా కూడా ఆశ్చర్యపోవద్దని నాసా వ్యోమగామి జెస్సికా మైయర్ చెప్పారు.